మాటలకు, చేతలకు చాలా తేడానే?

చైనా అధినేత జిన్ పింగ్ మాటలకు, చేతలకు ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది. అది ఇతరుల ఊహలకు అందనే అందదు. జులై నెలాఖరులో ఆయన టిబెట్ [more]

Update: 2021-08-13 16:30 GMT

చైనా అధినేత జిన్ పింగ్ మాటలకు, చేతలకు ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది. అది ఇతరుల ఊహలకు అందనే అందదు. జులై నెలాఖరులో ఆయన టిబెట్ లో పర్యటించారు. మూడురోజుల పాటు పర్యటించి టిబెట్ రాజధాని లాసా తదితర నగరాలను, బ్రహ్మపుత్ర నది వంతెనలను ఇతర కీలక ప్రాంతాలను సందర్శించారు. మూడు దశాబ్దాల తరవాత ఒక చైనా అధినేత టిబెట్ లో పర్యటించడం ఇదే ప్రథమం. 1991లో అప్పటి అధినేత జియాంగ్ జెమిన్ తరవాత స్వయం ప్రతిపత్తి గల టిబెట్ సందర్శించిన తొలి దేశాధినేత జిన్ పింగే కావడం విశేషం. అప్పట్లో ఆయన పర్యటనను యావత్ ప్రపంచం ఆసక్తి గా గమనించింది. దీని వెనక గల కారణాలపై ఆరా తీయడం ప్రారంభించింది.

ప్రతి కుటుంబం నుంచి…

తాజాగా టిబెట్ లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున యువత సైన్యంలో చేరాలన్న ప్రభుత్వ ఆదేశంతో జిన్ పింగ్ పర్యటన లక్ష్యం ఏమిటో అందరికీ అర్థమైంది. ఊరక రారు మహానుభావులు అన్న చందాన జిన్ పింగ్ మనోగతం తెలిసిపోయింది. సైన్యంలో చేరడానికి సర్కారు కొన్ని నియమ నిబంధనలను సైతం నిర్దేశించింది. వారు కచ్చితంగా చైనా అధికారిక భాష అయిన ‘మాండరిస్’ నేర్చుకోవాలన్నది మొదటిది. అంతేకాక వారు కమ్యూనిస్టు పార్టీ పట్ల తప్పనిసరిగా విధేయత ప్రదర్శించాలి. చైనా ప్రభుత్వం పట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉండాలి. ఇవి తప్పనిసరి నిబంధదనలుగా పేర్కొన్నారు.

అందుకు కారణాలివే..?

సైన్యంలోకి జిన్ పింగ్ టిబెట్ యవతను తీసుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు లేకపోలేదు. టిబెట్ ప్రాంతం కొండలు, గుట్టలు, ఎత్తైన పర్వత ప్రాంతాలతో ఉంటుంది. ఇక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఇక శీతాకాలంలో పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో బలగాలు పని చేయాల్సి ఉంటుంది. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో పని చేయగల శక్తి సామర్థ్యాలు భారత బలగాలకు పుష్కలంగా ఉన్నాయి. భారత బలగాల్లోని ఇండో- టిబెట్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ), స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్ ఎఫ్ ఎఫ్)కు ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్తితుల్లో పనిచేయడంపై ఈ బలగాలకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తుంటారు.

వారికి కొట్టిన పిండి కావడంతో…

గత ఏడాది జూన్ లో రెండు దేశాల సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద గల్వాన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అదే సమయంలో పైకి చెప్పనప్పటికీ బీజింగుకూ భారీ నష్టమే వాటిల్లింది. ముఖ్యంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక బలగాలు లేకపోవడం పెద్ద లోటుగా కనపడింది. ఈ నేపథ్యంలో స్థానిక టిబెట్ యువతతో కూడిన బలగాల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారమని జిన్ పింగ్ భావించారు. టిబెట్ యువతకు అక్కడి వాతావరణ పరిస్థితుల్లో పని చేయడం కొట్టిన పిండి. అందువల్ల ఆ ప్రాంత యువకులను సైన్యంలోకి చేర్చుకోవాలని జిన్ పింగ్ నిర్ణయించారు.

ప్రత్యేక సందర్భాల్లోనే…

టిబెట్ యువతతో కూడిన స్థానిక బలగాలు ప్రధానమైన పీఎల్ ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ)కి సహాయకారిగా ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో వీరి సేవలను వినియోగించుకుంటారు. 17 నుంచి 20 సంవత్సరాల మధ్య గల యువకులను సైన్యంలోకి చేర్చుకుంటారు. ఉభయ దేశాల మధ్య రమారమి 3488 కిలోమీటర్ల సరిహద్దు గల వాస్తవాధీన రేఖ (ఎల్ ఏ సీ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) ని కాపాడుకునేందుకు టిబెట్ యువతతో కూడిన ప్రత్యేక దళం ఉపయోగపడుతుందన్నది జిన్ పింగ్ అంచనా, విశ్వాసం. 1950ల్లో చైనా పరమైన టిబెట్ ప్రగతికి ఇప్పటివరకు పకడ్బందీ చర్యలు చేపట్టలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలపై అణచివేత, వివక్ష కొనసాగుతోంది. వీరిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చైనా పరిగణిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో శరవేగంగా అభివద్ధి పనులు చేపడుతున్న బీజింగ్ ఇప్పటికైనా టిబెట్ పై శ్రద్ధ పెడితే ఆ ప్రాంత ప్రజలు సంతోషిస్తారు. ఆ దిశగా అడుగలు ఎప్పుడు పడేను?

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News