ఒక్క ఓటమితో ఎంత మార్పు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఇటీవల కాలంలో అనూహ్యమైన మార్పు కన్పిస్తోంది. ఒక్క ఓటమి ఆయనలో గణనీయమైన మార్పు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ ప్రగతి [more]

Update: 2020-12-22 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఇటీవల కాలంలో అనూహ్యమైన మార్పు కన్పిస్తోంది. ఒక్క ఓటమి ఆయనలో గణనీయమైన మార్పు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ ప్రగతి భవన్ కే పరిమితమై తాను అనుకున్న నిర్ణయాలనే అమలు చేస్తున్న కేసీఆర్ ఇప్పుడు కొంత సమస్యలపై దృష్టి పెట్టినట్లే కన్పిస్తుంది. ఇన్నాళ్లూ సంక్షేమ పథకాలతో నెట్టుకు వస్తున్న కేసీఆర్ దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్ల తిరస్కారంతో ప్రజల్లో తమ పట్ల ఉన్న వ్యతిరేకత కేసీఆర్ కు అర్థమయింది.

సాగర్ ఉప ఎన్నికతో…..

మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రానుంది. ఇది కూడా సిట్టింగ్ స్థానమే. ఇప్పటికే సిట్టింగ్ స్థానం దుబ్బాకలో ఓటమి చవిచూసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఆ ఫలితం రాకూడదని భావిస్తున్నారు. అందుకే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడి ఆరు సంవత్సరాలయింది. ఈ ఆరేళ్లలో నిరుద్యోగులను గురించి పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో పాటు ఉద్యోగాల భర్తీ ఊసే లేకుండా పోయింది. తెలంగాణ వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు.

అసంతృప్తిలో యువత…..

తెలంగాణ ఉద్యమానికి చిరునామాలుగా నిలిచిన యూనివర్సిటీలను సయితం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సిలర్ లను కూడా నియమించలేదు. యూనివర్సిటీల్లో ఎలాంటి ఉద్యమాలు తలెత్తకుండా ఉక్కుపాదంతో అణిచివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో తెలంగాణలో యువత టీఆర్ఎస్ పార్టీపైనా, కేసీఆర్ పైనా తీవ్ర అసంతృప్తితో ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

యాభై వేల ఉద్యోగాలు….

తెలంగాణలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పోలీస్, విద్యాశాఖల్లో ఖాళీ గా ఉన్న యాభై వేల పోస్టులను భర్తీ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల వివరాలను సేకరించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లోపే కనీసం ఒక నోటిఫికేషన్ అయినా విడుదలయ్యే అవకాశముంది. మొత్తం మీద దుబ్బాకలో ఓటమి కేసీఆర్ లో అనూహ్యమైన మార్పు తెచ్చిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News