మేనత్త మెంటల్ గా ప్రిపేర్ చేయబట్టేనా?

ఆ కుటుంబంలోనే కాంగ్రెస్ రక్తం ఉందంటారు. తండ్రి నుంచి తన వరకూ కాంగ్రెస్ పార్టీ కోసమే సమయాన్ని అంతా వెచ్చించారు. అదే సింధియా కుటుంబం. మధ్యప్రదేశ్ లో [more]

Update: 2020-03-10 16:30 GMT

ఆ కుటుంబంలోనే కాంగ్రెస్ రక్తం ఉందంటారు. తండ్రి నుంచి తన వరకూ కాంగ్రెస్ పార్టీ కోసమే సమయాన్ని అంతా వెచ్చించారు. అదే సింధియా కుటుంబం. మధ్యప్రదేశ్ లో రాజ వంశస్తులైన మాధవరావు సింధియా రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. మాధవరావు సింధియా మరణం తర్వాత జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాహుల్ గాంధీకి స్నేహితుడు. నమ్మకస్థుడు కూడా. అందుకే రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ వెస్ట్ నియోజకవర్గ బాధ్యతలను కూడా జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించారు.

18 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తోనే…..

అలాంటి సింధియా ఇప్పుడు మోడీ, అమిత్ షాలను కలవడం రాజకీయంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడే అవకాశాలు చాలా తక్కువ. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పదిహేనేళ్ల తర్వాత అధికారంలో రావడానికి కూడా సింధియా కారణమని చెప్పాలి. పద్ధెనిమిదేళ్ల నుంచి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో ఉంటున్నారు. తాను రాజకీయంగా అరంగేట్రం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. అలాంటి జ్యోతిరాదిత్య సింధియా నేడు కాంగ్రెస్ పార్టీని వీడారు.

కలియ దిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి….

పదిహేనేళ్లు అధికారానికి మధ్యప్రదేశ్ లో దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి జ్యోతిరాదిత్య సింధియా చేసిన కృషి విస్మరించలేనిది. యువనేతగా ఆయన మధ్యప్రదేశ్ అంతా తిరిగి కాంగ్రెస్ కు పట్టు దొరికేలా ప్రయత్నించారు. నియోజకవర్గాల్లో మంచి నేతలను ఎంపిక చేసి వారికి పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల వరకూ ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్ నాధ్ పెద్దగా మధ్యప్రదేశ్ లో పార్టీ పటిష్టతకు కృషి చేయలేదు. అయినా జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పటిష్టతకు పనిచేశారు.

వసుంధర రాయబారంతో….

తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కమల్ నాధ్ ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోయారు. రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో జ్యోతిరాదిత్య సింధియా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టలేదు. ఏడాది నుంచి సింధియా పార్టీ సీనియర్ నేతలపై ఆగ్రహంతోనే ఉన్నారు. చివరకు తన మేనత్త రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరరాజే సలహాలు, సూచనలతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పలుదఫాలు వసుంధర రాజే సింధియాతో సమావేశమై చర్చలు జరిపి బ్రెయిన్ వాష్ చేశారంటున్నారు. కాంగ్రెస్ లో ఉంటే భవిష్యత్తు లేదని భావించిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా పార్టీలో తనను ఒంటరిని చేశారని, నరకం అనుభవించానని సింధియా చెబుతున్నారంటే సీనియర్ నేతలు ఆయన పట్ల వ్యవహరించిన తీరే చెప్పకనే తెలుస్తోంది. మొత్తం మీద మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒక యువనేతను పోగొట్టుకుందనే చెప్పాలి.

Tags:    

Similar News