మోడీ ప్లస్ కేసీఆర్?

ఏదైతేనేమి? గులాబీ బాస్ కేసీఆర్ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. సౌతిండియాలో ఏ రాజకీయ పార్టీకి దక్కని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అది కూడా ప్రాంతీయ [more]

Update: 2021-09-16 05:00 GMT

ఏదైతేనేమి? గులాబీ బాస్ కేసీఆర్ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. సౌతిండియాలో ఏ రాజకీయ పార్టీకి దక్కని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అది కూడా ప్రాంతీయ పార్టీల పీకలు నులిమేయాలని తెగ కసి మీద ఉన్న మోడీ మాస్టార్ నుంచే దక్కించుకున్నారు. ఢిల్లీ నడిబొడ్డు మీద గులాబీ జెండాను ధీమాగా ఎగరేసిన ఖ్యాతి అయితే అచ్చంగా కేసీఆర్ సొంతమే. ఇంతవరకూ ఢిల్లీలో పార్టీ ఆఫీసులు అన్నీ కూడా జాతీయ పార్టీలవే ఉన్నాయి. కాదూ కూడదు అనుకుంటే ఉత్తాదిన బలంగా ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల ఆఫీసులు ఉన్నాయి. అంతే తప్ప దక్షిణాది నుంచి ఢిల్లీలో సొంత ఆఫీస్ భవనాన్ని తెరచిన ఘనత మాత్రం ఎవరికీ లేదు. ఆ విధంగా చూస్తే కేసీఆర్ ని మించిన ఘనులు ఎవరున్నారు అంటూ జబ్బలు చరుస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

అవును నిజమే …

కేసీఆర్ రాజకీయ గండర గండడే. లేకపోతే ఈ బక్కపలచని పెద్ద మనిషి ఉమ్మడి ఏపీని రెండుగా చేసి తెలంగాణా సాధించడాన్ని ఎవరైనా ఊహించగలరా? కేవలం రెండే సీట్లున్న టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలోని జాతీయ పార్టీలని ఒప్పించి తెలంగాణను రప్పించడం కంటే పెద్ద ఫీట్ వేరేది ఉందా. దానికే సాధించిన కేసీఆర్ కి ఢిల్లీలో సొంత భవనం కట్టడం ఒక లెక్కా అనవచ్చు. కానీ లెక్కలు చాలా మారాయిపుడు. మోడీ జమానా నడుస్తోంది. ఆయన కటాక్ష వీక్షణాలు ఎవరి మీద అయినా పడితేనే తప్ప ఇలాంటివి అసలు సాధ్యపడని విషయాలు. అలా కనుక ఆలోచిస్తే మోడీ సార్ కేసీఆర్ మీద ప్రేమ పెంచుకున్నారు అనుకోవాలేమో. లేక కేసీఆరే మోడీని తన బుట్టలో పడేశారు అని కూడా అనవచ్చేమో.

అక్కడ దోస్తీయేనా ..?

ఇలా కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ సొంత భవనానికి శంకుస్థాపన చేశారో లేదో అలా తెలంగాణా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగానే తగులుకున్నారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ ఇదే టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న అసలైన బంధం అంటూ చక్కంగా తెర వెనక కధ చెప్పేశారు. బండి సంజయ్ తెలంగాణాలో ఎంత కాళ్ళరిగి తిరిగినా కేసీఆర్ కి మోడీ దీవెనలు ఉండగా బీజేపీ పంట పండదని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. సరే బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ అంటుంది, అలా ఆ రెండు పార్టీలను కలపకపోతే కాంగ్రెస్ రాజకీయం ముందుకు సాగదు, ఆ సంగతి అలా ఉంచినా కూడా గులాబీ బాస్ మీద మోదీకి ఎందుకు అంత ప్రేమ అన్న డౌట్లు మాత్రం అందరిలో ఉన్నాయి.

అనుమానాలే….?

కేసీఆర్ మోడీ పేరు ఎత్తరు, కేంద్రాన్ని విమర్శించినా కూడా డైరెక్ట్ గా ఆయన పేరు పలకరు, ఇది చాలా కాలంగా సాగుతున్న వ్యవహారమే. ఇంకో వైపు చూస్తే టీఆర్ఎస్ కి అర్జంటుగా ముప్పు కాంగ్రెస్ నుంచే ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఊరూ వాడా పాతుకుపోయిన పార్టీ కాంగ్రెస్. రేపటి రోజున ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వాన విపక్ష కూటమి కొలువు తీరితే కచ్చితంగా తెలంగాణాలో టీఆర్ఎస్ టొపారమే లేచిపోయేది. ఇక బీజేపీ ఎంత గుద్దుకున్నా తెలంగాణా అంతటా విస్తరించడానికి ఏళ్ళూ పూళ్ళు పడతాయి. ఈ రకమైన రాజకీయ లెక్కలతోనే తక్కువ శత్రువుగా బీజేపీని కేసీఆర్ భావిస్తున్నారు అంటున్నారు. మోడీయే మరో టెర్మ్ ఢిల్లీ గద్దె మీద ఉండనీయ్, ఇక్కడ మన రాజకీయం పండనీయ్ అని కేసీఆర్ లాంటి అపర చాణక్యుడు ఆలోచిస్తే అందులో రాంగ్ ఏముంటుంది. అందుకే బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య ఇదో రకం పొలిటికల్ క్విడ్ ప్రోకో అనుకోవచ్చేమో.

Tags:    

Similar News