బాబు అండ్ కో కు నిద్ర లేకుండా చేశారుగా?

జూనియర్ అని అంటారు కానీ ఆయన చాలా విషయాల్లో సీనియరే. నందమూరి వంశంలో తాత తారక రామారావుకు తగిన మనవడు అని కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడా [more]

Update: 2021-04-06 13:30 GMT

జూనియర్ అని అంటారు కానీ ఆయన చాలా విషయాల్లో సీనియరే. నందమూరి వంశంలో తాత తారక రామారావుకు తగిన మనవడు అని కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడా తడబాటు పొరపాటు లేకుండా చక్కంగా తెలుగులో మాట్లాడడం జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లు. ఆయన ముఖ వర్చస్సు కానీ చెప్పే విషయం మీద ఉన్న అధికారం కానీ జనాల్లో ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. కేవలం 18 ఏళ్ల వయసులోనే సింహాద్రి వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నాటి టాప్ స్టార్ల వెన్నులో చలి పుట్టించిన జూనియర్ ఎన్టీఆర్ పైలా పచ్చీస్ వయసులో తెలుగుదేశానికి మద్దతుగా ఉమ్మడి ఏపీలోఊరూ వాడా పదునైన ఉపన్యాసాలు ఇచ్చి టీడీపీ అధినాయకత్వానికే వణుకు కలిగేలా చేశారు.

నో చెప్పడంలా….?

తాజాగా మీడియా సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో తన ప్రవేశం గురించి నో చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం టీడీపీ అధిపతులకు, భావి వారసులకు దడ పుట్టించే పరిణామమే. రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇది సమయం సందర్భం కాదని చెబుతూ దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందామని ముక్తాయింపు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ . అదే చంద్రబాబు, లోకేష్ బాబులకు షాక్ ఇచ్చే వార్త. నిజంగా జూనియర్ కి పాలిటిక్స్ మీద ఆసక్తి లేకపోతే ఇపుడెందుకీ ప్రశ్న అంటూ తప్పించేసేవాడే అన్న చర్చ కూడా ఉంది.

కచ్చితంగా వస్తాడా….?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సమయం సందర్భం ఉంది. ఆయనే చెప్పినట్లుగా అవి కుదిరిన నాడు జూనియర్ పొలిటికల్ అరేంగేట్రం ఒక్క లెక్కలో ఉంటుందని కూడా సన్నిహితులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివైన వాడు. టీడీపీ ఇపుడు చంద్రబాబు చేతిలో ఉంది. ఆయన ఘోర పరాజయాల పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయనకు 2024 చివరి ఎన్నికలు అవుతాయన్న మాట కూడా ఉంది. జగన్ వేవ్ లో మరోసారి టీడీపీ గెలవకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి అదే అతి పెద్ద చాన్స్ గా మారుతుంది అంటున్నారు. టీడీపీ లో తాను చేరడం కాదు ఆ పార్టీ పెద్దలే తన వెనకాల చేరే రోజు కూడా వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

రాసిపెట్టి ఉండాలి….

ఎన్టీయార్ పార్టీ పెట్టారు. కానీ ఆయన వారసులుగా ఎంతో మంది కుమారులు ఉన్నా ఎవరూ ముఖ్యమంత్రి పీఠం అందుకోలేకపోయారు. అల్లుడు చంద్రబాబు అనూహ్యంగా పగ్గాలు అందుకున్నాడు. ఇపుడు ఆయన తన వారసుడిగా కుమారుడు లోకేష్ ఉండాలని తలపోస్తున్నారు. అయితే ముందే చెప్పుకున్నట్లుగా ఎవరికైనా ఏ పదవి అయినా రాసిపెట్టి ఉండాలి. చూడబోతే అటు నారా ఫ్యామిలీలో కానీ ఇటు నందమూరి వారసుల్లో కానీ చూస్తే అదృష్ట జాతకుడు జూనియర్ ఎన్టీఆర్ అనే అంతా భావిస్తున్నారు. అన్నీ అనుకూలించి జగన్ మీద జనాలకు విరక్తి పుట్టిన నాడు అంటే 2029 నాటికి జూనియర్ రాజకీయ అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. మొత్తానికిజూనియర్ ఎన్టీఆర్ రాజకీయాసక్తి ఇప్పటికైతే చంద్రబాబు, లోకేష్ లకు రాత్రుళ్ళు నిద్రపట్టనీయకుండా చేస్తుంది అనడంలో సందేహం ఏ మాత్రం లేదు.

Tags:    

Similar News