అక్కడి నుంచి వెనక్కు రప్పించడం వెనక?

అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్నది పాత తెలుగు సామెత. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ఈ సామెత చక్కగా వర్తిస్తుంది. అఫ్గానిస్థాన్, ఇరాక్ ల్లో ఉగ్రవాదులను ఏరివేద్దామన్న ఉద్దేశంతో ఈ [more]

Update: 2021-08-20 16:30 GMT

అనుభవమైతేగానీ తత్వం బోధపడదన్నది పాత తెలుగు సామెత. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ఈ సామెత చక్కగా వర్తిస్తుంది. అఫ్గానిస్థాన్, ఇరాక్ ల్లో ఉగ్రవాదులను ఏరివేద్దామన్న ఉద్దేశంతో ఈ రెండు దేశాల్లో అడుగు పెట్టిన అగ్రరాజ్యానికి ఇప్పుడు తలబొప్పి కట్టింది. లక్షలమంది సైనికులు, సాయుధ సంపత్తితో ఉగ్రవాద పీచమణచేస్తానని ప్రతిన చేసిన అమెరికా ఇప్పుడు చావుతప్పి కన్ను లొట్టబోయిన చందాన ఈ దేశాల నుంచి ఎప్పుడుప్పుడు వైదొలగుదామన్న ఆత్రుతను ప్రదర్శిస్తోంది. ఆగస్టు నెలాఖరులోగా మొత్తం బలగాలను ఆప్ఫాన్ నుంచి వెనక్కు రప్పిస్తానని చెప్పింది. ఆ మేరకు చర్యలు చేపట్టింది. రాజధాని కాబూల్ కు 70కిలోమీటర్ల దూరంలోని బగ్రాం సైనిక స్థావరం దాదాపు ఖాళీ అయింది. నిన్నమొన్నటిదాకా సైనికులతో సందడిగా ఉండే బగ్రాం ఇప్పుడు బోసిపోతోంది. 2001 నాటి సెప్టెంబరు దాడులతో ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరుతో ఈ రెండు దేశాల్లోకి అమెరికా తన బలగాలను పంపింది. ఆశించిన లక్ష్యసాధన ఎంత కష్టమో ఆచరణలో తెలిసివచ్చాక బతుకుజీవుడా అంటూ అమెరికా తిరుగుముఖం పట్టింది.

బలగాలను వెనక్కు రప్పించాలని…?

ఆఫ్గానిస్థాన్ మాదిరిగానే పశ్చిమాసియా దేశమైన ఇరాక్ నుంచీ బలగాలను వెనక్కు రప్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. వాస్తవానికి ట్రంప్ హయాంలోనే ఈ నిర్ణయం జరిగింది. ఇప్పుడు బైడెన్ పాలనలో అది అమలవుతోంది. ఇరాక్ లో మొదట్లో పెద్దయెత్తున అమెరికా సైనికులు ఉండేవారు. అప్పటి ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ను అంతం చేశాక అక్కడ బలగాలను తగ్గించారు. అనంతరకాలంలో 5200 ఉన్న సైనికులను 3000కు తగ్గించారు. ఈ ఏడాది జనవరి నాటికి ఆ సంఖ్య 2500కు పరిమితమైంది. ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తిగా ఇరాక్ నుంచి వైదొలగాలన్నది అమెరికా తాజా నిర్ణయం. ఈ మేరకు ఇటీవల వాషింగ్టన్ లోని శ్వేతభవనంలో అధ్యక్షుడు బైడెన్, ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్ కాధిమి మధ్య జరిగిన చర్చ ల్లో నిర్ణయించారు. ప్రస్తుతం తమ దేశంలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని, విదేశీ బలగాల అవసరం లేదని ముస్తాఫా స్పష్టం చేశారు. తమ సైనికులకు శిక్షణ, నైపుణ్యాలను నేర్పి ఆయుధాలను సరఫరా చేస్తే చాలని ఆయన తెలిపారు.

అక్కడకు వెళ్లి సాధించేది…?

ఆఫ్గాన్, ఇరాక్ లకు వెళ్లి తాము సాధించిందేమీ లేదని అమెరికాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. వందలకోట్ల డాలర్ల వ్యయం, బలగాల బలిదానం , అంతర్జాతీయంగా చెడ్డపేరు తప్ప ఒరిగిందేమీ లేదు. ఒక దేశ అంతర్గత పరిస్థితులను చక్కబెట్టడం విదేశీ బలగాలకు సాధ్యం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులు,స్థానికుల భాగస్వామ్యం, నమ్మకం చూరగొనకుండా ఎవరూ చేసేదేమీ ఉండదు. గతంలో 80వ దశకంలో శ్రీలంకలో తమిళ తీవ్రవాదుల ఆట కట్టించేందుకు భారత్ నుంచి వెళ్లిన ఐపీకేఎఫ్ (ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్) చావుదెబ్బ తిని, రిక్తహస్తాలతో తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. నాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్న అవివేక నిర్ణయాల్లో ఇది ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.

అంతా అర్ధమై….?

ఇప్పుడు ఆఫ్గాన్, ఇరాక్ ల్లో అమెరికాకు ఎదురైన చేదు అనుభవం కూడా ఇలాంటిదే. అఫ్గాన్ లో ఆల్ ఖైదా, తాలిబన్, ఇరాక్ లో ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదుల కార్యకలాపాలు ఇంకా సమసిపోలేదు. సిరియాలో ఒకింత ఫరవాలేదు. ఆప్ఫాన్ లో మాత్రం పరిస్థితి తీవ్రంగానే ఉంది. అయినప్పటికీ తాను చేయగలిగిందేమీ లేదన్న విషయం వాషింగ్టన్ కు అర్థమైంది. అందుకే బలగాల ఉపసంహరణపై తొందరపడుతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆప్ఫాన్, సిరియా కారణంగా ఇతర అంశాలను విస్మరించామని, ఇప్పుడు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. మున్ముందు ఆ దిశగానే తన సర్వ శక్తులను పూర్తిగా కేంద్రీకరించాలన్నది వాషింగ్టన్ ఆలోచన.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News