డ్యామేజ్ కంట్రోల్.....!

Update: 2018-08-14 14:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కౌంటర్ వ్యూహం మొదలైంది. గడచిన కొంతకాలంగా కమలంతో, కారు పార్టీ స్నేహంపై రాజకీయం హోరెత్తుతోంది. కేసీఆర్, మోడీ మధ్య విరబూస్తున్న మైత్రీభావం మొహమాటం లేకుండానే బయటపడిపోయింది. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రధాని కితాబునిచ్చారు. ప్రగతి దిశలో ఆలోచనలు సాగిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. అవిశ్వాసతీర్మానం, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ప్రతిఫలం సమర్పించింది టీఆర్ఎస్. అధికారపార్టీకి అనుకూలమైన నిర్ణయాలతో సానుకూలతను వ్యక్తం చేసింది. రెండు నెలల వ్యవధిలోనే ప్రధానితో రెండుమార్లు భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. కేంద్రమంత్రులు రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతిసందర్భంలోనూ పొగడ్తల వాన కురిపిస్తున్నారు. ఇవన్నీ మైలేజీ ఇవ్వడానికి బదులు టీఆర్ఎస్ కు రాజకీయ కష్టాలు తెచ్చి పెట్టే వాతావరణం ఏర్పడింది. ముస్లింలు, దళితులు సంఖ్యాపరంగా ప్రభావశీలమైన స్థాయిలో ఉండటంతో కేసీఆర్ ప్రమాదాన్ని పసిగట్టారు. డామేజీ కంట్రోల్ కు రంగంలోకి దిగారు. కమలానికి, కారుకు పొంతనే లేదంటూ దూరం చూపించేందుకు యత్నాలు చేపట్టారు.

కమలం, కాంగ్రెసుకు సింగిల్ కౌంటర్...

ఒక దెబ్బకు రెండు పిట్టలు. టీఆర్ఎస్, బీజేపీలకు మధ్య తేడా లేదు. రెండూ ఒకటే అంటూ కాంగ్రెసు ప్రచారాన్ని మొదలుపెట్టింది. బీజేపీతో సాన్నిహిత్యంపై పార్టీ క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధినేతపై పడింది. అందుకే రాహుల్ తెలంగాణ పర్యటనను సందర్భంగా చేసుకుంటూ కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీని బయటికి తీశారు. కేంద్రంపై ధ్వజమెత్తడం ద్వారా రెండు పార్టీల మధ్య దూరాన్ని చాటిచెప్పాలని ప్రయత్నించారు. రాష్ట్రంలో ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపుదలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్లనూ పక్కనపెట్టేశారని నిలదీశారు. నీతి అయోగ్ నీరు కారిపోయిందన్నారు. రాష్ట్రాలను మునిసిపాలిటీలుగా మార్చేస్తారా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇవన్నీ పొలిటికల్ అజెండాతో ముడిపడిన అంశాలే. కమలం పార్టీని తాము సహించేది లేదని చెప్పడమూ భాగమే. ఒంటరిగానే పోటీకి వెళతామని గట్టిగా చెప్పడమూ రాజకీయ సంకేతమే. లేకపోతే బీజేపీ,టీఆర్ఎస్ ల పోకడలను ఒకే గాట కట్టి కాంగ్రెసు ఎన్నికల గోదాలోకి దిగితే ఎంతో కొంత నష్టం అధికారపార్టీకి తప్పదు. సింగిల్ కౌంటర్ తో ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కేసీఆర్ భావించారు.

రాహుల్ రేంజ్ పడిపోయిందా..?

ఏఐసీసీ అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో రెండు రోజుల పర్యటన చేశారు రాహుల్ గాంధీ. ఇది కచ్చితంగా కొంత ప్రభావం చూపుతుంది. అందుకే మీడియాలో కేవలం రాహుల్ మాత్రమే హైలైట్ కాకుండా కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. తన వాటా తాను తీసేసుకున్నారు. రాహుల్ పై రాజకీయ విమర్శలనూ గుప్పించారు. ఎవరో రాసిన స్క్రిప్టు చదువుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే 2014లో. కాంగ్రెసు పాలనలో మిగులు రాష్ట్రమంటూ ఎలా చెబుతారంటూ టెక్నికల్ పాయింటు లేవదీశారు. టీఆర్ఎస్ కు ప్రధాన అవరోధంగా మారిన డబుల్ బెడ్ రూం పథకంపైనా రాహుల్ గురి పెట్టడం కేసీఆర్ ను చికాకు పరిచిందనే చెప్పాలి. 22 లక్షల ఇళ్లు కడతామని తాము హామీ ఇవ్వలేదని కేవలం రెండు లక్షల 60వేల ఇళ్లే కడతామన్నాం. అది పూర్తి చేస్తున్నామంటూ కేసీఆర్ తనను తాను సమర్థించుకోవాల్సి వచ్చింది. విషయాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడంతో ఏఐసీసీ అద్యక్షుని స్థాయి పడిపోయిందంటూ గేలిచేశారు. కౌంటర్ చేయడానికి అగ్రనేతే రంగంలోకి దిగడాన్నిబట్టి చూస్తే టీఆర్ఎస్ రాహుల్ పర్యటనను సీరియస్ గానే తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

అవును ..అయితే ఏంటంట?...

కేసీఆర్ తేల్చి చెప్పేశారు. కుటుంబమే పాలిస్తుంది. మీకేంటి అభ్యంతరమంటూ నిలదీశారు. మా వాళ్లంతా ఉద్యమంలో పాల్గొన్నారు. పాలనలోనూ భాగస్వాములు. అందుకు అర్హులు. ఢిల్లీ నుంచి సాగడం లేదు కదా పాలన అంటూ కుండబద్దలు కొట్టేశారు. మొహమాటాలు లేకుండా తన కుటుంబ పాలనను సమర్థించుకున్నారు. భవిష్యత్తులో ప్రతిపక్షాల విమర్శలు కంఠశోషగానే మిగులుతాయి.ముందస్తు ఎన్నికల పై గతకొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి తెర వేసేందుకు ప్రయత్నించారు. ఆరునెలలముందుగా ఎన్నికలు జరిగితే సాంకేతికంగా ముందస్తు కింద లెక్కకు రాని విషయాన్నీ చెప్పేశారు. సెప్టెంబరులోనే అభ్యర్థులను ఖరారు చేయడంలో అసలు మతలబు మాత్రం దాచిపెట్టేశారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయం మరింత రంజుగా సాగబోతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News