ఇంకెందుకు ఆ సందేహం....?

Update: 2018-08-07 14:30 GMT

‘మాకు మీరు..మీకు మేము..సందేహాలు లేవు. శంకలు, శషభిషలకు తావే లేదు.’ ఇదే సందేశం ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సాగిన సమావేశం చాటిచెప్పిన సత్యం. రెండు నెలల వ్యవధిలో రెండోసారి భేటీ సాగడము చిన్న విషయం కాదు. మధ్యలో టీఆర్ఎస్ వారసుడు కేటీఆర్ కూడా ప్రధానితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సంగతి పక్కనపెడితే..ఒక రాష్ట్రమంత్రికి ప్రధాని ప్రత్యేకంగా సమయమిచ్చి కీలకాంశాలు చర్చించడమూ సాధారణ విషయం కాదు. రాష్ట్రమంత్రులు కేంద్రమంత్రులను కలుస్తుంటారు. అవసరమైతే రాష్ట్ర అంశాలపై ఎంపీలు ప్రధానితో సమావేశమవుతారు. మొత్తంగా సాగుతున్న పరిణామాలు, పర్యవసానాలు,ప్రభావాలను అంచనా వేస్తే కచ్చితంగా కమలానికి, కారుకు మధ్య ఏదో జరిగిందనేది పరిశీలకుల అంచనా. పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్న తీరును బట్టి చూస్తే భవిష్యత్తులో దోస్తానా పక్కా అని స్పష్టమవుతోంది.

తొలిదశలో తొట్రుపాటు...

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పాటైన తొలిదశలో తెలంగాణ మాట కేంద్రంలో చెల్లుబాటు అయ్యేదికాదు. కేసీఆర్ ను ప్రధాని మోడీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావడం, కేంద్రంతో అవసరాలు ఉండటంతో టీఆర్ఎస్ కొంత చెలిమి చేసే ప్రయత్నాలు సాగించింది. బీజేపీ, టీడీపీ రెంటికీ హానీమూన్ పీరియడ్ నడుస్తుండటంతో కేసీఆర్ ను కమలనాథులు నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో పరిష్కరించాల్సిన సమస్యలు, విభజన సమస్యలు, హైకోర్టు , ఆస్తుల పంపిణీ రకరకాలుగా తెలంగాణ ప్రభుత్వం చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయంగా కేంద్రం అండ ఉంటే బాగుంటుందనే భావనలో ఉండేవారు. కానీ చంద్రబాబు నాయుడు దీనికి అడ్డుచక్రం వేయగలిగారు. బీజేపీలో స్థానిక నాయకత్వం టీడీపీ కంటే టీఆర్ఎస్ తో చెలిమి బాగుంటుందనే విషయాన్ని అధిష్టానానికి చేరవేశారు. అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకులు పెద్దగా స్పందించలేదు. టీడీపీ క్రమేపీ క్షీణిస్తుంది కాబట్టి ఆ బలాన్ని, బలగాన్ని అందిపుచ్చుకుని సొంతంగా బలపడాలని కమలనాధులు వ్యూహరచన చేశారు. ఎంపీ కవిత కేంద్రంలో చేరేందుకు చాలా ఆసక్తి చూపించారు. కేంద్రప్రభుత్వంపై అనేక విషయాల్లో ప్రశంసల వర్షం కురిపించారు. అయినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు.

మధ్యలో మారాం....

