జూపూడి బలం జగన్ కు తెలుసా?

జూపూడి ప్రభాకర్ రావు….మాల మహానాడు నాయకుడు… మంద కృష్ణ మాదిగ ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో., పీవీ రావు మరణం తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించే వారు [more]

Update: 2019-10-10 05:00 GMT

జూపూడి ప్రభాకర్ రావు….మాల మహానాడు నాయకుడు… మంద కృష్ణ మాదిగ ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో., పీవీ రావు మరణం తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపించే వారు కరువైన సమయంలో ఆకాశం నుంచి ఊడిపడిన దేవదూత…. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తొలి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులం ద్వారా వేగంగా ఎదిగిన రాజకీయ నాయకుడు. జూపూడి ప్రభాకర్ నాయకత్వం మీద కులంలో మద్దతు కానీ, వ్యతిరేకత కానీ లేదు. 2006 తర్వాత వైఎస్ అనుచరుడిగా మాత్రమే కులం అతన్ని చూసింది. జూపూడి ప్రభాకర్ ఉద్యమంలోకి వచ్చే సమయానికి ఎస్సీ వర్గీకరణ ద్వారా రాజకీయ లబ్ది పొందాలని భావించిన చంద్రబాబు వ్యూహాలను దానిని వ్యతిరేకించిన కులాలు సమర్థంగా తిప్పికొట్టగలిగాయి.

మాలల ఉద్యమాన్ని….

మంద కృష్ణ ఉద్యమానికి అప్పటి టీడీపీ ప్రభుత్వ మద్దతు ఉన్నా న్యాయ పరీక్ష ముందు అది వీగి పోవడం వెనుక రకరకాల కారణాలు, వేర్వేరు స్థానాల్లో బలంగా పని చేసిన వ్యక్తులు ఉన్నారు. 2005లో పీవీ రావు మరణం తర్వాత ఉద్యమాన్ని జూపూడి ప్రభాకర్ నడిపించారా లేదా అన్నది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం ఎదిగారు. వైఎస్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చింది. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచిన జూపూడి ప్రభాకర్, 2011లో జగన్ సొంత పార్టీ పెట్టుకున్నపుడు క్రియాశీలక పాత్ర పోషించారు.

రాజకీయ వ్యూహంతోనే…

2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా నెలల వ్యవధిలోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో తన ఓటమికి జగన్ బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి కారణమని జూపూడి బహిరంగంగా చెప్పేవారు. 2014 ఎన్నికల్లో మాలలు టీడీపీకి మద్దతుగా నిలవకపోవడం వల్లే చాలా చోట్ల ఫలితాలు తారు మారయ్యాయని చంద్రబాబు భావించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలను చేరదీసి లాభ పడాలనే వ్యూహానికి 2014 తర్వాత చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టి విభజిత రాష్ట్రంలో జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ లాంటి వాళ్ళని అక్కున చేర్చుకోవడం ప్రారంభించారు. ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకున్న మాదిగలకు ఇది నచ్చకపోయినా బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం వాళ్లకు లేకపోయింది.

మాల, మాదిగ నేతలను….

గత ఐదేళ్లలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలను దళితులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే వచ్చారు. పీతల సుజాత, రావెల కిషోర్ బాబులకు జరిగిన అవమానాలు, అవినీతి పరులనే ముద్ర వ్యూహాత్మకంగా ప్రచారం చేయడం అటు మాలల్లో, ఇటు మాదిగల్లో చంద్రబాబు ఇమేజ్ దెబ్బ తీసింది. కాంగ్రెస్ పార్టీకి సహజమైన ఓటు బ్యాంకుగా ఉన్న మాలలు వైఎస్ మరణం తర్వాత జగన్ వైపు మొగ్గు చూపారు. దీనికి అంతర్లీనంగా చాలా కారణాలున్నాయి. వైఎస్ రాజారెడ్డి కుటుంబీకులతో మాలలకు ఉన్న బంధుత్వం, వైఎస్ కుటుంబ మత విశ్వాసాలు కూడా ఇందుకు కొంత మేరకు కారణం కావొచ్చు. వైఎస్ మరణం తర్వాత దళితుల్లో ప్రధానంగా మాలలు జగన్ కు అండగా నిలవాలనే నిర్ణయం వెనుక కుల, మత పరమైన భావనలు అంతర్లీనంగా వారిని ప్రభావితం చేశాయి.

సోనియాకు తప్పుడు సమాచారం…

చింతా మోహన్, పనబాక లక్ష్మీ, హర్ష కుమార్, జేడీ శీలం, కొప్పుల రాజు వంటి నేతలు వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో లగడపాటి, రాయపాటి, కావూరి, దగ్గుబాటి పురంధేశ్వరి లు సమైక్య ఉద్యమం చేస్తున్న సమయంలో మాల, మాదిగ నేతలు భిన్నంగా వ్యవహరించారు. కమ్మ నేతలు ఐక్యత రాగం వినిపించినా దళితులు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా ఆంధ్ర దళిత నేతల నుంచి సహకారం లభించింది. రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రా ప్రాంతానికి వచ్చే నష్టం ఏది ఉండదని ఆంధ్రా ప్రాంత నేతలు ఇచ్చిన సలహాలు చివరకు కాంగ్రెస్ కొంప ముంచాయి. కాంగ్రెస్ పార్టీకి బలమైన సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న మాలల ఓట్లన్నీ తమను చూసి వేసేస్తారని సోనియాను నమ్మించిన నేతలు తర్వాత పత్తా లేకుండా పోయారు.

నేతలను చూసి కులం…..

2019 ఎన్నికలకు ముందు జేడీ శీలం వంటి నేతలు కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు ఆశించి భంగ పడాల్సి రావడం అందులో భాగమే. ఇంత వివరణ ఎందుకంటే నేతల్ని చూసి కులం మొత్తం ఎప్పుడూ జగన్ వెన్నంటి నడవలేదని చెప్పడానికే. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ ఆ పార్టీలో చేరినా వైసీపీ కొత్తగా వచ్చే లాభం ఏమి ఉండదు. కాకుంటే టీడీపీకి ఓ గొంతు తగ్గుతుంది. ఇలా ఐదేళ్లకోసారి స్వరం మార్చే గొంతులకు పెద్దగా విలువ కూడా లేకుండా పోయింది ఇప్పుడు. నిజానికి కింది కులాలు, ముఖ్యంగా దళిత కులాలు ఏ పార్టీలో ఉన్నా అవి పార్టీల యాజమాన్య కులాల చెప్పు చేతల్లో నడవాల్సిందే.

జనాన్ని జగన్ …?

ఇప్పుడు జూపూడి ప్రభాకర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నందున రెండు ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. ఒకటి విశ్వసనీయత అని పదే పదే చెప్పే జగన్ ఏమి చెప్పి జనాన్ని కన్విన్స్ చేస్తాడు. జగన్ ని రకరకాలుగా తిట్టిన జూపూడి ప్రభాకర్ రేపు 2024లో టీడీపీలో చేరితే వీళ్లి ఏమని విమర్శిస్తారు? అధికారం ఉండేది ఆ రెండు కులాల మధ్యే కాబట్టి జనం ఈ వినోదాన్ని తప్పక భరించాలి అని భావిస్తే…. మీ మీద జనం, నమ్ముకున్న కులం పెట్టుకున్న నమ్మకం ఒట్టిది అన్నమాట. రాజకీయం ముందు విశ్వసనీయత ఏ మాత్రం అనుకుంటే వాట్ నెక్స్ట్ అనుకోవడమే.

Tags:    

Similar News