నెహ్రూ టీడీపీలోనే ఒంట‌రైపోయారా ?

“ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట్లు అడిగే నైతిక హ‌క్కు నాకు మాత్రమే ఉంది. నాపై పోటీ చేసే ప్రత్యర్థి ఓ బ‌చ్చా ! “ అంటూ.. 2019 ఎన్నిక‌ల్లో [more]

Update: 2021-02-28 00:30 GMT

“ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఓట్లు అడిగే నైతిక హ‌క్కు నాకు మాత్రమే ఉంది. నాపై పోటీ చేసే ప్రత్యర్థి ఓ బ‌చ్చా ! “ అంటూ.. 2019 ఎన్నిక‌ల్లో త‌న‌దైన దూకుడుతో ముందుకు సాగిన‌.. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కుడు జ్యోతుల వెంక‌ట అప్పారావు ఉర‌ఫ్‌ నెహ్రూ ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న జ్యోతుల నెహ్రూ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. నెహ్రూ ఓడింది త‌న‌ సమీప బంధువు ( నెహ్రూకు కుమారుడు వ‌రుస ) జ్యోతుల చంటిబాబుపైనే కావ‌డం గ‌మ‌నార్హం. జ‌గ్గంపేట‌లో ప‌దిహేనేళ్ల పాటు నెహ్రూ ప్రతిప‌క్షంలోనే ఉన్నారు. 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిన ఆయ‌న 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత బాబు మాట‌లు న‌మ్మి పార్టీ మార‌డ‌మే ఆయ‌న గొయ్యి ఆయ‌నే త‌వ్వుకునేలా చేసింది.

కాపు సామాజికవర్గంలో….

కాపు సామాజిక వ‌ర్గంలో జ్యోతుల నెహ్రూ బాగా గుర్తింపు పొందారు. ఈ గుర్తింపే ఆయ‌న‌ను కాపు వ‌ర్గంలో ఉద్దండులు ఉన్న ఈ జిల్లాలో హీరోగా నిల‌బెట్టింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయ‌న‌కు జ‌గ‌న్ కీల‌క‌మైన పీఏసీ చైర్మన్ ప‌ద‌విని క‌ట్టబెట్టారు. ఆ త‌ర్వాత చంద్రబాబు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేయ‌డంతోనే ఆయ‌న పార్టీ మారార‌ని అంటారు. పార్టీ మారాక టీడీపీలో జ్యోతుల నెహ్రూ కు చుక్కలు చూపించేశారు. త‌న మంత్రి ప‌ద‌వికి ఎక్కడ పోటీ వస్తాడో ? అని అప్పటి హోం మంత్రి చిన‌రాజ‌ప్ప లాంటి వాళ్లు ఆయ‌న్ను ముప్పుతిప్పలు పెట్టారు.

చివరకు ఏ పదవి లేకుండానే?

చివ‌ర‌కు మంత్రి ప‌ద‌వా ? అబ్బే అదేం లేదు తూచ్ అంటూ ఆయ‌న కుమారుడికి రెండున్నరేళ్ల కాలానికి జ‌డ్పీ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చి స‌రిపెట్టేశారు. టీడీపీలో చేర‌క‌ముందు కాపుల్లో మంచి గుర్తింపు ఉన్న జ్యోతుల నెహ్రూ కు ఆ త‌ర్వాత అదే కాపులు దూర‌మ‌య్యారు. సొంత సామాజిక వ‌ర్గం కాపుల డిమాండ్లు నెర‌వేర్చ‌డంలో నెహ్రూ స‌రైన పోరాటం చేయ‌లేద‌ని.. కాపులు నిరుత్సాహంలో ఉన్నారు. అయితే.. ఈ విష‌యంలో జ్యోతుల నెహ్రూ కాపుల మాట‌కంటే కూడా చంద్రబాబు ప్రతినిధిగా కాపుల స‌మ‌స్యల‌ను త‌క్కువ చేసి చూపించార‌నే వాద‌న ఉంది. ఇప్పుడు ఆయ‌న్ను ప‌ట్టించుకునే నాథుడే లేడు.

పార్టీలో గుర్తింపేది ?

పార్టీ పరంగా చూసుకున్నా.. ఎవ‌రూ జ్యోతుల నెహ్రూ తో క‌లిసి లేరు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందుగానే చాలా మంది నాయకులు నెహ్రూకు దూర‌మ‌య్యారు. ఇక‌, ఇప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. తాజాగా.. పంచాయ‌తీ ఎన్నిక ‌ల్లోనూ నెహ్రూ హ‌వా ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్రబాబు వింటే గింటే చిన‌రాజ‌ప్ప మాట మిన‌హా జిల్లాలో ఎవ్వరి మాట వినే ప‌రిస్థితి లేదు. బాబుకు జిల్లాలో కాపులు కావాల్సి వ‌చ్చినా ముందుగా రాజ‌ప్పే క‌న‌పడుతున్నారు. దీంతో చంద్రబాబుసైతం జ్యోతుల నెహ్రూ ను పెద్దగా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో…..

ఇక గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ అధిష్టానం నుంచి భారీగా డ‌బ్బులు ఇస్తామ‌న్న హామీతోనే జ్యోతుల నెహ్రూ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు కోసం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశార‌న్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అవేవి రాక‌పోవ‌డంతో ఆయ‌న ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నార‌ని స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయంగాను.. పార్టీలోనూ.. ఆర్థికంగాను ఆయ‌న ఇబ్బందుల్లో ఉన్న ప‌రిస్థితే ఉంది. దీంతో ఇప్పుడు జ్యోతుల నెహ్రూ.. ఉనికి కోసంపోరాడుతున్న నాయ‌కుడిగా మిగిలిపోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న‌యుడికి కాకినాడ ఎంపీ సీటు ఇస్తే… ఆయ‌న జ‌గ్గంపేట వ‌దులుకుని రాజ‌కీయాల‌కు దూరం కూడా కావొచ్చంటున్నారు.

Tags:    

Similar News