వన్ కాయిన్...టూ ఫేసెస్....!!!

Update: 2018-12-22 15:30 GMT

జయప్రకాశ్ నారాయణ..జేడీ లక్ష్మీనారాయణ .. తెలుగు ప్రజల్లో వ్యక్తిగతమైన ఇమేజ్ కలిగిన మాజీ బ్యూరోక్రాట్లు.. ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్ లుగా పనిచేశారు. అధికారులు ఎవరికీ లభించని ఖ్యాతి, ప్రజాదరణ పొందారు. వారు పనిచేసిన తీరు, ధైర్యంగా ముందుకు వెళ్లే వైఖరుల కారణంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సమాజానికి ఏదో చేయాలనే తపన వారిలో కనిపిస్తుంది. అయితే ప్రభుత్వ సర్వీసుల్లో కంటే సామాజిక రంగంలో ప్రవేశిస్తేనే తాము సంఘానికి మరింతగా ఉపయోగపడతామనే భావనతో తమ సర్వీసులకు స్వస్తి చెప్పి ప్రజాజీవితంలోకి వచ్చారు. జయప్రకాశ్ నారాయణ గడచిన పదేళ్లుగా అనేకవిధాలుగా ప్రయత్నించి తాను అనుకున్న లక్ష్యసాధనలో వెనకబడి క్రియారహితం అయిపోయారనే చెప్పాలి. తాను ప్రారంభించిన లోక్ సత్తా నిర్వీర్యమైపోయింది. లక్ష్మీనారాయణ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించాలని ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటన పూర్తిచేశారు. ఏ పార్టీలోనూ చేరనని చెప్పేశారు. లోక్ సత్తా బాధ్యతలు తీసుకోవాలని జయప్రకాశ్ స్వయంగా ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారు. వీరి సాఫల్య వైఫల్యాలు ఒకసారి పరికిస్తే భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఉన్నతాధికారులకు ఒక మంచి సందేశమవుతుంది.

ఆశ...ఆశయం...

ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులంటే ఉండే క్రేజే వేరు. నిజానికి సమాజానికి సేవ చేసేందుకు ఎంతో ఉపకరించే అత్యున్నత సర్వీసులు. రాజకీయ నాయకులు ప్రతినిత్యం ప్రజాపరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. చిత్తశుద్ధితో ఉండే అధికారులు తాము ఎదుగుతూ తమతోపాటు సమాజానికి అందించే సేవల ఉద్ధ్రుతిని కూడా విస్తరించుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది. కలెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి పదవుల్లో జయప్రకాశ్ నారాయణ అందించిన సేవలు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎంత ఉన్నతాధికారి అయినప్పటికీ రాజకీయ కార్యనిర్వాహక వర్గ పరిధికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత అసహనం కూడా చోటు చేసుకుంటుంది. తాను చేయాలనుకుంటున్న పనికి ఎవరిదో అనుమతి తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా అనిపిస్తుంది. తాను ఆశించిన స్థాయిలో ప్రజాసేవ చేయడానికి బ్యూరోక్రసీ సంకెళ్లు అడ్డుగా ఉంటున్నాయనే ఉద్దేశంతో జేపీ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేశారు. గాలిజనార్దనరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి వంటి కీలక కేసుల్లో సూటిగా వ్యవహరించి, ఎటువంటి ఒత్తిడులకు లొంగని అధికారిగా పేరు తెచ్చుకున్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఆయన కూడా ప్రభుత్వ సర్వీసు సంకెళ్లు తెంచుకుని ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలనే తన ఆలోచనను అమల్లో పెట్టేశారు.

అజెండా కు దూరంగా...

