పవన్, జగన్…బాబు… మధ్యలో జేడీ

జేడీ ఆయన ఇంటిపేరు కాదు, ఒంటిపేరుగా మారిపోయింది. సీబీఐ లో ఆయన‌ జాయింట్ డైరెక్టర్ నుంచి పదోన్నతి పొందారు. ముంబైలో పనిచేశారు. అయినా సరే ఆయన అందరికీ [more]

Update: 2020-05-08 14:30 GMT

జేడీ ఆయన ఇంటిపేరు కాదు, ఒంటిపేరుగా మారిపోయింది. సీబీఐ లో ఆయన‌ జాయింట్ డైరెక్టర్ నుంచి పదోన్నతి పొందారు. ముంబైలో పనిచేశారు. అయినా సరే ఆయన అందరికీ ఇంకా జేడీనే. ఆయన అత్యున్నతమైన ఉద్యోగాన్ని సీబీఐలో వదులుకుని మూడేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన ఇప్పటికీ కూడా అధికారిక భాష వీడలేకపోతున్నారు. అదే విధంగా ఆయన ఎన్జీవో నేత నుంచి ఎదగలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. జేడీ అంటే ఇష్టపడే యువతరం ఉంది. ఆయన ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. కానీ ఆయన తనకు ఉన్న బలాన్ని పెట్టుబడిగా పెట్టి గెలవలేకపోతున్నారు. ఆయనకు ఉన్న కొన్ని మైనస్సులే బ్రేకులు వేస్తున్నాయి. ఇక ఏపీలో మూడు ప్రధాన పార్టీల అధినేతల విషయంలో జేడీ ఆలోచనలు క్లారిటీగా లేవు. దాంతో జేడీ లక్ష్మీనారా‍యణ రాజకీయాలు కలగానే మిగిలిపోతున్నాయి.

రాంగ్ స్టెప్పేనా?

ఎక్కడ జేడీ, మరెక్కడ పవన్. సినిమా గ్లామర్ ని పక్కన పెట్టి పవన్ ని వేరు చేసి చూస్తే జనసేనలో జేడీ ఎంతో ఉన్నతుడుగా కనిపిస్తారు. ఆయన విజనరీ, ఉన్నత స్థాయి ఉద్యోగ హోదా ఇవన్నీ కూడా బేరీజు వేసుకున్నపుడు ఆయన జనసేనలో చేరికను చాలా మంది ఆశ్చర్యపోయి చూశారు. జేడీ లాంటి వారు ఇలా చేశారేంటి అన్న వారూ ఉన్నారు. అయితే రాజకీయాలు కాబట్టి అక్కడ తర్కాలు ఉండవు. జేడీ కూడా ఇలా చేరి అలా విశాఖ ఎంపీ అభ్యర్ధి అయ్యారు. బాగానే ఓట్లు సంపాదించారు. ఆ తరువాత ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా మీడియా ఇంటర్వ్యూలో ఆయన జనసేన నుంచి ఎపుడో తప్పుకుని ఉండాల్సింది అంటున్నారు. అంటే రాంగ్ స్టెప్ వేశానని చెప్పకనే చెప్పేశారు. తాను ఫుల్ టైం పొలిటీషియన్ అని అంటున్నారు. జనసేనలో పార్ట్ టైం పాలిటిక్స్ నడుస్తాయని పవన్ మీద బాణాలూ వేశారు.

జగన్ విషయంలో….

మరో వైపు చూస్తే జగన్ జేడీల బంధం నిందితుడు, పోలీసు అధికారి గానే అంతా చూశారు, ఇక జేడీ ఇపుడు ఆ పదవిని వదిలినా జగన్ తో ఆయనకు శత్రుత్వం ఉందని అనుకునే వారు కూడా ఉన్నారు. దానికి ఆయన ఎప్పటికపుడు సమాధానం ఇస్తూనే ఉన్నారు. తాను ఒక అధికారిగా ఎన్నో కేసుల్లో భాగంగానే జగన్ కేసు కూడా విచారించానని అంటున్నారు. ఇపుడు అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదు అని చెబుతున్న జేడీ జగన్ పాలన విషయంలో కొన్ని సార్లు మెచ్చుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మూడు రాజధానుల గురించి జగన్ ప్రతిపాదిస్తే మంచిదే అన్న జేడీ, తాజాగా జగన్ కరోనా విషయంలో ఇకపై కలసి సాగకతప్పదు అని చెబితే కూడా అదే కరెక్ట్ అన్నారు. మొత్తానికి వైసీపీలో చేరుతారా అన్న ప్రశ్నకు ఆయన ఎపుడూ సూటిగా సమాధానం ఇవ్వడంలేదు. కానీ జగన్ పట్ల కొన్ని సార్లు సానుకూల ప్రకటనలు చేస్తూ కొంత అయోమయం మాత్రం క్రియేట్ చేస్తున్నారు.

దారి దొరికిందా…?

జేడీకి ఉన్నది పూర్తిగా బ్యూరోక్రాట్ ఇమేజ్. దాన్ని రాజకీయాలకు టర్న్ చేయడం ఎలాగో అర్ధం కావడంలేదు. ఇక ఏపీలో పవన్ పార్టీని వదిలేశారు. చంద్రబాబుతో జట్టు కడితే ఆయన ప్రోద్బలంతోనే అప్పట్లో కేసులు జగన్ మీద పెట్టారన్న ఆరోపణలు ఎటూ ఉన్నాయి. అవే మళ్ళీ వస్తాయి. జగన్ కేసులు విచారించిన అధికారిగా వైసీపీలో చేరలేరు. ఇక సొంతంగా పార్టీ పెట్టలనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు, ఆయనే ఒక సైన్యంగా ఎన్జీవో సంస్థను సక్సెస్ ఫుల్ గా నడపగలరేమో కానీ రాజకీయ పార్టీని పెట్టి జనంలోకి తీసుకుపోవడం పెద్ద రిస్క్ అవుతుంది. మరి జేడీ దారెటు, ఆయన కేవలం రాజకీయ విశ్లేషకుడిగా, ఎన్జీవోగానే మిగిలిపోతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News