"సెటిల్" కాని టీఆర్ఎస్.....!

Update: 2018-08-01 15:30 GMT

ఆంధ్రా సెటిలర్ల పట్ల కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించేసింది. సొంతంగా బరిలోకి దిగాలా? లేక వేరే వారితో పొత్తు పెట్టుకోవాలా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది టీడీపీ. బీజేపీ, మిగిలిన పార్టీలకు సెటిలర్లు పెద్దగా మద్దతిచ్చే సూచనలు కనిపించడం లేదు. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెసులు వీరి ఓట్లను పంచుకునే అవకాశాలున్నాయి. ఎవరు ఎక్కువగా వీరిని ఆకట్టుకోగలరనే దానిపై 25 కి పైగా నియోజకవర్గాల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. వీటిని గంపగుత్తగా తెచ్చుకోగలిగిన పార్టీకి గెలుపు నల్లేరుపై బండి మాదిరిగానే ఉంటుందని పరిశీలకుల అంచనా. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సెటిలర్ల మద్దతు ఎవరికి ఉండబోతోందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతోంది. గుంభనంగా వ్యవహరించే ఈ ఓటర్ల నాడి పట్టుకోవడం ఎవరికి సాధ్యం కావడం లేదు.

కాంగ్రెసు కాసింత స్పీడు....

రాష్ట్రవిభజన తర్వాత ఆంద్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెసును తీవ్రంగా ద్వేషించారు. వారితో పాటు తెలంగాణలో సెటిల్ అయినవారు కూడా కాంగ్రెసుకు గుణపాఠం చెప్పాలనుకున్నారు. దీంతో 20 నియోజకవర్గాలకు పైగా కాంగ్రెసు నష్టపోయినట్లు అంచనా. ఈమేరకు టీడీపీ, బీజేపీ కాంబినేషన్, కొన్ని చోట్ల టీఆర్ఎస్ లాభపడ్డాయి. ఈ విషయం తెలిసినా 2014 ఎన్నికల్లో కాంగ్రెసు చేయగలిగిందేమీ లేకుండా పోయింది. రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు సంఘటితంగా తమ పార్టీకి మద్దతిస్తారని భావించారు. ఆ వ్యూహం వికటించింది. సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్న ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెసు విజయం సాధించలేకపోయింది. 2019 ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో సెటిలర్లను ఆకట్టుకునే పనిలో పడింది కాంగ్రెసు నాయకత్వం. హైదరాబాదు, రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొందరు సెటిలర్లను ఎంపిక చేసి కాంగ్రెసు టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెసు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ పట్ల వ్యతిరేకత తగ్గుముఖం పడుతుంది. సెటిలర్లు బరిలో నిలిస్తే ఓవరాల్ గా అన్నిచోట్ల వారి మద్దతు కాంగ్రెసుకు లభిస్తుందని అంచనా వేసుకుంటోంది. ఈ మేరకు అధిష్టానమూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.

ఠికాణా లేని టీడీపీ...

ఈసారి టీడీపీకి తెలంగాణలో చుక్కెదురే. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులే కాదు పార్టీ అగ్రనాయకత్వమూ అదే అంచనాతో ఉంది. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏదో ఒకపార్టీతో పొత్తు పెట్టుకోకపోతే తీవ్రమైన భంగపాటును చవిచూడాల్సి వస్తుందని ద్వితీయశ్రేణి నాయకులు హెచ్చరిస్తున్నారు. టీడీపీలో ఉంటూ గతంలో పదవులు అనుభవించిన కొందరు పార్టీని వీడలేకపోతున్నారు. ఇతర పార్టీల్లో తగిన పదవులు లేకపోవడమూ ఇందుకు కారణం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ కిక్కిరిసిపోయింది. కాంగ్రెసులో సీట్ల కొట్లాట ఎక్కువై పోయింది. దిగువశ్రేణి కార్యకర్తలు చాలా వరకూ పార్టీని వీడిపోయారు. సామాజిక పునాదుల కారణంగా బీసీ వర్గాల్లో ఇంకా అక్కడక్కడా పార్టీ పట్ల ఆదరణ వ్యక్తమవుతోంది. కానీ అసెంబ్లీ స్థానాలను గెలిపించేంత స్థాయి మద్దతు కాదు. ఉన్న ఓట్లను సంఘటితం చేసుకుంటూ ఇతరుల మద్దతు కూడగట్టగలిగితేనే ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టగలమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక ప్రజాదరణ కలిగిన పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. కాంగ్రెసు, టీఆర్ఎస్ లలో ఏ పార్టీ తో అయినా ప్రయోజనదాయకమేనంటున్నారు.

‘ప్రత్యేక’ పొరపాటు...

టీఆర్ఎస్ పట్ల సెటిలర్లు కొంత సానుకూల ధోరణితో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారంతా మూకుమ్మడిగా అధికారపార్టీకి అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ సంకీర్ణానికి జై కొట్టిన సెటిలర్ ఆ తర్వాత తన స్టాండ్ మార్చుకున్నాడు. బీజేపీతో టీడీపీ ఎలాగూ కలిసి నడవడం లేదు. టీడీపీకి ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చినా పెద్దగా ప్రయోజనం లేదు. వారికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నవి కాంగ్రెసు, టీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెసు కొంత చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎస్ సైతం కొంతకాలంగా ఇక్కడ స్థిరపడినవారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించింది. అయితే అవిశ్వాస తీర్మాన సందర్భంగా యూ టర్న్ తీసుకుంది. ఇది కొంతమేరకు టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతోంది. కేసీఆర్ సందర్భానికి తగినవిధంగా పావులు కదపడంలో దిట్ట. ఎన్నికల ఘడియ సమీపిస్తే ..ఈసారి సెటిలర్లకు భారీ తాయిలాలు ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News