అమ్మ పేరు మీదనే మళ్లీ ఎన్నికలు?

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి అంశాన్ని ప్రత్యర్థి పార్టీ తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రధానంగా అధికార అన్నాడీఎంకే ను ఇరుకున పెట్టేందుకు అన్ని [more]

Update: 2020-10-28 18:29 GMT

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి అంశాన్ని ప్రత్యర్థి పార్టీ తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుంది. ప్రధానంగా అధికార అన్నాడీఎంకే ను ఇరుకున పెట్టేందుకు అన్ని అస్త్రశస్త్రాలను విపక్ష డీఎంకే ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మరోసారి చర్చనీయాంశంగా మారబోతోంది. జయలలిత మరణం వెనక మిస్టరీ ఉందన్న అనుమానాలను డీఎంకే వ్యక్తం చేస్తుంది.

అనేక అనుమానాలు…..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబరు 5 వతేదీన మరణించారు. దాదాపు 75 రోజుల పాటు జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది చివరకు తుది శ్వాస విడిచారు. విదేశాల నుంచి వైద్య నిపుణులను రప్పించినా ఫలితం లేకపోయిందని అప్పట్లో వైద్యులు చెప్పారు. అసలు జయలలిత వేదనిలయంలో అపస్మారక స్థితిలో ఉండి ఆసుపత్రిలో చేరారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి తోడు దాదాపు 70 రోజుల పాటు ఎవరినీ జయలలితను చూసేందుకు అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

కమిషన్ ఏర్పాటు చేసినా…..

జయలలితకు తమిళనాట లక్షలాది మంది అభిమానులున్నారు. అందుకే ఒంటిచేత్తో రెండోసారి ఆమె పార్టీని విజయపథాన నడిపించగలిగారు. జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో దీనిపై పళనిస్వామి ప్రభుత్వం ఆర్ముగస్వామి కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ అనేక మందిని విచారణ జరిపింది. అయినా ఎటువంటి ఆధారాలను సేకరించ లేకపోయింది. ఇది ఇప్పుడు డీఎంకే కు ఎన్నికల సమయంలో అస్త్రంగా మారింది.

డీఎంకేకు అస్త్రంగా…..

జయలలిత మరణంపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఆర్ముగస్వామి కమిషన్ ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదని డీఎంకే ఆరోపిస్తుంది. మరో మూడు నెలల పాటు కమిషన్ గడువును పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని కూడా డీఎంకే తప్పుపడుతుంది. జయలలిత మరణంపై తమిళనాడు ప్రజలకు క్లారిటీ ఇచ్చే ఉద్దేశ్యంలో ప్రభుత్వం లేదని డీఎంకే తన ప్రచారంలో వాడుకుంటోంది. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల్లో జయలలిత మరణం డీఎంకేకు ప్రధాన అస్త్రంగా మారనుంది.

Tags:    

Similar News