Kcr : కొత్త మురిపెం కదా? చంకనెక్కించుకుంటాడులే

తెలంగాణ అధికార పార్టీలో అంతర్గత పోరు సిద్ధంగా ఉంది. కేసీఆర్ కొత్తగా వచ్చిన వాళ్లకు ఇస్తున్న ప్రాధాన్యత పాతవారికి ఇవ్వరన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటికి ముద్దొచ్చి [more]

Update: 2021-10-29 11:00 GMT

తెలంగాణ అధికార పార్టీలో అంతర్గత పోరు సిద్ధంగా ఉంది. కేసీఆర్ కొత్తగా వచ్చిన వాళ్లకు ఇస్తున్న ప్రాధాన్యత పాతవారికి ఇవ్వరన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటికి ముద్దొచ్చి చంకనెక్కించుకునే కేసీఆర్ తర్వాత విసిరిపారేసిన నేతలు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని, కేసీఆర్ ను నమ్ముకుని వచ్చిన అనేకమంది నేతలు ఇప్పుడు ఎటూ కాకుండా పోతున్నారు. అందులో కడియం శ్రీహరి ఒకరు.

కడియం విషయంలో….

కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అండగా నిలిచారు. రాష్ట్రం వచ్చే ముందు ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఫలితంగా ఆయన 2014లో ఎంపీ అయ్యారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న రాజయ్యను తప్పించి వెంటనే కడియం ను ఎమ్మెల్సీని చేశారు. ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అంతే…కడియం ప్రస్థానం అంతటితో ముగిసిందనే అనుకోవాలి. ఇప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది.

మోత్కుపల్లికి పెరిగిన ప్రాధాన్యత….

తాజాగా మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. దళిత వర్గానికి చెందిన ఆయనకు సహజంగానే కేసీఆర్ ప్రయారిటీ ఇస్తారు. కొత్త మురిపెం కావడంతో మోత్కుపల్లికి పదవులు ఇచ్చినా ఇవ్వొచ్చు. అందుకే కడియం శ్రీహరికి ఇప్పుడు బెంగ పట్టుకుంది. కొంతకాలం క్రితం వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ కడియం శ్రీహరి ఇంటనే భోజనం చేశారు. దీంతో ఆయనకు పదవి గ్యారంటీ అనుకున్నారు.

ఇద్దరూ టీడీపీ నుంచే….

కడియం శ్రీహరి, మోత్కుపల్లి నరసింహులు ఇద్దరూ టీడీపీలో కలసి పనిచేసిన వారే. వచ్చే ఎమ్మెల్సీల పదవుల భర్తీలో కడియం శ్రీహరికి చోటు ఉంటుందని భావించారు. కడియం శ్రీహరి కూడా గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులుకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతుంది. కొత్తగా వచ్చిన నేత కావడంతో మోత్కుపల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే కడియంను పార్టీలో క్రమంగా పక్కనపెడుతున్నట్లే అనుకోవాలి.

Tags:    

Similar News