నెట్టేశారుగా?

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయే పరిస్థితి కన్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో వీరంతా [more]

Update: 2020-02-16 09:30 GMT

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయే పరిస్థితి కన్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఐదేళ్లు గడిచేసరికి వీరి పరిస్థితి పూర్తిగా రివర్స్ కావడం విశేషం. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నేతలను దరిదాపుల్లోకి రానివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తొలినాళ్లలో వారే…..

2014లో అధికారంలోకి రావడంతో కొందరు సీనియర్ నేతలు అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ, పదవుల భర్తీలోనూ వారిదే పైచేయిగా మారింది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, మధుసూధనాచారి, జూపల్లి కృష్ణారావు, వేణుగోపాలాచారి తదితరులు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వీరి వైపు చూడను కూడా చూడటం లేదు.

ఓటమి పాలు కావడంతో…..

తుమ్మల నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆయనను లైట్ గా తీసుకుంటున్నారు. ఆయనపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో ఇక తుమ్మలతో పనిలేకుండా పోయింది. జిల్లాలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ ఉండటంతో ఇక తుమ్మల మాట చెల్లుబాటు కావడం లేదు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సయితం ఎన్నికల్లో ఓటమి పాలయి ఇప్పుడు పదవి కోసం ఎదురుచూపులు చూస్తున్నా పట్టించుకోవడం లేదట.

ఎదురు చూపులేనట…..

ఇక మరోమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమి పాలయి పదవి కోసం ఇప్పటి వరకూ ఓపికతో చూశారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని రెబల్స్ గా బరిలోకి దించి షాక్ ఇద్దామనుకున్న జూపల్లికి టీఆర్ఎస్ రివర్స్ షాక్ ఇచ్చింది. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. తొలి సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కన్పించడం లేదు. గత ప్రభుత్వంలో ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేణుగోపాలాచారి పదవీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో ఆయన కూడా నిరాశలో ఉన్నారు. ఇక మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్ ల పరిస్థితి అంతే. ఇక మరో సీనియర్ నేత కె.కేశవరావు రాజ్యసభ పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారా? లేదా? అన్నది కూడా డౌటేనంటున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ లో సీనియర్ నేతలను దాదాపు పక్కకు నెట్టేసినట్లేనని చెప్పుకోవాలి.

Tags:    

Similar News