జేసీ స్ట్రాటజీ మారుస్తున్నారా?

అనంత‌పురం జిల్లాలో కీల‌క నాయ‌కుడు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్న నేత జేసీ దివాక‌ర్ రెడ్డి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయ‌న అటు [more]

Update: 2019-08-30 15:30 GMT

అనంత‌పురం జిల్లాలో కీల‌క నాయ‌కుడు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్న నేత జేసీ దివాక‌ర్ రెడ్డి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయ‌న అటు అసెంబ్లీకి, ఇటు పార్లమెంటుకు కూడా ఎన్నికై.. త‌న స‌త్తా చాటుకున్నారు. తాడిప‌త్రిలో 35 ఏళ్లపాటు ఏక ఛత్రాధిప‌త్యం సాగించారు. వ‌రుస‌గా ఎన్నిక‌య్యారు. అలాంటి నాయ‌కుడు 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌ను వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగ‌లేక‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున అనంత‌రం నుంచి తాను ఎంపీగా, త‌న సోద‌రుడు ప్రభాక‌ర్ రెడ్డిని తాడిప‌త్రి నుంచి ఎమ్మెల్యేగా నిల‌బెట్టి గెలిపించుకున్నారు.

వారసత్వ రాజకీయాలను…

ఆయ‌న మీడియా ముందుకు వ‌స్తే.. సంచ‌ల‌నాల‌కు తెర‌దీయ‌కుండా ఉండ‌లేరు. ఆయ‌న ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న ఏం చేసినా సంచ‌ల‌న‌మే. నిత్యం మీడియాలో ఉంటూ… ఆయ‌న వినూత్న రాజ‌కీయాలు చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పొలాల‌కు ప‌ట్టిసీమ నుంచి నీళ్లు ఇవ్వక‌పోవ‌డంతో అలిగి ఏకంగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి సాధించుకున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న చంద్రబాబుకు వార‌సుడిగా లోకేష్‌కు తొలిసారి జై కొట్టి.. త‌న వ్యాఖ్యల‌ను తానే స‌మ‌ర్ధించుకున్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు త‌ప్పేంట‌ని ప్రశ్నించారు. బాబు కుమారుడు సీఎం అయితే.. ఓర్వలేరా? అంటూ టీడీపీ నేత‌ల‌ను మ‌హానాడు వేదిక‌గా దులిపేశారు.

జగన్ పై వ్యక్తిగత విమర్శలు….

అదే స‌మ‌యంలో అప్పటి విప‌క్ష నాయ‌కుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను మావాడే (రెడ్డి కుల‌స్తుడు) అంటూ నే తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. జ‌గ‌న్ కు అధికారం క‌ల్ల అంటూ కామెంట్లు కుమ్మరించి సంచ‌ల‌నానికి తెర‌దీశారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న మ‌రో సంచ‌ల‌నానికి తెర‌దీశారు. తాను ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు ఇక స్వస్తి చెబుతాన‌ని, త‌న వారసుడిగా కుమారుడిని నిల‌బెడుతున్నాన‌ని ప్రక‌టించారు. అదే చేశారు. అయితే, వైసీపీ ప‌వ‌నాల ముందు జేసీ వార‌సుడు ప‌వ‌న్ రెడ్డి ఓడిపోయారు. అదేస‌మ‌యంలో తాడిప‌త్రిలోనూ త‌న త‌మ్ముడి వార‌సుడు అస్మిత్ కూడా చ‌తికిల ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఇద్దరూ కూడా రాజకీయాల‌కు దూర‌మ‌య్యారు.

తిరిగి వచ్చేందుకు…..

అయిన‌ప్పటికీ.. రెండు నెలల కింద‌ట తాను ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది లేద‌ని జేసీ ప్రక‌టించారు. కానీ, రోజులు మారుతున్న కొద్దీ ఆయ‌న ఆలోచ‌న కూడా మార్చుకున్నట్టు తాజా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ప్రస్తుతం త‌మ వార‌సుల‌ను ప్రజ‌లు అర్ధం చేసుకోలేదు కాబ‌ట్టి.. ఇలానే ఉంటే.. త‌మ రాజ‌కీయానికి తెర‌ప‌డుతుంద‌ని బావించిన జేసీ.. మ‌ళ్లీ ప్రత్యక్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల టీడీపీ చేసిన అన్నా క్యాంటీన్ల ఆందోళ‌న‌లో ప్రత్య‌క్షంగా ఆయ‌న పాల్గొనక పోయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ ప్రభుత్వంపై మాత్రం విమ‌ర్శలు చేశారు. దీనిని బ‌ట్టి ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లో పుంజుకుంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు., మ‌రి జేసీ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News