జయప్రకాశ్ నారాయణ తొలుత మొదలుపెట్టిన లోక్ సత్తా ముందుగా ఒక ప్రజా చైతన్య వేదికగా పనిచేసింది. రాజకీయాల్లో నేరచరితుల జాబితాలు విడుదల చేస్తుండేది. ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ఎంతమంది నేరస్థులకు టిక్కెట్లు ఇస్తున్నారనే వివరాలను ప్రకటించేది. వివిధ పార్టీల గుండెల్లోగుబులు రేకెత్తిస్తుండేది. స్థానిక సంస్థల అధికారాలు , ప్రజాప్రతినిధులకు అవగాహన వంటి అంశాలపైనా లోక్ సత్తా పనిచేసింది. ప్రధానంగా యువతరం బాగా ఆకర్షితమయ్యింది. పదవికి రాజీనామా చేసిన తర్వాత కేంద్రప్రభుత్వానికి అనుసంధానంగా సోనియా నేత్రుత్వంలో ఏర్పాటైన జాతీయసలహామండలిలో సభ్యునిగా కూడా జేపీ పనిచేశారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటివి ప్రవేశపెట్టడంలో తనవంతు క్రుషి చేశారు. లోక్ సత్తా ఒక బలమైన వేదికగా రూపుదాల్చింది. జాతీయ స్థాయి నాయకులు మొదలు రాష్ట్రస్థాయి పార్టీల వరకూ లోక్ సత్తా అంటే ఒక ప్రత్యేక మన్నన ఇస్తుండేవారు. జేపీ చెప్పేమాటకు ఎనలేని గౌరవం ఉండేది. ఈ స్వచ్ఛంద, నైతిక బలాన్ని రాజకీయశక్తిగా మలచాలని ప్రయత్నించి బోర్లాపడ్డారు. అంతవరకూ లోక్ సత్తాను చూసి ఎంతో కొంత భయపడే పార్టీలు అది కూడా తమలో కలిసిపోయిందని సంతోషించారు. పార్టీగా లోక్ సత్తా మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. ‘ప్రజల్ని చైతన్యపరచాలి. యువతరాన్ని సమాజ సేవలోకి తీసుకుని రావాలి. అన్నిపార్టీల్లోని ప్రజాప్రతినిధుల్లో అవగాహన పెంచాలి. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలి. ‘ వంటి తన ప్రాథమిక అజెండాను పక్కనపెట్టడంతో జేపీ, లోక్ సత్తా రిలవెన్స్ కోల్పోయాయి.

మరో ప్రయోగం...

తాజాగా లక్ష్మీనారాయణ పార్టీ పేరిట చేయబోతున్న ప్రయోగం పైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. స్వచ్ఛంద సైనికునిగా ఆయనకు లభించే మద్దతు వేరు. రాజకీయాధికారం తెచ్చుకునే శక్తి వేరు. దానికి పెద్ద ఉద్యమం, భావోద్వేగం, విస్త్రుత జనాకర్షణ అవసరం. గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలుగువారి ఆత్మాభిమానం పేరిట పార్టీ పెట్టి తన జనాకర్షణను జోడించి ఎన్టీరామారావు అధికారం సాధించారు. తెలంగాణ కు సాగుతున్న అన్యాయం అనే అజెండాతో ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమం చేపట్టి సఫలమయ్యారు కేసీఆర్. ఈ రెండు చోట్లా సెంటిమెంటు కనిపిస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లోపెద్ద ఉద్యమం చేసి విజయం సాధించింది. జేపీ, జేడీలకు సెంటిమెంటు అస్త్రం , పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన చరిత్ర లేదు. దీంతో వీరికి విస్త్రుత శ్రేణిలో ప్రజామద్దతు లభించడం లేదు. వ్యక్తిగత ఇమేజ్ క్రమేపీ కరిగిపోతుంది. చిరంజీవితన గ్లామర్ ను పెట్టుబడిగా పెట్టి పార్టీని స్థాపిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు. ప్రాంతీయపార్టీలకు దిశానిర్దేశం చేసే అజెండాతో ఫెడరలిజం, రాష్ట్రాలకు అధికారాలు పెంచాలనే డిమాండ్ తో జేపీ తాజాగా దేశవ్యాప్త పర్యటనలు చేపట్టబోతున్నారు. లక్ష్మీనారాయణ 2019లో తన రాజకీయావకాశాలను ఆంధ్రప్రదేశ్ లో పరీక్షించుకోబోతున్నారు. నిజానికి వీరిద్దరూ రాజకీయాల్లో విజయం సాధిస్తే వీరిని అనుసరించడానికి అనేకమంది అధికారులు సిద్దంగా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టే కార్యాచరణ వీరి వద్ద ఉందా? అన్నదే అనుమానం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News