కేసీఆర్ టోన్ మారింది అందుకేనట

కొడుకును ముఖ్యమంత్రిని చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా కేసీఆర్ అసెంబ్లీ లో [more]

Update: 2020-09-23 00:30 GMT

కొడుకును ముఖ్యమంత్రిని చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తాజాగా కేసీఆర్ అసెంబ్లీ లో చేసిన ప్రసంగం ఈ ఊహాగానాలను నిజమే అనేలా ఉంది. ఒకసారి వెనక్కి వెళితే .. గత ఎన్నికల ముందు నుంచి కేసీఆర్ గళం లో చాలా మార్పు కనిపించింది. జాతీయ సమస్యలపై ఆయన ప్రధానంగా ప్రస్తావించడమే కాదు కాంగ్రెస్, బిజెపి లేని రాజకీయాలను దేశ వాసులు కోరుకుంటున్నారని ప్రచారం మొదలు పెట్టారు. అంతే కాదు కాలికి బలపం కట్టుకుని కలిసొచ్చే వారిని కలుపుకు వెళ్లేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. అయితే అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి అన్నట్లు ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి నేరుగా వచ్చేసింది. అది కూడా ఎవరి మద్దతు కోసం వెంపర్లాడాలిసిన పని లేకుండా ప్రజలు మోడీ సర్కార్ ను ఆశీర్వదించేశారు.

మరోసారి నీరు, నిధులు, విద్యుత్ …

తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నీళ్లు, నిధులు నియామకాలు అంటూ ఉద్యమించారు. దీన్ని తెలంగాణ సమాజం ఆమోదించి రెండోసారి కూడా కారు పార్టీకే జై కొట్టింది. అదే వ్యూహంతో ఇప్పుడు జాతీయ రాజకీయ అరంగేట్రం కోసం గులాబీ బాస్ ముందుకు వెళుతున్నట్లు ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 78 వేల టి ఎం సి ల నీరు అందుబాటులో ఉంటే అందులో సగం కూడా వినియోగించుకోలేక పోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా విద్యుత్ అంశం లోను కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీలు దేశ ప్రజలకు చీకట్లు చూపిస్తున్నాయంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. మన దేశ అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉన్నా చాలా రాష్ట్రాల్లో చీకట్లో మగ్గుతున్నాయని దీనికి పాలకుల తీరే కారణమంటూ కేసీఆర్ ఉతికేశారు. ఇలా గత ఎన్నికల ముందు కేసీఆర్ ఏ అంశాలైతే జాతీయ స్థాయిలో ఎత్తుకున్నారో అవే ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకురావడం చర్చనీయం అయ్యింది.

కేటిఆర్ కి పట్టాభిషేకం కోసమేనా …

చాలా రోజులుగా కేసీఆర్ కుమారుడు కెటీఆర్ కి పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయ్యిందనే మాట గులాబీ శిబిరంలో బాగా వినిపించేది. కుమారుడికి తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించి జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు వేస్తారనే అంతా లెక్కలు కట్టారు. అందరు భావిస్తున్నట్లే కేటీఆర్ సైతం అటు ప్రభుత్వం లో అన్ని తానై ఇటు పార్టీలోనూ తానె కేంద్ర బిందువుగా దూసుకుపోతున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పటినుంచి గులాబీ బాస్ వ్యూహం వేస్తున్నారని అందుకోసమే ఈ ప్రస్తావనలు చేస్తున్నారని భావిస్తున్నారు. అందుకే జాతీయ అంశాలపై కేసీఆర్ ఫోకస్ పెంచారని వస్తున్న వార్తలు నిజమో కాదో రాబోయే రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News