కేసీయారే ఢిల్లీ మొనగాడు ?

జాతీయ రాజకీయాల్లో చక్రాలు చాలా మంది తిప్పారు, ఇంకా తిప్పేవారు కూడా క్యూలో ఉన్నారు. ఎవరెన్ని చేసినా కూడా అందరినీ మించి రికార్డు స్థాయి పని మాత్రం [more]

Update: 2020-10-17 15:30 GMT

జాతీయ రాజకీయాల్లో చక్రాలు చాలా మంది తిప్పారు, ఇంకా తిప్పేవారు కూడా క్యూలో ఉన్నారు. ఎవరెన్ని చేసినా కూడా అందరినీ మించి రికార్డు స్థాయి పని మాత్రం చేసింది అచ్చంగా కేసీయారే. ఎందుకంటే ఆయన ఢిల్లీలో తన పార్టీకి చక్కని స్థలం సంపాదించారు. అది కూడా మోడీ సర్కార్ మీద ఎదురుదాడి చేస్తూ సాధించారు. ఇప్పటిదాకా ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేదుట. మరి ఆ విధంగా చూసుకుంటే కేసీయార్ మొనగాడే అనిపించుకుంటారు అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలకు మాత్రమే పార్టీ ఆఫీసులు ఉన్నాయి. అవి జాతీయ పార్టీలు కాబట్టి ఉంటాయనుకున్నా ఒక ప్రాంతీయ పార్టీ నేత తొలిసారిగా ఢిల్లీలో భవనం కట్టడం అంటే విశేషమే అంటున్నారు.

మోడీ చేతుల మీదుగా …..

కేసీయార్ తన పార్టీకి ఢిల్లీలో ఒక స్థలం కావాలని 2018 లో కేంద్రానికి విన్నపం చేసుకున్నారు. ఆనాడు చూస్తే కేంద్రంతో కేసీయార్ మంచి దోస్తీ చేస్తున్నారు. కేంద్రంలోని పాలకుల చలువతో ముందస్తుగా అసెంబ్లీకి ఎన్నికలు కూడా పెట్టించుకున్నారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం తరువాత కేసీయార్ ప్లేట్ ఫిరాయించారు. ఏకంగా ఆయన మోడీకి ఆల్టర్నేషన్ గా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అని గత ఏడాది ఎన్నికల వేళ ఘీంకరించారు. కానీ ఆ ఫ్రంట్ చతికిలపడిపోయింది. ఇక మళ్ళీ ఈ మధ్యన కరోనా తరువాత కేసీయార్ మోడీ మీద బాగానే మండుతున్నారు. కేంద్రానికి ఎదురొడ్డి నిలిచే మగాణ్ణి తానేనని కూడా చెప్పుకుంటున్నారు. ఇలా ఉప్పూ నిప్పులా ఉన్న వేళ కేసీయార్ పార్టీకి కేంద్రం స్థలం ఇవ్వడం గొప్ప విషయమే.

బాబుకు లేదుగా ….

టీడీపీ వయసు మరో ఏడాదిలో నాలుగు దశాబ్దాలు. ఆ పార్టీకి పాతికేళ్లకు పైగా ప్రెసిడెంట్ చంద్రబాబు, పైగా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకుంటారు. ఆయన చక్రాలు తిప్పి ప్రధానులను, రాష్ట్రపతులను చేసారు కూడా, అలాగే రెండు మూడు ప్రభుత్వాలను నిలబెట్టారు కూడా. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన చంద్రబాబు తన పార్టీకి ఒక ఆఫీస్ స్థలాన్ని మాత్రం ఢిల్లీలో సంపాదించుకోలేకపోయారు. మరి బాబు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సఖ్యతగా ఉంటారు. పొత్తులు కూడా పెట్టుకుంటారు. అన్నీ చేసిన బాబు టీడీపీని ఢిల్లీలో ఎందుకు నిలబెట్టలేకపోయారు అన్నదే తమ్ముళ్ల ఆవేదనట. ఆ విషయంలో జూనియర్ అయినా కూడా కేసీయార్ బాబుని మించాడని అంటున్నారు. కేసీయార్ ముందు చూపునకు కూడా జేజేలు పలుకుతున్నారు.

అక్కడ నుంచేనట……

ఇక కేసీయార్ ది చిన్న పార్టీ. అయినా కూడా ఇపుడు జాతీయ స్థాయిలో వెలిగేందుకు సరైన రూటే దొరికింది. పార్టీ ఆఫీస్ ని సాధ్యమైనంత త్వరగా నిర్మించి అక్కడకు ఆయన షిఫ్ట్ అవుతారు అంటున్నారు. అంటే రానున్న రోజుల్లో కేసీయార్ జాతీయ రాజకీయాన్ని చాలా పక్కాగా చేస్తారు అంటున్నారు. అంటే ఎక్కడ నుంచో ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రా భవన్ లో బస చేస్తూ బాబు చేసే టెంపరరీ రాజకీయం మాదిరిలా కాదన్నమాట. ఇక చంద్రబాబు పేరుకు జాతీయ పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఏపీలో గల్లీ రాజకీయానికే పరిమితం కావడం పట్ల నిజమైన అభిమానులు బాధ పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఢిల్లీలో ఒక ప్రాంతీయ పార్టీకి స్థలం కేంద్రం ఇచ్చింది కాబట్టి మిగిలిన వారు కూడా దరఖాస్తులు చేసుకుంటారేమో. చూడాలి మరి. దేనికైనా ఆద్యుడు తానేనని కేసీయార్ నిరూపించుకున్నారుగా.

Tags:    

Similar News