కేసీఆర్ కు ఫస్ట్ టైమ్ షాకింగ్ రిజల్ట్....!

Update: 2018-07-27 15:30 GMT

తెలంగాణ రాష్ట్రసమితి ఒక వినూత్న ఆలోచన చేస్తోంది. అసెంబ్లీ సీట్ల సెంచరీ కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నా అదంత ఈజీ కాదని అధిష్టానానికీ తెలుసు. అయినా వంద కావాల్సిందేనని అధినేత కేసీఆర్ స్పష్టం చేసేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, లబ్ధిదారుల సంఖ్య, ఇప్పటికే నమోదైన టీఆర్ఎస్ సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుంటే గన్ షాట్ గా సెంచరీ కొట్టాలి. కానీ వాస్తవాలు వేరు. ప్రజల మనోభావాలు పథకాలతో ముడిపడి ఉండవు. తక్షణ ప్రయోజనాలు, శాశ్వత లబ్ధి రెంటినీ ఓటరు బ్యాలెన్సు చేసుకొంటున్నాడా? అన్నదే ప్రశ్న. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతిఒక్కరూ పార్టీకి విధేయంగా మారడం లేదని టీఆర్ఎస్ గ్రహించింది. దీంతో ఇంటికో కార్యకర్తను తయారు చేసుకోవాలనే దిశలో పథక రచన చేస్తోంది.

పారని స్కీమ్.....

రాష్ట్రంలో స్కీములకు కొరత లేదు. రైతు బంధు కింద 58 లక్షల మంది లబ్ధిదారులున్నారు. రేషన్ బియ్యం పథకంలో 87 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ..ఇలా చూసుకుంటూ పోతే మరో 50 లక్షలకు పైగానే లబ్ధిదారుల సంఖ్య చేరుతుంది. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే దాదాపు తెలంగాణలోని అందరు ధన రూపేణా, లేదా వస్తు రూపేణా, ప్రోత్సాహకం రూపేణా సర్కారీ సాయం పొందుతున్నట్లుగానే రికార్డులు చాటి చెబుతున్నాయి. రాష్ట్రంలోని మూడు కోట్ల అరవై లక్షల జనాభాకుగాను కోటి పైచిలుకు కుటుంబాలున్నాయి. స్కీముల లబ్దిదారుల సంఖ్య కోటిపదిలక్షల పైచిలుకు ఉంది. ఇందులో బియ్యం పథకాన్ని మినహాయించాలి. ఎందుకంటే ఆ ఒక్క పథకంలోనే 87.57 లక్షల మంది కి ఆరేసి కేజీల బియ్యం అందచేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే అడిగిన వారికి, అడగని వారికి అన్నీ అందచేస్తున్నట్లే భావించాలి. సంతృప్త స్థాయి సంక్షేమం అని కేసీఆర్ పదే పదే చెప్పడంలోని ఆంతర్యమదే. అయినా ప్రభుత్వానికి పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్ రావడం లేదు.

సభ్యత్వాలు సరదాకే...

టీఆర్ఎస్ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలు దాటిపోయింది. వీరంతా పార్టీ కోసం పనిచేసేందుకు స్వచ్ఛందంగా నమోదు చేసుకున్న కార్యకర్తలు. కుటుంబాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని లెక్కిస్తే ప్రతి రెండిళ్లకు ఒక కార్యకర్త ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రోడ్డుమీదకు వచ్చి పనిచేసే వారు కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు పెడుతున్న సమావేశాలకు నామమాత్రంగానే హాజరు ఉంటోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ద్వితీయశ్రేణి నాయకులు గంపగుత్తగా కార్యకర్తలను చేర్చేశారు. సభ్యత్వ రుసుములను సైతం చాలావరకూ నాయకులే చెల్లించివేశారు. సంఖ్యను పెంచి చూపించేందుకు నాయకులు పోటీలు పడ్డారు. బీమా వంటి సదుపాయాలు తోడవ్వడంతో ఆధార్ వివరాలను సైతం సమర్పించేందుకు స్వచ్ఛందంగానే ప్రజలు ముందుకు వచ్చారు. పార్టీ పట్ల అంకితభావం, విధేయతతో పనిచేసేవారికే కాకుండా, మొక్కుబడిగా అందరికీ మెంబర్షిప్ ఇచ్చేశారు. వీరంతా నిజమైన కార్యకర్తలు కారు. సగానికి పైగా పార్టీతో సంబంధం లేనివారే. అయినా పోటీ వాతావరణంలో ఆధిక్యాన్ని నిరూపించుకోవడానికి ఈ తరహా గిమిక్కులు తప్పవు. అందువల్ల పార్టీ ప్రచారానికి , ఓట్లను రాబట్టడానికి ఈ కార్యకర్తలను నమ్ముకునే పరిస్థితి లేదు.

ఫలిస్తే ఓట్ల పండగే...

వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులను టీఆర్ఎస్ కు అనుకూలంగా మలచడంలో ఇంతవరకూ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సహజంగానే సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందినవారు టీఆర్ఎస్ ను ఆదరిస్తారనే నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ పథకాలు అందుకోవడం తమ హక్కుగానే ఓటర్లు భావిస్తున్నట్లు ఇటీవలి ఒక సర్వేలో తేలింది. టీఆర్ఎస్ నాయకులకు ఈ షాకింగ్ రిజల్ట్సు చూసి దిమ్మతిరిగిపోయింది. ఇకపై జాగ్రత్త పడాలని నిర్ణయించారు. రాష్ట్రజనాభాలో 51 శాతం అంటే కోటి 85 లక్షల వరకూ ఉన్న వెనకబడిన తరగతులపై ద్రుష్టి సారిస్తున్నారు. వీరికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, రుణ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బీసీలలో 34 శాతం వరకూ బాగా వెనకబడిన వర్గా(ఎంబీసీ)లు ఉన్నాయి. 36 కులాలను ఈమేరకు గుర్తించారు. ఇప్పటికే బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు వెయ్యి కోట్ల మేరకు కేటాయింపులు చేశారు. ఈ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వయంఉపాధి నిమిత్తం 50 వేల రూపాయల లోపు రుణమిస్తే పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని సర్కారునిర్ణయించింది. లక్ష రూపాయలు అప్పు మంజూరు చేస్తే 80 వేల రూపాయలను సబ్సిడీగా ఇచ్చేలా పథకరచన చేశారు. బీసీలను టార్గెట్ చేసుకుంటూ ఈ రుణ పథకాలు రూపొందించారు. ఎన్నివేల కోట్లరూపాయలు ఖర్చయినా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు ఇతర పథకాల లబ్ధిదారులను గుర్తించి పార్టీ కి పనిచేసేలా వ్యూహం రూపొందిస్తున్నారు. రానున్న ఆరునెలల్లో ప్రతి ఇంటిలో ప్రభుత్వ పథక లబ్ధిదారైన ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఉండాలనేది గమ్యంగా పార్టీ అడుగులు వేస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News