జేడీ రెడీ అయిపోయారా?

జేడీ లక్ష్మీనారాయణ. మాజీ సీబీఐ అధికారి. పైగా మాజీ జనసేన నాయకుడు కూడా. 2019 ఎన్నికలలో ఆయన జనసేన తరఫున పోటీ చేస్తే విశాఖ ఎంపీ సీట్లో [more]

Update: 2021-02-02 03:30 GMT

జేడీ లక్ష్మీనారాయణ. మాజీ సీబీఐ అధికారి. పైగా మాజీ జనసేన నాయకుడు కూడా. 2019 ఎన్నికలలో ఆయన జనసేన తరఫున పోటీ చేస్తే విశాఖ ఎంపీ సీట్లో ఏకంగా రెండు లక్షల 80 వేల ఓట్ల దాకా దక్కించుకున్నారు. ఇది నిజంగా జేడీ లక్ష్మీనారాయణ చరిష్మాకు గీటు రాయి కిందనే చూడాలి. జేడీ అంటే మిడిల్ క్లాస్ జనాల్లో ఒక రకమైన అభిమానం ఉంది. ఆయన కరెక్ట్ పార్టీ నుంచి పోటీ చేసి ఉంటే ఈపాటికి ఎంపీ అవడం ఖాయమని కూడా ధీమాగా చెబుతారు.

కండువా కర్టెసీయేనా..?

కాషాయం పార్టీ పట్ల జేడీ చాన్నాళ్ళుగా మక్కువ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అంతెందుకు 2019 ఎన్నికల ముందు కూడా ఆయన బీజేపీ లో చేరేందుకు ప్రయత్నించారని అంటారు. అయితే నాడు ఆయన కోరుకున్న సీటు ఇవ్వలేదని ఒక కారణం అయితే ఏపీలో ఒంటరిగా పోటీకి దిగడం మరో కారణమని అంటారు. అందుకే జేడీ లక్ష్మీనారాయణ సినీ గ్లామర్ ఉన్న పవన్ పార్టీ తరఫున పోటీకి దిగి గెలుపు దాకా వచ్చేశారు. ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా కూడా జేడీ తనకు అవకాశం ఇవ్వమని కోరారని కూడా చెబుతారు. అంతే కాదు రాజ్యసభ అడిగారని మరో ప్రచారం ఉంది. ఇవన్నీ ఇలా ఉండగానే ఆయన మరోసారి బీజేపీకి దగ్గర అవుతున్నారని లేటెస్ట్ టాక్. ఆయన మెడలో కాషాయ కండువా పడడమే ఇక తరువాయి అని కూడా అంటున్నారు.

విశాఖే గురిగా….

ఇక జేడీ లక్ష్మీనారాయణ ఈ మధ్య తరచూ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆయన స్థానికంగా ఉన్న నాయకులను కూడా కలుసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీ నేతలతోనూ టచ్ లో ఉంటున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి జేడీ లక్ష్మీనారాయణని కలవడం విశేష పరిణామంగా చెప్పుకోవాలి. ఏపీలో బీజేపీ బలపడేందుకు చూస్తున్న నేపధ్యం ఇది. అందరి నాయకులను ఏకంగా సోము వీర్రాజే వారి ఇళ్ళకు వెళ్ళి మరీ కలుస్తున్నారు. ఇపుడు జేడీని విష్ణు కలవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. జేడీ తొందరలో కాషాయ దళంలో చేరిపోతారని కూడా గట్టిగా వినిపిస్తున్న మాట. ఆయనకు విశాఖ సీటు మీదనే మక్కువ ఉంది. దాన్ని కనుక ఓకే చేస్తే కచ్చితంగా కమలనాధుడిగా ఆయన మారుతారు అంటున్నారు.

చాన్స్ ఉందా….?

విశాఖ సిటీలో బీజేపీకి బలం కొంతదాకా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, ఇతర వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వారెపుడూ లోకల్ పార్టీలకు ఓటు వేయరు. ఇక బీజేపీకి నాలుగు దశాబ్దాల పునాది విశాఖ సిటీలో ఉంది. దానికి తోడు ఒకసారి హరిబాబు ఎంపీగా గెలిచిన రికార్డు కూడా ఉంది. ఇక జేడీ లక్ష్మీనారాయణకి వ్యక్తిగతంగా కూడా కొంత ఇమేజ్ ఉంది. ఇవన్నీ కలిస్తే మారిన రాజకీయ వాతావరణంలో విశాఖ సీటు బీజేపీకి దక్కే చాన్సులు అయితే ఉన్నాయి. కానీ విశాఖ సీటు మీద చాలా మంది కన్ను ఉంది. మరోసారి పోటీకి హరిబాబు కూడా రెడీ అవుతున్నారని టాక్. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News