జేసీ రివర్స్ జాతకం…?

రాయలసీమలో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి సరిసాటి సీనియర్ నేత మరొకరు లేరు, ఆయన పెద్ద నోరు కూడా ఎవరికీ రాదు. ఆయనిప్పుడు టీడీపీలో ఉన్నాడంటే ఉన్నాడు. [more]

Update: 2021-01-29 02:00 GMT

రాయలసీమలో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి సరిసాటి సీనియర్ నేత మరొకరు లేరు, ఆయన పెద్ద నోరు కూడా ఎవరికీ రాదు. ఆయనిప్పుడు టీడీపీలో ఉన్నాడంటే ఉన్నాడు. ఇక ఆయన మీద జగన్ సర్కార్ కేసులతో రెచ్చిపోతూంటే టీడీపీ అధినాయకత్వం పెద్దగా పట్టనట్లుగా ఉంది. దాంతో ఈ మాజీ మంత్రికి మండుకొస్తోంది. ఇక ఇలాగే ఉంటే కష్టమని భావించారో ఏమో చంద్రబాబు మీదనే తన బాణాలను వదులుతున్నారు.

ఇలాగైతే కష్టమట…..

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వానికి వచ్చి పాతికేళ్ళు పై దాటింది. మరి ఆ పార్టీ అపుడూ ఇపుడూ ఒక్కలాగానే ఉంది. బాబు ఏమనుకుంటే అదే జరిగే పార్టీలో ఏడేళ్ళుగా సర్దుకుపోయిన జేసీ దివాకరరెడ్డి ఇపుడు మాత్రం బాగా గుస్సా అవుతున్నారు. ఇలాగైతే కష్టం బాబూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మీరు మారాలి బాబు గారూ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. నిజానికి బాబు మారుతాను అంటారే కానీ ఆయన‌ ఎప్పటికీ మారరు, మారలేరు కూడా. ఆ సంగతి తెలిసి కూడా మారాలి అంటున్న జేసీ దివాకరరెడ్డి ఏమైనా ఆలోచనలు మరచి ఇలా అంటున్నారా అంటే కాదని అంటున్నారు.

జగనే మళ్ళీ….

ఇక తనను చంద్రబాబు అసలు పట్టించుకోవడంలేదని తెగ బాధపడుతున్న జేసీ దివాకరరెడ్డి బాంబు లాంటి మాటే వాడేశారు. చంద్రబాబు విపక్షంలోకి వచ్చినా ఇంకా ఎక్కడా మారడంలేదని ఫైర్ అయ్యారు. ఇలాగైతే మరో మారు జగనే ఏపీలో అధికారంలోకి వస్తారంటూ రివర్స్ లో జాతకం చెప్పేశారు. ఇంతకాలం జగన్ మళ్ళీ మళ్లీ సీఎం అంటూ వైసీపీ నేతలు చెప్పేవారు. చంద్రబాబే ఈసారి సీఎం అంటూ టీడీపీకి సపోర్టుగా ఉండే అక్టోపస్ లు జోస్యాలు వదిలేవారు. జేసీ దివాకరరెడ్డి కూడా ఆ మధ్య దాక చంద్రబాబే బాజా భజంత్రీలతో సహా అధికారంలోకి వస్తారంటూ తెగ ఉబ్బేసేవారు. ఇపుడు మాత్రం జగన్ దే అధికారం అంటూ బాబు చెవులు వినలేని మాటలనేశారు.

రీజనదేనా…?

తెలుగుదేశం పార్టీలో జేసీ బ్రదర్స్ ఉండలేకపోతున్నారు. అలాగని తమ వారసులను వైసీపీలోకి పంపించి తాము కూల్ గా ఉందామనుకుంటే అది కుదిరే వ్యవహారంగా లేదు. ఇక టీడీపీ సైతం గట్టి భరోసా ఇవ్వడంలేదు. కేసుల మీద కేసులు వచ్చి పడుతున్నా చంద్రబాబు ఆయన తనయుడు మిన్నకుంటున్నారు. దీంతో బాబుతో తాడో పేడో అన్నట్లుగా జేసీ దివాకరరెడ్డి వాయిస్ పెంచారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకుంటే మిగిలిన పార్టీలలో ప్లేస్ దొరుకుతుందేమో అన్న ఆలోచన ఒకటైతే మళ్లీ జగనే సీఎం అంటూ చెప్పడం ద్వారా ఫ్యాన్ నీడన సేద తీరాలన్న తన కోరికను వెలిబుచ్చడం మరో ఆశగా ఉందని అంటున్నారు. ఇక చంద్రబాబు కంటే సీనియారిటీలో తానేం తక్కువ అని కూడా జేసీ దివాకరరెడ్డి అంటున్నారు. తాము చిన్నపిల్లవాళ్ళమా బాబు తో పాటే రాజకీయాల్లోకి వచ్చామని కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. మొత్తానికి జేసీల పోకడ చూస్తూంటే సీమలో బాబుకు కొత్త ఇబ్బందులు తెచ్చేలాగే సీన్ కనిపిస్తోంది మరి.

Tags:    

Similar News