ఫస్ట్ లేడీకి అదే ఫస్ట్ అట

బోధన నా వ్యాపకం కాదు, అది నా ఉనికి….ఈ మాటలన్నది ఎవరో కాదు, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ (ఫస్ట్ లేడీ) జిల్ బైడెన్. దీనిని బట్టి [more]

Update: 2020-12-15 16:30 GMT

బోధన నా వ్యాపకం కాదు, అది నా ఉనికి….ఈ మాటలన్నది ఎవరో కాదు, అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ (ఫస్ట్ లేడీ) జిల్ బైడెన్. దీనిని బట్టి బోధన అంటే ఆమెకు ఎంతో ఆసక్తో, ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అంతేకాక ఆమె నిబద్ధతను కూడా చాటుతోంది. భర్త దేశాధినేత అయినా బోధనను వీడే ప్రసక్తి లేదంటున్నార ఫస్ట్ లేడీ జిల్ బైడెన్. భర్త అధ్యక్షుడు అయినా నేను మాత్రం రాజకీయ నాయకురాలిని కాను. నేను కేవలం నేను ఆంగ్ల ఉపాధ్యాయురాలిని మాత్రమే. అలా చెప్పుకోవడానికే ఇష్టపడతాను. ప్రజలు కూడా తనను అలానే గుర్తుంచుకోవాలని కోరుకుంటానంటోంది డెబ్బై ఏళ్ల జిల్ బైడెన్.

బోధనపైనే మక్కువతో….

బోధనపై మక్కువతో జిల్ బైడెన్ డాక్టరేట్ చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్లాన్ని బోధించారు. బైడెన్ 2008 నుంచి 2016 వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా ద్వితీయ మహిళ హోదాలో ఉన్నప్పటికీ బోధనను మరిచిపోలేదు. ఉపాధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ -2లో ప్రయాణం చేస్తున్నప్పటికీ విద్యార్థుల ప్రశ్నపత్రాలు దిద్దేవారు. భర్త అగ్రరాజ్యాధినేత అయినా తాను సాధారణ పౌరురాలినే అని చెప్పడం జిల్ బైడెన్ నిరాడంబరతకు నిదర్శనం. అమెరికా ఫస్ట్ లేడీ అంటే చాలా ప్రొటోకాల్ ఉంటుంది. అతిథి మర్యాదలు అమితంగా ఉంటాయి. గౌరవాలకు తక్కువ ఉండదు. అడుగు తీసి అడుగేస్తే కాలు బయటకు పెడితే సేవకులు వెన్నంటి ఉంటారు. ఎంతో హడావిడి ఉంటుంది. మందీ మార్బలానికి కొదవేమీ ఉండదు. అధ్యక్షుడైన భర్తతో పాటువిదేశీ పర్యటలనకు వెళ్లవచ్చు. స్వదేశంలో జరిగే అనేక అధికారిక కార్యక్రమాలకు హాజరవవచ్చు. విందు, వినోదాలకు లెక్కే ఉండదు. ఈ గౌరవాలు, హడావిడి కన్నా జిల్ బైడెన్ కు బోధనే ముఖ్యం. అందులోనే ఆమె జీవిస్తారు. బోధనను ఆస్వాదిస్తారు.

పూర్తిగా అర్ధం చేసుకున్నాకే….

కరణేషు మంత్రి అన్న భారతీయ ఆర్యోక్తి జిల్ బైడెన్ కు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. బైడెన్ ను కంటికిరెప్పలా కాపాడు కుంటోంది. అన్నివేళల్లో ఆయనకు అండగా నిలిచింది. మంచి సలహాలు ఇస్తూ ఆయనను ముందుకు నడిపించింది. కష్ట సమయాల్లో అండగా నిలబడింది. ఫిలడెల్ఫియాకు చెందిన జిల్ 1951లో జన్మించారు. 1970లో బిల్ స్టీవెన్సెను పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల తరవాత ఆయన నుంచి విడాకులు పొందారు. కొంతకాలం ఒంటరి జీవితాన్ని గడిపారు. ఆ సమయంలోనే బైడెన్ తో పరిచయం కలిగింది. అది కాలక్రమంలో ప్రేమగా మారింది. అప్పటికీ బైడెన్ వివాహితుడు. ఆయన భార్య 1972లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం నుంచి ఇద్దరు కుమారులు బయటపడగా, ఏడాది వయసున్న పాప దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు కుమారులతో ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో తన ప్రేమ ప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చారు బైడెన్. జిల్ మాత్రం తొందరపడలేదు. ఇప్పుడే కాదు కొంతకాలం ఆగమన్నారు. ఈ మధ్యకాలంలో ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. అవగాహన పెంచుకున్నారు. చివరకు 1977లో వారిద్దరూ ఒక్కటయ్యారు.

హారిస్ ఎంపికలోనూ….

బైడెన్ ఎన్నిక విషయంలోనూ జిల్ కీలకపాత్ర పోషించారు. మొత్తం ప్రచార పర్వంలోనూ భర్త వెన్నంటే ఉన్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలుపెరగకుండా పనిచేశారు. అనేక ర్యాలీల్లో పాల్గొన్నారు, ప్రసంగించారు. ప్రచార కార్యకలాపాలను సమన్వయం చేశారు. రాజకీయాలకు సంబంధించి బైడెన్ కు మంచి సలహాలు ఇస్తుంటారు. జిల్ బైడెన్ అభిప్రాయాలకు, సూచనలకు ఎంతో గౌరవమిస్తారు బైడెన్. ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎంపికలోనూ జిల్ బైడెన్ ప్రధానపాత్ర పోషించారు. అనేకమంది మహిళా అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరకు కమలా హారిస్ వైపే మొగ్గు చూపారు జిల్ బైడెన్. చివరకు ఆమె ఎంపిక సరైనదని ఎన్నికల ఫలితాలు చెప్పాయి. జిల్ బైడెన్ కు పరుగంటే చాలా ఇష్టం. ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారానికి కనీసం అయిదు రోజులు రన్నింగ్ చేయనిదే ఆమెకు తోచదు. ది స్టోరీ ఆఫ్ బైడెన్ …అనే పుస్తకాన్ని రాశారు. వారి వైవాహిక జీవితం ఆదర్శనీయం.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News