జేపీ నడ్డా… పాపమంతా.. ఆయనపైనేనా?

జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన పదవీ బాధ్యతలను చేపట్టి ఏడాది దాటింది. అయితే ఆయనకు ముందున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. [more]

Update: 2021-02-11 16:30 GMT

జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయన పదవీ బాధ్యతలను చేపట్టి ఏడాది దాటింది. అయితే ఆయనకు ముందున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. జేపీ నడ్డాకు పార్టీలో మంచి వ్యూహకర్తగా పేరుండేది. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంంద్రహోంమంత్రి అమిత్ షాక అత్యంత విశ్వాసపాత్రుడన్న పేరు ఉంది. అందుకే అమిత్ షా తర్వాత జేపీ నడ్డాకు అధ్యక్ష పదవి లభించింది.

తొలి ఎన్నికలోనే….

జేపీ నడ్డా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో ఓటమి ఎదురయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హర్యానాలోనూ చచ్చీ చెడీ గెలవాల్సి వచ్చింది. ఇక బీహార్ లో జరిగిన ఎన్నికల్లోనూ పరాజయాన్ని బీజేపీ తృటిలో తప్పించుకుంది. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. బీహార్ లో అధికారంలోకి వచ్చినా అది గెలుపు కాదన్నది అందరికీ తెలిసిందే. ఇలా జేపీ నడ్డా బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీ పెద్దగా విజయాలు సాధించింది లేదు.

త్వరలో జరగనున్న….

ఇక త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి హోప్స్ కొద్దిగా ఉన్నది పశ్చిమ బెంగాల్, అసోం మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో సోదిలో కూడా ఉండదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. దీంతో జేపీ నడ్డా నాయకత్వంలో పార్టీ ఎన్ని చోట్ల గెలుస్తుందన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

ఓటమి ఎదురైతే….?

అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరస విజయాలు బీజేపీని పలుకరించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జేపీ నడ్డా నేతృత్వంలో వరస అపజయాలు చూడక తప్పేట్లు లేవు. సహజంగా గెలుపు సాధిస్తే అది మోదీ, అమిత్ షాల పరమవుతుంది. అదే ఓడితే ఆ పాపం భరించడానికి జేపీ నడ్డా ఉన్నారు. దీంతో పార్టీ లో జేపీ నడ్డా మరికొద్ది నెలల్లో ఎదురుకానున్న ఓటమి పాపాన్ని భరించేందుకు సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News