జేడీకి ఎర్త్ పెట్టారుగా

బీజేపీ, జనసేన పొత్తులతో కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీలో నిన్న మొన్నటి వరకూ కీలక నేతగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ సీటుకు ఎసరు [more]

Update: 2020-01-17 12:30 GMT

బీజేపీ, జనసేన పొత్తులతో కొత్త సమస్యలు తెరమీదకు వస్తున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీలో నిన్న మొన్నటి వరకూ కీలక నేతగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ సీటుకు ఎసరు వచ్చేలా కన్పిస్తుంది. బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీలూ 2024 ఎన్నికలకు కలసి వెళతామని ప్రకటించాయి. అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని తెలిపాయి. ఈ కీలక సమావేశానికి జేడీ లక్ష్మీనారాయణను జనసేన దూరంగా ఉంచింది.

విశాఖలోనే ఉంటూ…..

జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నంలోనే ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అక్కడే ఉంటూ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ పొత్తు జేడీ లక్ష్మీనారాయణ సీటుకు ఎర్త్ పెట్టిందనే చెప్పాలి.

బీజేపీ అగ్రనేతలు…..

విశాఖపట్నంలో బీజేపీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని బీజేపీకే కేటాయిస్తూ వస్తున్నారు. కంభంపాటి హరిబాబు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. మరో బీజేపీ కీలక నేత పురంద్రీశ్వరి సయితం విశాఖపట్నాన్ని తన కార్యాస్థలిగా ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసిన పురంద్రీశ్వరి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూటమి ఏర్పడటంతో ఈ సీటు బీజేపీకే దక్కుతుందన్నది కాదనలేని వాస్తవం.

టిక్కెట్ ఛాన్స్ లేకపోవడంతో….

అదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోనే ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీలో కీలకపదవులు ఏమీ అప్పగించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పట్లో పార్టీ మారే ఆలోచన లేదు. బీజేపీ, జనసేనల పొత్తుతో జేడీ లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. విశాఖపట్నంపైనే మక్కువ పెంచుకున్న జేడీకి వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున ఆ సీటు దక్కే అవకాశం లేదన్నది సుస్పష‌్టం. దీంతో జేడీ లక్ష్మీనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కరంగా మారింది.

Tags:    

Similar News