కంచుకోట కూలిపోతున్నా కదలవేమి బ్రదరూ?

ఆ నియోజ‌క‌వ‌ర్గం జేసీ బ్రద‌ర్స్‌కు రాజ‌కీయ దుర్బేధ్యం! గ‌డిచిన 35 ఏళ్లుగా జేసీ కోట‌గా మారిన నియ‌జ‌క‌వ‌ర్గం. అక్కడ నుంచి వేరే నేత‌లు పోటీ చేయాలంటేనే హ‌డ‌ల్‌. [more]

Update: 2020-04-13 13:30 GMT

ఆ నియోజ‌క‌వ‌ర్గం జేసీ బ్రద‌ర్స్‌కు రాజ‌కీయ దుర్బేధ్యం! గ‌డిచిన 35 ఏళ్లుగా జేసీ కోట‌గా మారిన నియ‌జ‌క‌వ‌ర్గం. అక్కడ నుంచి వేరే నేత‌లు పోటీ చేయాలంటేనే హ‌డ‌ల్‌. ఓడిపోతామ‌నే భ‌యం కాదు. క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కుతాయా? అనే ఆందోళ‌న‌. ఏ కొంచెమైనా ప‌రువు నిల‌బ‌డుతుందా ? అనే ఆవేద‌న‌. పార్టీలు మారినా.. అన్న పోటీ చేసినా, త‌మ్ముడు పోటీ చేసినా అక్కడ గెలుపు మాత్రం జేసీ ఫ్యామిలీదే. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ హిస్టరీ క్రియేట్ చేసింది. గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి విజ‌య‌దుందుభి మోగించారు. ఆ నియోజ‌క‌వ‌ర్గమే అనంతపురంలోని తాడిప‌త్రి. జేసీ బ్రద‌ర్స్‌కు కంచుకోట‌గా మారిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేతిరెడ్డి విజ‌యం నిజంగానే హిస్టరీ.

జేసీ బ్రదర్స్ కనుసైగలతో…..

మ‌రి అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క గెలుపుతోనే వైసీపీ స‌రిపెడుతుందా? లేక‌ మున్ముందు కూడా ఇదే త‌ర‌హా విజ‌యాల‌ను సొంతం చేసుకుంటుందా ? ఇప్పుడు ఇదే రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య సాగుతున్న కీల‌క‌మైన చ‌ర్చ. 2014కు ముందు జేసీ దివాక‌ర్ రెడ్డి కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్కడ అనేక ప‌ర్యాయాలు విజ‌యం సాధించారు. 1985 నుంచి 2009 వ‌ర‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డి ఇక్కడ వ‌రుస విజ‌యాలు సాధించారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి జంప్ చేసింది. జేసీ దివాక‌ర్‌రెడ్డి అనంత‌పురం ఎంపీగా విజ‌యం సాధించ‌గా ప్రభాక‌ర్ రెడ్డి తాడిప‌త్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభాక‌ర్ రెడ్డి అంత‌కు ముందే తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మన్‌గా ప‌ని చేసి ఉండ‌డంతో క‌నుసైగ‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని శాసించారు.

పెద్దారెడ్డి వ్యూహంతో…..

టీడీపీలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రించిన జేసీ బ్రదర్స్ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకొని వారి వారి త‌న‌యుల‌ను పోటీ పెట్టారు. ఈ క్రమంలో తాడిప‌త్రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రభాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. ఇక‌, ఇక్కడ నుంచి కేతిరెడ్డి ఫ్యామిలీ గ‌తంలోనూ పోటీ చేసి ఓడిపోయింది. అయితే వైసీపీలో చేరిన పెద్దారెడ్డి ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని స‌వాలుగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నిక‌ల‌కు ముందు నుంచే జేసీ ఫ్యామిలీని ఓడించాల‌ని క‌సితో పెద్దారెడ్డి ప‌నిచేశారు. ఫ‌లితంగా తిరుగులేని మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ క్రమంలోనే అస్మిత్ రెడ్డి యువ‌కుడు, పైగా ప్రభాక‌ర్ రెడ్డి వార‌సుడు గెలుస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, వ్యూహంలోపించింది. తండ్రి తాలూకు వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకోలేక పోవ‌డం ఒక్కసారిగా ప్రత్య‌క్ష ఎన్నిక‌ల్లోకి ప్రత్యక్షం కావ‌డం.. ప్రజ‌ల‌కు చేరువ కాలేక పోవ‌డం, వ్యూహం లేకుండా కేవ‌లం కేతిరెడ్డిని టార్గెట్ చేసుకుని ముందుకు సాగ‌డం వంటివి ఆయ‌న‌కు ప‌రాజ‌యాన్ని ముట‌గ‌ట్టాయి.

కౌన్సిలర్ గా బరిలోకి దిగి…..

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఓట‌మి త‌ర్వాత కూడా అస్మిత్ పుంజుకున్న దాఖ‌లాలు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఉండ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. హైద‌రాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకుని, సొంత వ్యాపారాల్లోనే ఆయ‌న నిమ‌గ్నమ‌య్యారు. ఇక‌, పెద్దారెడ్డి మాత్రం ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల‌కు చేరువ చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీకి రానున్న రోజుల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌గా మారుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. చివ‌ర‌కు ఇక్కడ జేసీ ఫ్యామిలీ ప‌రిస్థితులు ఎలా దిగ‌జారాయంటే ఇక్కడ పార్టీని, త‌న ఫ్యామిలీ ప‌ట్టును కాపాడుకోవాలంటే తమ వార‌సుల కంటే తామే స‌రైన వాళ్లమ‌ని డిసైడ్ అయిన జేసీ బ్రద‌ర్స్ ఇటీవ‌ల మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ప్రభాక‌ర్‌రెడ్డి చివ‌ర‌కు కౌన్సెల‌ర్‌గా టీడీపీ నుంచి రంగంలోకి దిగారు. తాను స్థానికంగా ప్రజాప్రతినిధిగా అయినా ఉంటేనే అక్కడ త‌మ ప‌ట్టు ఉంటుంద‌నే ప్రభాక‌ర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తాడిప‌త్రిలో ప‌ట్టు నిలుపుకోవ‌డం జేసీ సోద‌రుల‌కు శ‌క్తికి మించిన ప‌నే అని చెప్పాలి.

Tags:    

Similar News