చిక్కడు..దొరకడు...!

Update: 2018-05-24 15:30 GMT

కేసీఆర్ తీరే వేరు. మాటే కాదు, మనసు కూడా వైవిధ్యం. ఎవరికీ అంతుచిక్కడు. పట్టుదొరకడు.వామపక్షాల సహా అంతా అలసిపోయి ఎవరి కుంపటి వారు నడుపుకుంటున్న స్థితిలో కొత్త ఆలోచన రేకెత్తించారాయన. సెక్యులర్, ఫెడరల్,థర్డ్ ..పేరు ఏదైనా ఒక కూటమి పెట్టాలంటూ మూడునెలల క్రితం ముచ్చట మొదలు పెట్టారు. బీజేపీ, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమి కడతానంటూ శపథం పూనారు. చిన్నపెద్ద నాయకులన్న తేడా లేకుండా అందరినీ కలిసేందుకు ప్రయత్నించారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు పదిహేను నాటికి దీనిని ఒక కొలిక్కి తేవాలని ముహూర్తం పెట్టుకున్నారు. సమైక్యంగా పేరుపై కసరత్తు మొదలుపెట్టారు. తీరాచూస్తే తాజా పరిణామాలతో అది అటకెక్కేసినట్లే కనిపిస్తోంది. పట్టిన పట్టు వదలని విక్రమార్కునిగా తనను తాను అభివర్ణించుకునే కేసీఆర్ కొత్త వ్యూహాలు ఏమైనా మొదలుపెడతారా? ఆయన ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

వేదిక చూస్తే వెరపు...

బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ పైకి కేసీఆర్ ఎన్ని కబుర్లు చెప్పినా కాంగ్రెసును కచ్చితంగా నిలవరించాలనేదే ఆయన వ్యూహం. బీజేపీపై పెద్దగా అక్కసు లేదు. రాష్ట్రంలో బీజేపీ కంటే ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు మాత్రమే. అందులోనూ తెలంగాణ సెంటిమెంటును హైజాక్ చేయగల సామర్ధ్యం ఉన్నది హస్తం పార్టీకే. కాంగ్రెసు అనేకరకాలుగా రాజీ పడుతూ మిగిలిన పార్టీలను అన్నిటినీ కూడగట్టే యత్నాలు చేపట్టింది. ఇక్కడ చిన్నపెద్ద ప్రసక్తి లేదు. ప్రాంతీయపార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలకు సైతం స్నేహహస్తం చాస్తోంది. కర్ణాటకలో చోటు చేసుకున్న పరిణామం దీనికి నాంది. ప్రత్యక్ష ఉదాహరణ. 2019 దిశలో వేగంగా కాంగ్రెసు పార్టీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. తెలంగాణ పై దీని ప్రభావం పడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. చిన్నచితక పార్టీలను కలుపుకుని కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెసుపార్టీఫ్రంట్ కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వామపక్షాల్లో సీపీఐ కాంగ్రెసును బహిరంగంగానే సపోర్టు చేస్తోంది. తెలంగాణ జనసమితి వంటిపార్టీలు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు నిస్తాయనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెసు పార్టీ ప్రధాన పక్షంగా ఉన్న వేదికపైకి ఎక్కేందుకు ఇష్టపడకనే కేసీఆర్ దూరంగా ఉన్నారనేది ఒక వాదన. ప్రత్యామ్నాయఫ్రంట్ పై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తాను ఎవరినైతే కలిసి మద్దతు కోరారో వారంతా హాజరైన వేదికపై కచ్చితంగా కేసీఆర్ ఉండేవారని రాజకీయ విమర్శలు వెలువడుతున్నాయి.

మాయాజూదం..

కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ అనేది ఒక రకంగా మాయాజూదమని ప్రాంతీయపార్టీలు సైతం విశ్వసిస్తున్నాయి. కేసీఆర్ కలిసినప్పుడు మొహమాటానికి ఆయన మాట మన్నించినట్లు కనిపించినా వెంటనే అదిసాధ్యంకాదని మమత వంటివారు తేల్చిచెప్పేశారు. నిజానికి వామపక్షాలు ఈ విషయంలో చాలా కృషి చేశాయి. బీజేపీ, కాంగ్రెసు లను నిరోధించగల శక్తిగా ప్రాంతీయపార్టీలను తీర్చిదిద్దాలని, తాము వెన్నుదన్నుగా నిలవాలని వామపక్షాలు రకరకాల ప్రయోగాలు చేశాయి. విఫలమయ్యాయి. దాంతో యూపీఏ తొలిదశలో కాంగ్రెసుకు మద్దతునిచ్చాయి. ఇవన్నీ కాని పనులని భావించి తమదారి తాము చూసుకోవాలని తాజాగా నిర్ణయించుకున్నాయి. కాంగ్రెసు, కాంగ్రేసేతర విషయాలపై సీపీఎంలోనూ తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో మిగిలిన ప్రాంతీయపార్టీలు, కాంగ్రెసుతో కలిసి వేదికనెక్కడం ద్వారా వామపక్షాలు రాజీమార్గం అనుసరించబోతున్నట్లు స్పష్టమవుతోంది. సైద్ధాంతికంగా వామపక్షాలకు బీజేపీనే శత్రువు. రాజకీయంగా కేరళ వంటి చోట్ల కాంగ్రెసు రాజకీయ ప్రత్యర్థి. బీజేపీని నిలువరించడమే వాటి ప్రధాన లక్ష్యం. దీంతో మరోసారి మాయాజూదానికి రాజకీయ రంగం రెడీ అవుతోంది.

కొత్త పొద్దు...

కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కానీ అంతలోనే దొరికిపోతున్నారు. బీజేపీ, కాంగ్రెసు వ్యతిరేక ఫ్రంట్ అంటూ హడావిడి తప్ప నేరుగా కమలంతో తలపడేందుకు ఆయన సిద్ధ పడటం లేదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ 15 వ ఆర్థిక సంఘం విధివిధానాలపై కేసీఆర్ ఇతర రాష్ట్రాలతో చేతులు కలపడం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై ధ్వజమెత్తడం లేదు. కర్ణాటకలో కాంగ్రెసును మినహాయిస్తే తాను ఫ్రంట్ కట్టాలనుకుంటున్న అన్ని పార్టీలు వచ్చాయి. వాటి పక్కన కూర్చుంటే బీజేపీ వ్యతిరేక ముద్ర పడుతుందనే వెరపుతో ముందుగానే వెళ్లి వచ్చేశారు. అది మానసిక సంకోచాన్ని తేటతెల్లం చేస్తోంది. జాతీయ నేతగా ఎదిగే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. సీనియర్ చంద్రబాబు నాయుడు ఈ సందర్బాన్ని చేజిక్కించుకున్నారు. భవిష్యత్తులో బీజేపీయేతర కూటమి పేరిట ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా బలపడే ఎత్తుగడలు వేస్తున్నారు. ఢిల్లీ, కలకత్తా ఇతర ప్రాంతాల్లో ఐక్య వేదిక సమావేశాలకు బ్లూప్రింట్ తయారు చేస్తున్నారు. నిజానికి ప్రజాక్షేత్రంలో చంద్రబాబునాయుడి కంటే కేసీఆర్ బలోపేతంగా ఉన్నారు. చంద్రబాబు కలిసి వస్తున్న సందర్బాలు, అవకాశాలను తనకు అనుకూలంగా మలచుకోవడం ద్వారా బలోపేతం అవుతూ వస్తున్నారు. 1996 నుంచి టీడీపీ ఎదుర్కొన్న అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ టాక్టికల్ లైన్ తో వెళ్లిన సందర్బాలే ఎక్కువ. కలిసి వచ్చే పరిస్థితులు, సమూహాలతో తాను కలిసిపోవడంలో చంద్రబాబు దిట్ట. తద్వారా టీడీపీని ఆ వాలులో విజయం బాట పట్టిస్తుంటారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుంటారు. ఇప్పుడు కూడా అదే ఎత్తుగడలతో ముందుకు కదులుతున్న వాతావరణం కనిపిస్తోంది. కేసీఆర్ కొత్త ఫ్రంట్ కల్పనను చేజార్చుకుంటుంటే చంద్రబాబు అందిపుచ్చుకుంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News