పులి స్వారీ ...దిగలేం....!

Update: 2018-09-05 15:30 GMT

కేసీఆర్ యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారు. పార్టీకి ఒక విషయాన్ని స్పష్టం చేసేశారు. ‘ఎన్నికల వరకూ ఈ పరుగాపకూడదు. విరమించినా , విశ్రమించినా ప్రత్యర్థులు పైచేయి సాధిస్తారు. ముందస్తు అయినా సార్వత్రికం అయినా సంగతి తేల్చుకునేంత వరకూ కొనసాగించాల్సిందే. పనిమొదలు పెట్టండి. మిగిలిన తంతు నేను చూసుకుంటాను. ఎక్కడ వెనక్కి తగ్గినా ఎన్నికల రణంలో ఓటమి తప్పదు’ ఈవిషయాన్ని నాయకులకు, క్యాడర్ కు స్పష్టం చేసేశారు. రానున్న మూడునెలలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కేసీఆర్ సిద్దం చేసేశారు. కత్తి తిప్పకలిగిన వాడే కదనరంగంలో నిలుస్తాడు. లేకపోతే కనీసం టిక్కెట్టు పొందడం కూడా సాధ్యం కాదు. ఇదో టెస్టింగ్ గ్రౌండ్. అందుకే నియోజకవర్గాలకే భారీ బహిరంగసభలను తెచ్చిపెడుతున్నారు కేసీఆర్. ఈ పరీక్షలో నెగ్గేవారికే సీట్ల వరం.

పరుగు ఆపవద్దు...

ముందుగా ఎన్నికల హడావిడి మొదలుపెట్టింది అధికారపార్టీ. మీడియాకు వివిధమార్గాల్లో లీకులు ఇవ్వడం ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. మూడు నెలలుగా పార్టీలోనూ, రాజకీయవర్గాల్లోనూ ఎక్కడ చూసినా ముందస్తు ముచ్చట సాగుతూ వచ్చింది. తాను పెదవి విప్పకుండానే తన చర్యల ద్వారా ఎన్నికలకు అనుకూలంగా రంగం సిద్దం చేసేశారు. ప్రధానిని మూడు పర్యాయాలు కలిశారు. ఎన్నికల కమిషన్ తో సంప్రతింపులు పూర్తి చేశారు. పార్టీలో ఎమ్మెల్యేలందర్నీ మానసికంగా సన్నద్దం చేసేశారు. ఇదంతా అందరికీ తెలిసే జరిగింది. రహస్యమేమీ లేదు. ప్రత్యర్థులు సైతం ప్రతిఘట్టాన్ని పరిశీలిస్తూ వచ్చారు. తాము సైతం ఎన్నికలకు అనుగుణమైన ప్రణాళికలు మొదలు పెట్టారు. ఈ స్థితిలో అధికారపార్టీ వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు రాకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ రాజకీయ వాతావరణాన్ని సృష్టించిన తాము ఆ దిశలోనే ముందడుగు వేయాలి. లేకపోతే క్యాడర్ డీలా పడిపోతుంది. సీరియస్ నెస్ లోపిస్తుంది. తన సహచరులకు ఈ విషయాన్ని కేసీఆర్ తేటతెల్లం చేశారు. వేడిని కొనసాగించకపోతే పార్టీ రాజకీయంగా నష్టపోతుందని తేల్చేశారు.

సంస్థాగత నిర్మాణం...

నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠపరుచుకోలేదు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలు, నాయకులను ఆకర్షించి వారిమీదనే ఆధారపడుతోంది. జిల్లా, నియోజకవర్గ,మండల కార్యవర్గాల వంటివాటిని పట్టించుకోలేదు. బూతు స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేసుకోలేదు. సెంటిమెంటు తో అధికారం దక్కింది. దానిని రాజకీయ స్థిరత్వానికి బాటలు వేసుకునేందుకు ఉపయోగించుకోవాల్సి ఉంది. పరిపాలన, సంక్షేమం వంటి విషయాల్లో టీఆర్ఎస్ సర్కారుకు మంచి మార్కులే పడతాయి. కానీ పార్టీ విషయంలో కేసీఆర్ తన వంతు బాధ్యతకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పలేం. దిద్దుకునేందుకు సమయమూ లేదు. రైతు సమన్వయ సమితుల వంటివాటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ అవి పూర్తిగా పార్టీ రూపును సంతరించుకోలేదు. నియోజకవర్గాల్లో నాయకుల సంఖ్య బాగానే ఉంది. కానీ గ్రూపుల బెడద వెన్నాడుతోంది. కేసీఆర్ ఇమేజ్ మీద ఆధారపడి మాత్రమే ఓటు బ్యాంకు ఉంది. పార్టీగా టీఆర్ఎస్ ఇంకా శైశవదశలోనే ఉన్నట్లుగా భావించాలి. అందువల్లనే వర్గాల వారీ నాయకులు ఉన్నప్పటికీ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో లేరు. ఎన్నికల నాటికి క్యాడర్ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే తానే స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ప్రజాశీర్వాదం...

ఇక ఎన్నికల వరకూ పార్టీ యే కాదు, తాను సైతం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అధినేత నిర్ణయించుకున్నారు. 50 రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద సభలు పెట్టాలని సంకల్పించడం ఇందులో భాగమే. ప్రగతి నివేదన సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరుకాలేదు.అది కొంత నిరాశపరిచింది. దానిని భర్తీ చేసుకునేందుకు పొలిటికల్ యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. హైదరాబాదు పరిసరాల్లోని 19 నియోజకవర్గాలను మినహాయించి మిగిలిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కవర్ చేసేలా పర్యటనలకు సిద్దం అయ్యారు. ప్రతి నియోజకవర్గంలోనూ 70 వేల మంది హాజరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కనీసం 50 వేలకు తగ్గకుండా హాజరవుతారని అంచనా వేస్తున్నారు.మొత్తమ్మీద 50 లక్షలమందిని ఉద్దేశించి ప్రత్యక్షంగా ప్రసంగించినట్లవుతుంది. హైదరాబాదుతో పాటు వరంగల్లు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి పట్టణాల్లో ప్రాంతీయ బహిరంగసభలు పెట్టాలని భావిస్తున్నారు. వీటికి లక్షల సంఖ్యలోనే జనసమీకరణ చేయబోతున్నారు. మొత్తమ్మీద తెలంగాణ రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్ తప్ప మరోపార్టీ పేరు వినిపించకుండా హోరెత్తించాలనేది కేసీఆర్ లక్ష్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News