అన్నీ తెగించే రంగంలోకి దిగారట

హుజురాబాద్ ఎన్నికల్లో విజయం టీఆరెస్ పార్టీకి చావో రేవో అన్న చందంగా మారిపోయాయి. తమ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఈటెల రాజేందర్ రాజకీయ భవిత సంగతి పక్కన [more]

Update: 2021-09-01 09:30 GMT

హుజురాబాద్ ఎన్నికల్లో విజయం టీఆరెస్ పార్టీకి చావో రేవో అన్న చందంగా మారిపోయాయి. తమ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఈటెల రాజేందర్ రాజకీయ భవిత సంగతి పక్కన పెడితే గులాబీ పార్టీ చతికిల పడితే తెలంగాణ లో కేసీఆర్ కు బలమైన ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న రాజకీయ పోరాటం లో ఒక అడుగు ముందుకు పడినట్లే. ఈ సంగతి తెలిసిన కారు పార్టీ గేర్ మార్చి దళిత బంధు పథకంతో సర్కారీ డబ్బుతో దళిత ఓట్లకు వ్యూహం ప్రకారం ఎర వేసిందనేది విపక్షాల ఆరోపణ. రెండు సార్లు అధికారంలోకి వచ్చి పాలన చేస్తున్నా ఇప్పటివరకు ఇలాంటి స్కిం ప్రజలకు అందించని కేసీఆర్ పార్టీ బతుకు కోసం తెగించే రంగంలోకి దిగారు అన్నది ఇప్పటికే స్పష్టం అయిపొయింది. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హుజురాబాద్ లో ఓటమి కి గులాబీ గురైతే దళితబంధు అటకెక్కడం ఖాయమేనా అనే సందేహాలు వ్యక్తం చేసేలా ఉండటం గమనార్హం.

ఓటర్లకు హింట్ ఇచ్చిన కేసీఆర్ …

కేసీఆర్ ఇప్పటివరకు చెప్పింది చేసిన పనులు తక్కువే. దళిత ముఖ్యమంత్రి హామీ, దళితులకు మూడెకరాల భూమి వంటి అంశాలు నేటికీ విపక్షాలకు అస్త్రాలుగానే ఉన్నాయి. దళితబంధు కేవలం హుజురాబాద్ ఎపిసోడ్ వరకే ఉంటుందని ఇప్పటికే తెలంగాణ లో ఆందోళనలు మిన్నంటాయి. అనేక నియోజకవర్గాల్లో దళితులు మాకు ఇది ఇప్పుడే పెట్టండి అంటూ నినదిస్తున్నారు. ఇలా అన్ని వైపులా వత్తిడి పెరుగుతున్నా ప్రస్తుత టార్గెట్ ఈ ఉపఎన్నికల్లో గెలుపే అన్న లక్ష్యం మాత్రమే కేసీఆర్ లో కనబడుతుంది. హుజురాబాద్ లో విజయం దక్కకపోతే దళితబంధు అమలు ప్రశ్నార్ధకం అవుతుందనే రీతిలో పరోక్షంగా ఓటర్లకు గులాబీ బాస్ హింట్ ఇచ్చారు.

అదేనా ఆలోచన …

ఇక్కడ దక్కే గెలుపుతోనే దశలవారీగా పథకాన్ని అమలు చేస్తామని చెప్పక చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స్కిం కూడా జీహెచ్ ఎంసీ ఎన్నికల ముందు వరదబాధితులకు పదివేల రూపాయలు అందిస్తామని చెప్పినట్లే ఉంటుందని రాజకీయ విమర్శకుల అంచనా. లేదంటే రాష్ట్రం అంతా అధ్యయనం పేరుతో వచ్చే ఎన్నికల ముందు వరకు కథ నడిపి నోటిఫికేషన్ ఇచ్చేముందు కొందరికి ఇచ్చి వచ్చాకా ఎన్నికల కమిషన్ ఎలాగూ నిలిపేస్తుందనే వ్యూహంతోనే కేసీఆర్ చర్యలు ఉండొచ్చని కూడా పలువురు అనుమానిస్తున్నారు. ఏమి జరుగనుంది అన్నది హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తరువాతే తేలనుంది.

Tags:    

Similar News