చేతిలో చెయ్యేసి…చెప్పు జేసీ

మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. ఏ నిర్ణయం తీసుకున్నా సెన్సేషనే. జేసీ దివాకర్ రెడ్డి రాయలసీమలో సీనియర్ నేతగా పేరున్నా [more]

Update: 2019-09-14 14:30 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. ఏ నిర్ణయం తీసుకున్నా సెన్సేషనే. జేసీ దివాకర్ రెడ్డి రాయలసీమలో సీనియర్ నేతగా పేరున్నా గత ఎన్నికలు ఆయన కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేశాయి. దశాబ్దాలుగా ఓటమి ఎరుగని ఆయన కుటుంబానికి అదేంటో రుచి చూపించారు అక్కడి ప్రజలు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తుంది. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇక ప్రత్యక్ష్య ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు.

వారసుల భవిష్యత్తు పైనే….

ఇక జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పైనే ఆయన బెంగంతా. అలాగే తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్నారు. తాడిపత్రి కేంద్రంగా దశాబ్దకాలంగా రాజకీయాలు చేస్తున్న జేసీ సోదరులు అదే తాడిపత్రి ఈసారి ఎదురు తిరగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇందుకు కారణం టీడీపీలో చేరడేమనన్నది ఆయన వారసుల అభిప్రాయం. తొలి నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి,అస్మిత్ రెడ్డిలు వైసీపీలోకి వెళ్లాలనే భావించారు. 2014 ఎన్నికలకు ముందే జగన్ పార్టీలోకి వెళ్లేందుకు వాళ్లు ఉత్సాహం చూపారు.

జగన్ ను తట్టుకుని…..

అయితే అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో వారు మౌనం వహించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో జేసీ నిర్ణయమే కరెక్ట్ అని తనయులు కూడా భావించారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మరోసారి కూడా జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు.కానీ తండ్రి జేసీ దివాకర్ రెడ్డి సూచనలతో ఆయన వెనక్కు తగ్గారు. కానీ ఇప్పుడు టీడీపీకి భవిష్యత్తు లేదని జేసీ దివాకర్ రెడ్డి కూడా గుర్తించారు. జగన్ రెడ్డిని తట్టుకుని ఐదేళ్ల పాటు రాజకీయంగా కొనసాగాలన్నా కష్టమేనన్నది జేసీకి తెలియందికాదు.

బాబుకు ఫిర్యాదు….

అందుకే పార్టీ లైన్ కు విరుద్ధంగా జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారంటున్నారు. జగన్ పాలనపై చంద్రబాబు ఒకవైపు విమర్శలు చేస్తూ పుస్తకం విడుదల చేస్తే, అదే పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డి మాత్రం జగన్ పాలనకు వందకు వంద మార్కులు వేయాల్సిందేనని చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది. నిన్న చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబును కలిసిన అనంతపురం జిల్లా నేతలు జేసీ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం జేసీ విషయాన్నితనకు వదిలేయాలని చెప్పడంతో అనంత నేతలు మౌనంగా ఉన్నారు. జగన్ కు దగ్గరవ్వడం కోసమే జేసీ దివాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News