జనసేనకు దూరం జరిగినట్లేగా

జేడీ లక్ష్మీ నారాయణ. కనబడిన నాలుగో సింహంగా సీబీఐలో ఓ రేంజిలో గ్లామర్ సంపాదించారు. ఆయన అలా ఇలా కాదు, ఓ సినీ సూపర్ స్టార్ కి [more]

Update: 2019-07-29 13:30 GMT

జేడీ లక్ష్మీ నారాయణ. కనబడిన నాలుగో సింహంగా సీబీఐలో ఓ రేంజిలో గ్లామర్ సంపాదించారు. ఆయన అలా ఇలా కాదు, ఓ సినీ సూపర్ స్టార్ కి ఉన్న పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అప్పట్లో జగన్ ఓ రైజింగ్ స్టార్. ఆయన్ని అరెస్ట్ చేయడం ద్వారా నీతికి నిజాయతీకి మారు పేరు తాను అనిపించుకున్నారు. ముఖ్యంగా 2012 టైంలో యువత జేడీ లక్ష్మీ నారాయణ మీద మనసు పారేసుకుంది. ఆయన కటౌట్లకు యమ డిమాండ్ కూడా ఏర్పడింది. జగన్ కేసు అనగానే మరో వైపు జేడీ లక్ష్మీ నారాయణ కూడా ప్రత్యక్షం అయ్యేవారు. అంతలా ఓవర్ నైట్ ఎదిగిన జేడీ లక్ష్మీ నారాయణ తరువాత కాలంలో మహారాష్ట్రకు వెళ్ళిపోవడంతో కొంత సందడి తగ్గింది. అయితే ఆయన మాత్రం యువతను చైతన్యం చేస్తానంటూ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ వచ్చారు. దాంతో కూడా ఆయన మళ్ళీ జనంలో పేరు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే ఒక రోజు జేడీ లక్ష్మీ నారాయణ తాను చేపట్టిన ఉన్నత పోలీస్ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు.

అనూహ్యంగా జనసేనలోకి….

ఇక జేడీ లక్ష్మీ నారాయణ వ్యక్తిత్వం తెలిసిన వారు ఆయన సొంతంగా పార్టీ పెడతారని భావించారు. ఆయనకంటూ స్పేషల్ క్రేజ్ ఉండడం వల్ల ఎవరితోనూ జట్టు కట్టరని కూడా వూహించారు. దానికి భిన్నంగా జేడీ లక్ష్మీ నారాయణ పవన్ కళ్యాణ్ జనసేనలో చేరడం అన్నింటికీ అతీతంగా ఆయన్ని అభిమానించే వారికి ఓ షాక్ లాంటి పరిణామం అయింది. ఇక ఇలా జనసేన జెండా కప్పుకున్నారో లేదో అలా జేడీ లక్ష్మీ నారాయణ విశాఖ ఎంపీకి పోటీ పడ్డారు. ఆయన అతి తక్కువ సమయంలోనే జనానికి చేరువ అయ్యారు. దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల ఓట్లను సాధించారు. ఓ దశలో జేడీ లక్ష్మీ నారాయణ గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆయన మూడవ స్థానానికే పరిమితం అయ్యారు. ఆ తరువాత నుంచి జేడీ లక్ష్మీ నారాయణ అలికిడి పెద్దగా లేదు. ఆయన జనసేనతో ఉన్నట్లా లేనట్లా అన్న డౌట్లు కూడా అందరికీ కలిగాయి.

క్లారిటీ వచ్చేసింది…

ఇక జేడీ లక్ష్మీ నారాయణ విషయంలో ఇపుడు పక్కాగా క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు. జేడీ లక్ష్మీ నారాయణ ఓటమిపాలు అయిన తరువాత పవన్ ని కలిసింది లేదు. ఇక పవన్ పార్టీ సమీక్షలకు కూడా ఆయన వెళ్లింది లేదు. దాంతోనే జేడీ లక్ష్మీ నారాయణ జనసేనకు దూరమయ్యారన్న ప్రచారం స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా దానికి మరింత బలాన్ని చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించిన పొలిట్ బ్యూరోలో జేడీ లక్ష్మీ నారాయణ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మేధావులలో ఒకరుగా పేరున్న జేడీ లక్ష్మీ నారాయణని పవన్ పట్టించుకోలేదంటే జేడీ కచ్చితంగా ఆ పార్టీకి దూరం జరిగి ఉంటారని అంతా అనుకుంటున్నారు. పవన్ తో కటీఫ్ చెప్పేశారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.

బీజేపీ వైపే చూపు…..

ఇక జేడీ లక్ష్మీ నారాయణ ఇపుడు స్వేచ్చా జీవి. ఆయన జనసేనలో చేరడం అన్నది ఓ యాక్సిడెంటల్ సిట్యుయేషన్ గానే చూస్తున్నారు. ఎన్నికలు ముంచుకురావడంతో ఏదో ఓ పార్టీ నీడన ఉండాలని జేడీ లక్ష్మీ నారాయణ అప్పట్లో పవన్ పార్టీలో చేరారని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక ఇపుడు జేడీ లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరడానికైనా ఆయనకు బోలెడంత సమయం ఉంది, అవకాశం ఉంది. ఇక జేడీ లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరుతారని కూడా అంతా అంటున్నారు. బీజేపీని ఏపీలో విస్తరించాలనుకుంటున్నారు. అందులో భాగంగా జనంలో మంచి పేరున్న జేడీ లక్ష్మీ నారాయణ లాంటి వారి బీజేపీకి అవసరమే. రాయలసీమ అనంతపురం జిల్లాకు చెందిన జేడీ లాంటి వారికి కూడా జాతీయ పార్టీ అవసరమే. అందువల్ల తొందరలోనే జేడీ లక్ష్మీ నారాయణ కమలం కండువా కప్పుకుంటారని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News