సింధియా సీన్ మార్చేస్తున్నారే...!!!!

Update: 2018-11-20 16:30 GMT

రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్గతంగా పార్టీలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీనియర్లను గౌరవిస్తూనే సమర్థత, చొరవగల యువ నేతలను గుర్తించి ప్రోత్సహించడంలో వాటిలో ముఖ్యమైనది. ఇందులో భాగంగానే కొంతమంది యువనాయకులకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలను అప్పగించారు. మరి కొందరిని రాష్ట్ర అధ్యక్షులుగా పంపారు. రాజస్థాన్ పీసీీసీ చీఫ్ సచిన్ పైలట్ అలాంటి వారిలో ఒకరు. మరికొందరికి పీసీసీ పగ్గాలు అప్పగించనప్పటికీ పార్టీలో కీలకపాత్ర కల్పించారు. అటువంటి వారిలో మధ్యప్రదేశ్ కు చెందిన యువనాయకుడు జ్యోతిరాదిత్య సింధియా ఒకరు. సింధియాకు రాష్ట్ర పగ్గాలు అప్పగించనప్పటికీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర కల్పించారు. అందువల్లే ఆయన ఇప్పుడు ప్రచార వ్యవహారాల్లో తలమునకలయ్యారు. పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఆయనే అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, పీసీసీ చీఫ్ కమల్ నాథ్ కన్నా సింధియాకే ప్రజాదరణ ఎక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాజకీయంగా "మిస్టర్ క్లీన్" కావడం, గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన వారు కావడం, అన్నింటికీ మించి రాహుల్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతో పార్టీ శ్రేణుల చూపు సింధియా వైపే ఉంది.

గ్వాలియర్ రాజకుటుంబం నుంచి.....

1971 జనవరి1న జన్మించిన సింధియా ముంబయిలో ప్రాధమిక విద్య అనంతరం డెహ్రాడూన్ లోని డూన్ స్కూల్ లో ఉన్నత విద్య అభ్యసించారు. హార్వర్డ్ లో పట్బభద్రుడు అయిన అనంతరం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అనంతరం న్యూయార్క్, హాంకాంగ్ లలో వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. బరోడాలోని గైక్వాడ్ రాజకుటుంబానికి చెందిన ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు. బామ్మ విజయరాజె సింధియా, మేనత్త అయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే బీజేపీలో పుట్టిపెరిగారు. తండ్రి మాధవరావు సింధియా మాత్రం కాంగ్రెస్ భావజాలాన్ని బాగా ఒంటబట్టించుకున్నారు. 2002 లో తండ్రి మాధవరావు సింధియా ఆకస్మిక మరణంతో అనివార్యంగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2004, 2009,2014 లోక్ సభ ఎన్నికల్లో వరుసగా గుణ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014లో దేశమంతా మోదీ గాలి వీచినప్పటికీ గుణలో ఆ ప్రభావం పనిచేయలేదు. నాటి ఎన్నికల్లో మొత్తం 29 స్థానాలకు గాను రెండు చోట్ల మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. వాటిల్లో గుణ ఒకటి. రెండోది పీసీసీ చీఫ్ కమల్ నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బింద్వారా. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో జ్యోతిరాదిత్య వివిధ శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.

ప్రజల మద్దతు కూడా.....

రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాక సింధియాకు పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరిగింది. యువనాయకుడు, మంచి వాక్పటిమ ఉండటంతో ప్రజల్లో మమేకం అవుతున్నారు. రాహుల్ తో చనువు కారణంగా ఆయన భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ముంగోలి, కొలారన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించి రాహుల్ దృష్టిలో పడ్డారు. భావి ముఖ్యమంత్రిగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ముఖ్యమంత్రి రేసులో సింధియాకు 32 శాతం ప్రజలు మద్దతు పలికారు. కమల్ నాధ్ కు 8 శాతం, దిగ్విజయ్ సింగ్ కు కేవలం రెండు శాతం మాత్రమే మద్దతు పలకడం గమనార్హం. దీన్ని బట్టి ప్రజాదరణలో సింధియా ముందున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఎన్నికల అనంతరం సీఎం పదవికి ఆయన పేరు పరిశీలనలోకి రావడం ఖాయం. ఎన్నికల ప్రచార కమిటీ సారధిగా ప్రస్తుతం ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రాన్ని నలుమూలలా ఇప్పటికే ఒకసారి చుట్టి వచ్చారు. ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు.

తడబాటుకు గురవుతున్నారా...?

పార్టీ వ్యవహారాలకు సంబంధించి సీనియర్ నేతలను సమన్వయ పర్చడంలో సింధియా తడబాటుకు గురవుతున్నారన్న అభిప్రాయమూ లేకపోలేదు. దిగ్విజయ్, కమల్ నాధ్ వంటి దిగ్గజాలను కలుపుకుని పోకుండా, ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ విన్పిస్తున్నాయి. సింధియా ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తూ, కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదన్నది సీనియర్ల అభియోగం. రాజకుటుంబం నుంచి రావడంతో సహజ సిద్ధంగా ఒకింత అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, క్షేత్రస్థాయిలో చిన్న నాయకులను పట్టించుకోరన్న అభియోగాలు ఉన్నాయి. తనంటే గిట్టని వారు చేసే ఆరోపణలని, వీటిల్లో వాస్తవం లేదని సింధియా అంటున్నారు. ప్రజాబలం, పార్టీకి విధేయతే తనకు ముఖ్యమని చెబుతున్నారు. సింధియా భవిష్యత్తు మరో కొన్ని ఇరవై రోజుల్లో తేలిపోనుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News