మూతికి మాస్క్ వేసుకోవడమే బెటరట.. జేసీకి బోధపడింది

తెలుగుదేశానికి ఎప్పుడు ఊపు వస్తుందంటే… జేసీ నోరు తెరిచినప్పుడే అన్నది పసుపు పార్టీలో విన్పించే సామెత. కానీ జేసీ దివాకర్ రెడ్డి నోరు కుట్టేసుకుని కూర్చుండటం అందరినీ [more]

Update: 2020-10-09 08:00 GMT

తెలుగుదేశానికి ఎప్పుడు ఊపు వస్తుందంటే… జేసీ నోరు తెరిచినప్పుడే అన్నది పసుపు పార్టీలో విన్పించే సామెత. కానీ జేసీ దివాకర్ రెడ్డి నోరు కుట్టేసుకుని కూర్చుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జేసీ దివాకర్ రెడ్డి గత నెలలుగా మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఆయన పార్టీని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. రాష్ట్ర స్థాయి అంశాలపై కూడా జేసీ దివాకర్ రెడ్డి స్పందించలేదు. పార్టీలో ఉన్నట్లే జేసీ దివాకర్ రెడ్డి కన్పించడం లేదు.

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా….

మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జేసీ దివాకర్ రెడ్డి హుషారుగానే ఉన్నారు. జగన్ పై విమర్శలు చేస్తూనే వచ్చారు. జగన్ వంద రోజుల పాలనపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మావాడే నంటూ చురకలు అంటించారు. ఆ తర్వాత జేసీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ వ్యాపారాలను ప్రభుత్వం దెబ్బకొడుతుందని జేసీ దివాకర్ రెడ్డి పదే పదే ఆరోపించారు.

బ్రదర్ అరెస్ట్ తర్వాతనే…..

కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయిన నాటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి నోరు మెదపడం లేదు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దాదాపు యాభై రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. తర్వాత బెయిల్ పై వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదయింది. మళ్లీ కడప జైలుకు తరలించారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడంతో బెయిల్ లభించింది.

దేనిపై స్పందించకుండా…..

ప్రభుత్వం తమ పై కక్ష సాధింపుకు దిగుతుందని భావించి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉంటున్నారు. గత రెండు నెలలుగా ఏ అంశంపైనా ఆయన స్పందించడం లేదు. ఆయన పార్టీ నేతలకు దూరంగా వెళ్లిపోయారు. తన వ్యవసాయక్షేత్రంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. టైం మనది కాదనుకున్నప్పుడు నోరు మూసుకుని కూర్చోవడమే బెటర్ అని బ్రదర్ జైలు కెళ్లిన తర్వాత కాని జేసీ దివాకర్ రెడ్డికి బోధపడలేదులా ఉంది. మరికొంత కాలం జేసీ దివాకర్ రెడ్డి మూతికి మాస్క్ వేసుకుని ఉన్నారు. అన్నీ అనుకూలించిన తర్వాతనే ఆయన బయటకు వచ్చే అవకాశముందని జేసీ అనుచరులు చెబుతున్నారు.

Tags:    

Similar News