‘అజెండా’ సెట్ అయిపాయె…?

హుజూరాబాద్ తెలంగాణ రాష్ట్రసమితి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అన్ని దారులూ అక్కడికే అన్నట్లుగా కేసీఆర్ ప్రతి అడుగూ ఉప ఎన్నిక దిశలోనే వేస్తున్నారు. గెలుపే ముఖ్యం..లక్ష్యంగా మారింది. [more]

Update: 2021-09-06 09:30 GMT

హుజూరాబాద్ తెలంగాణ రాష్ట్రసమితి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అన్ని దారులూ అక్కడికే అన్నట్లుగా కేసీఆర్ ప్రతి అడుగూ ఉప ఎన్నిక దిశలోనే వేస్తున్నారు. గెలుపే ముఖ్యం..లక్ష్యంగా మారింది. ఏడాదికి పైగా ఢిల్లీ మొఖం చూడని ఆయన తాజా పర్యటనలో అనుకున్న లక్ష్యానికి బాటలు వేసేశారు. హుజూరాబాద్ లో పోటీ బీజేపీ , టీఆర్ఎస్ మధ్యనే ఉండబోతోంది. అందుకే కేంద్ర వైఫల్యాలను , రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను మరోసారి ప్రజల ముందుకు తెస్తున్నారు. ప్రధాని మోడీతోనూ, హోం మంత్రి అమిత్ షాతోనూ సమావేశమైన కేసీఆర్ భారీ అజెండానే వారి ముందు ఉంచారు. నిజానికి అవన్నీ పెండింగు సమస్యలే. వాటిని మరోసారి ప్రస్తావించి త్వరలో జరగనున్న ఎన్నికలలో కేంద్ర నిర్లిప్తతను ఎన్నికల అంశంగా మలచేందుకు కేసీఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లుగా రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వమూ బోల్తా పడక తప్పని పరిస్థితి. బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్యర్థి ఈటల రాజేందర్ ను కేంద్ర ప్రభుత్వం భుజాన తుపాకి పెట్టి కాల్చడానికి టీఆర్ఎస్ సిద్దమవుతోంది.

రక్షకునిగా రంగంలోకి…

ఢిల్లీ లో మకాం వేసిన కేసీఆర్ చాలా చురుకుగా పనులన్నీ చక్కబెట్టేశారు. ఒకవైపు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఢిల్లీలో పార్టీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసేశారు. ఇప్పటికే ఆంధ్ర,తెలంగాణ కలిసికట్టుగా ఏపీ భవన్ ను పంచుకుంటున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా అధికారికంగా మరో భవనానికి స్థలం కావాలని డిమాండ్ లేవనెత్తారు. ఆంధ్ర-తెలంగాణ మధ్య తలెత్తిన జలవివాదాలకు కేంద్రమే పరిష్కారం చూపాలనే కోణంలో ట్రిబ్యునల్ ను డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటే తప్ప ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదు. ఇంకోవైపు విభజన చట్టంలోని హామీలన్నిటినీ ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు హామీ ఇచ్చిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగులోనే ఉన్నాయి. ఈ విషయంలో ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ అంశాలే కార్యరూపం దాల్చాయి. వీటిని ప్రత్యేకంగా కేసీఆర్ ప్రస్తావిస్తూనే యాదాద్రి గుడి ప్రారంభానికి రమ్మంటూ ప్రధానిని ఆహ్వానించారు. ఇది ఉప ఎన్నికలకు ముందుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం లేదు. కాబట్టి రాజకీయంగా నష్టమేమీ లేదు. కేంద్రం వద్ద ప్రస్తావించిన మిగిలిన అంశాలన్నీ ఉప ఎన్నికల్లో విమర్శనాస్త్రాలు కాబోతున్నాయి. తాము ప్రధానిని కలిసి పదే పదే విన్నవించుకున్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం చేయడం లేదనే ఆరోపణను టీఆర్ఎస్ ఎక్కుపెట్టబోతోంది.

ట్రాప్ లో బీజేపీ..

బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీఆర్ఎస్ పై చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ మాత్రం ఆచితూచి తెలివిగా స్పందిస్తోంది. తమకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి విబేదాలు లేవనే కోణంలోనే వ్యవహరిస్తోంది. తాజాగా కేసీఆర్ ప్రధానమంత్రిని కలిసిన వైనంపై రాష్ట్ర బీజేపీ తప్పులో కాలేసింది. కేసీఆర్ బతిమాలుకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది టీఆర్ఎస్ కు రాజకీయ ఆయుధమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంగళి పురుగును సైతం ముద్దుపెట్టుకుంటానని గతంలోనే కేసీఆర్ అనేకమార్లు చెబుతూ వచ్చారు. తాము తెలంగాణ కోసం కేంద్రాన్ని బ్రతిమాలుకున్నా పని కావడం లేదని, ప్రధానిని కలిసినా రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు లభించలేదని టీఆర్ఎస్ ప్రచారం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పైపెచ్చు దేశ ప్రధానిని కలవడం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న హక్కు, బాధ్యత కూడా. దానిని రాజకీయ కోణంలో చూడలేం. బీజేపీ నాయకులు తమంత తాము రాజకీయం చేయడం టీఆర్ఎస్ కే కలిసి వస్తుంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో బీజేపీపై ఆధారపడకుండా సొంత ఇమేజ్ తో నెగ్గే ప్రయత్నం చేస్తున్నారు . ఇప్పుడు బీజేపీ నాయకుల అత్యుత్సాహం రాజేందర్ ముందరికాళ్లకు బంధం వేసే అవకాశం ఉంది.

కేంద్ర వైఫల్యాలే లక్ష్యం…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గడచిన ఏడేళ్లలో రాష్ట్రానికి ఏం చేసిందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. హైదరాబాద్ వంటి మహా నగరం అండగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు లేవు . కానీ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు చాలావరకూ అలాగే ఉన్నాయి. ఐటీ పరిశ్రమ మరింతగా విస్తరించడానికి వీలు కల్పించే ఐటీఐఆర్ వంటివి గతంలో మంజూరు అయినవి కూడా రద్దు అయిపోయాయి. హైదరాబాద్ లో ఉన్న అవకాశాల కారణంగానే ప్రయివేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి. కేంద్రం నుంచి మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ప్యాక్టరీ వంటి వాటి ఆచూకీ లేదు. ఇక్కడ నుంచి బీజేపీకి నలుగురు పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రంలో మంత్రి కూడా ఉన్నారు. అధికారం దక్కించుకోవడానికి రాష్ట్రంపై బీజేపీ పోకస్ పెట్టింది. అయినప్పటికీ కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల విషయంలో ఉదాసీనత కొనసాగుతోంది. ఇవన్నీ ప్రచారాంశాలుగా హుజూరాబాద్ లో హోరెత్తబోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని ముందు ఉంచిన జాబితా ఇందుకు ప్రాతిపదిక కాబోతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News