ఓటుకు నోటు వివాదంతో తెలుగుదేశం సెల్ఫ్ గోల్ చేసుకున్న తర్వాత పరిస్థితులు వేగంగా మారుతూ వచ్చాయి. టీడీపీ ని కేసీఆర్ పూర్తిగా ఇరకాటంలోకి నెట్టేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదును ఖాళీచేయకతప్పని అనివార్యతను కల్పించారు. తెలంగాణలో టీడీపీ మునిగే నావ అన్న సంగతి బీజేపీ గ్రహించింది. టీడీపీని భుజాన పెట్టుకుని తమ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కేసీఆర్ కొంత ఆగ్రహానికి గురయ్యారు. ప్రధానిని నియంత అంటూ నిందించారు. బీజేపీపై టీఆర్ఎస్ ఎంపీలు రాజకీయ దాడి మొదలుపెట్టారు. ఆ దశలో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. టీడీపీ, కాంగ్రెసులను బలహీనపరిచి ఆకర్ష మంత్రంతో కేసీఆర్ పూర్తిగా బలపడ్డారు. ఎదురులేని రీతిలో పార్టీని తీర్చిదిద్దుకున్నారు. ఉప ఎన్నికల్లో అప్రతిహత విజయాలు సాధించారు. ఇతరపార్టీల ప్రజాబలం సంగతి బయటపడిపోయింది. దాంతో ఎంఐఎంతో మాత్రమే స్నేహం చేస్తూ మిగిలిన పార్టీలను కేసీఆర్ దూరం పెట్టారు. కేంద్రంతో కయ్యానికి సైతం సిద్ధపడ్డారు. ఈలోపుగానే బీజేపీ,టీడీపీ ల మధ్య సంబంధాలు క్రమేపీ క్షీణిస్తూ వచ్చాయి. గత ఏడాదికాలంగా రెండు పార్టీలు దూరమయ్యాయనే చెప్పాలి. చంద్రబాబు నాయుడికి కనీసం ప్రధాని అపాయింట్ మెంట్ లభించడానికే ఏడాది కాలంపైనే పట్టింది. దీనిని అనువుగా మలచుకుంటూ కేంద్రానికి సన్నిహితమయ్యే విధంగా పావులు కదిపారు కేసీఆర్.

ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్..?

కేసీఆర్ ఏ ప్రకటన చేసినా, నిర్ణయం తీసుకున్నా అందులో రాజకీయ ఎత్తుగడ దాగి ఉంటుంది. కీలకమైన సమయాల్లో కేంద్రానికి అండగా నిలవడంతో మోడీ నుంచి మంచి మార్కులు కొట్టేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విషయాల్లో తెలంగాణ బాగా సహకరించింది. మధ్యలో మూడో ఫ్రంట్, సెక్యులర్, ఫెడరల్ ఫ్రంట్ పేరిట చేసిన హడావిడి కూడా బీజేపీకి కలిసొచ్చేదే అన్న విమర్శలూ ఎదురయ్యాయి. జాతీయ స్థాయి నేతగా అవసరమైన సొంత బలం పెంచుకుంటూనే జాతీయ పార్టీలతో బేరసారాలు సాగించాలనేది కేసీఆర్ వ్యూహం. అందుకు ఫెడరల్ ఫ్రంట్ దోహదపడుతుందని ఆశించారు. కానీ దీనికి పెద్దగా స్పందన రాలేదు. ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కేసీఆర్ ను పూర్తిస్థాయిలో విశ్వసించలేదు. జాతీయంగా బీజేపీ బలహీనపడటంతో దక్షిణాదిన ఒక మంచి మిత్రుడు కావాల్సిన అవసరం ఏర్పడింది. కేసీఆర్ ను అక్కున చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. శత్రవుకు శత్రువు మిత్రుడు అన్న రాజకీయ సూత్రం ప్రకారం బీజేపీకి, టీఆర్ఎస్కు కాంగ్రెసు ప్రధాన ప్రత్యర్థి. దాంతో రెండు పార్టీలు చెలిమికి చేరువయ్యాయి. రాజకీయంగా పొత్తుల స్థాయికి వెళ్లకపోయినా భవిష్యత్తులో సహకరించుకునే దిశలో ఒక అంగీకారానికి వచ్చినట్లుగా టీఆర్ఎస్ లో ప్రచారం జోరందుకుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News