బైడెన్ టీంలో ఈ ఇద్దరు ఎందుకు..? అందుకే చేర్చుకున్నారా?

ఈనెల 20న అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ పైనే యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది. అగ్రరాజ్యం కొత్త అధినేత తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు, [more]

Update: 2021-01-18 16:30 GMT

ఈనెల 20న అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ పైనే యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది. అగ్రరాజ్యం కొత్త అధినేత తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలు, వైఖరులపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. వివిధ దేశాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. జో బైడెన్ ఎంపిక చేసుకున్న టీమ్ ను బట్టే ఇప్పటికే ఆయా దేశాలు ఒక అంచనాకు వస్తున్నాయి. భారత మూలాలున్న కమలా హారిస్ ఏకంగా ఉపాధ్యక్షురాలయ్యారు. భారత్ అంటే సానుకూలంగా ఉండే నాయకులు రక్షణ, విదేశాంగమంత్రులుగా నియమితులయ్యారు. అదే సమయంలో కాశ్మీరీ మూలాలు గల ఇద్దరు మహిళలు బైడెన్ టీమ్ లో సభ్యులుగా నియమితులయ్యారు.

ఇద్దరు కాశ్మీరీ మహిళలను….

సమీరా ఫాజిలిని జాతీయ ఆర్థిక మండలి (ఎన్ ఈ సీ) డిప్యూటీ డైరెక్టరుగా నియమితులయ్యారు. మరో మహిళ ఈషా షా శ్వేత సౌథంలోని డిజిటల్ స్రాటజీ టీమ్ భాగస్వామ్య నిర్వాహకురాలిగా నియమితులయ్యారు. వీరిద్దరూ కాశ్మరీ మూలాలు గల మహిళలు. ఈషా లూసియానాలో పుట్టి పెరిగారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు సన్నిహితురాలన్న పేరుంది. దీంతో వీరి నియామకం భారత్- అమెరికా బంధంపై ఎంతవరకు, ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు మహిళలు బైడెన్, కమలా హారిస్ ను ఎంతవరకు ప్రభావితం చేయగలరు, వారు ఎంతవరకు ప్రభావితం అవుతారన్నది ఆసక్తికరమైన అంశం.

అంత శక్తి లేకున్నా…..

వాస్తవానికి సలహాదారులకు పూర్తిస్థాయిలో అధినేతలను ప్రభావితం చేసే శక్తి ఉండదు. కానీ వారి మాటలను శ్రద్ధగా ఆలకించగలరు. ఒక నిర్ణయానికి రానప్పటికీ, పూర్తిగా వారి అభిప్రాయాలను తోసిపుచ్చలేరు. ఈ ఉపోద్ఘోతానికి ఒక కారణం ఉంది. అమెరికాలోని డెమొక్రట్లు మానవహక్కులకు ప్రాధాన్యమిస్తారు. ప్రజాస్వామంటూ ప్రకటనలు చేస్తుంటారు. 2019 ఆగస్టు 5న జమ్ము కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణ రద్దు చేసే సమయంలో కొంత మంది డెమొక్రటిక్ పార్టీ నాయకులు వ్యతిరేక ప్రకటనలు చేశారు. కాశ్మీర్ లోయలో మానవహక్కులకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ కూడా గతంలో కాశ్మీర్ పై భారత ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడారు. మొత్తానికి కాశ్మీర్ పై డెమొక్రట్ల భావనలు,అభిప్రాయాలు న్యూఢిల్లీ మనోభావాలకు భిన్నంగా ఉండేవి. దీనికితోడు నాటి అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్రమోదీల మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉండేది. ట్రంప్ గెలుపు కోసం మోదీ అమెరికాలో హౌడీ-మోడీ కార్యక్రమం నిర్వహించారన్న పేరుంది.

ట్రంప్ నకు అనుకూలంగా….

అదేవిధంగా ప్రవాస భారతీయుల మద్దతు ట్రంప్ నకు లభించేందుకు 2018లో అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ కార్యక్రమం నిర్వహించారన్న చర్చ జరిగింది. భారతీయ నాయకత్వం కూడా ఎన్నికల్లో ట్రంప్ వైపే నిలిచిందన్న అభిప్రాయం ఉంది. ఈ విషయాలు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలుకు తెలియవని అనుకోలేం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కాశ్మీరీ మూలాలు గల ఇద్దరు మహిళలకు బైడెన్ టీమ్ లో చోటు లభించిందన్న ప్రచారం దౌత్యవర్గాల్లో జరుగుతోంది. కానీ కేవలం కాశ్మీర్ కోసం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ను దూరం పెట్టే పరిస్థితిలో వాషింగ్టన్ లేదన్న వాదనా వినపడుతోంది. చైనాను ఎదుర్కోవడం కోసం భారత్ కు మద్దతు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి అమెరికాకు ఉంది. చాలా విషయాల్లో ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యం ఉంది. కేవలం ఒక అంశంలో తేడా ఉన్నంత మాత్రాన ఒకరిద్దరు సలహాదారులను నియమించుకున్నంత మాత్రాన ఉభయ దేశాల సంబంధాల్లో గణనీయ మార్పు వచ్చే అవకాశం లేదు. ఎవరు ఏమనుకన్నప్పటికీ కాశ్మీర్ పూర్తిగా భారత్ లో అంతర్భాగం. భారత్ నుంచి దానిని విడదీయడం అసాధ్యం. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీ వో కే) ను భారత్ పరిధిలోని కశ్మీర్ లో కలపడమే న్యూదిల్లీ లక్ష్యం. దీనికి వాషింగ్టన్ మద్దతు ఇవ్వాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News