జ‌వ‌హ‌ర్‌కు డ‌బుల్ ప్రమోష‌న్ రెడీ అయ్యిందా?

మాజీ మంత్రి జ‌వహ‌ర్ హ‌వా టీడీపీలో ప్రారంభ‌మ‌వుతోందా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స్పష్టం చేస్తున్నాయి. జ‌వ‌హ‌ర్ రాజ‌కీయాల్లో సీనియ‌ర్లతో పోలిస్తే అనుభ‌వ‌ప‌రంగా త‌క్కువే అయినా [more]

Update: 2020-10-05 12:30 GMT

మాజీ మంత్రి జ‌వహ‌ర్ హ‌వా టీడీపీలో ప్రారంభ‌మ‌వుతోందా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స్పష్టం చేస్తున్నాయి. జ‌వ‌హ‌ర్ రాజ‌కీయాల్లో సీనియ‌ర్లతో పోలిస్తే అనుభ‌వ‌ప‌రంగా త‌క్కువే అయినా త‌న వాక్చాతుర్యం, వ్యూహాల్లో మాత్రం శ‌భాష్ అనిపించుకున్నార‌నే చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా సీనియ‌ర్లతో స‌మానంగా దూసుకుపోయారు. నాడు ప్రతిప‌క్షంలో, నేడు అధికారంలో ఉన్న వైసీపీపై తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పించ‌డంలోను, పార్టీ త‌ర‌ఫున చేప‌డుతున్న ప్రతి కార్యక్రమంలోను పార్టిసిపేట్ చేయ‌డంలోను త‌న‌దైన వ్యూహంతో జ‌వహ‌ర్ ముందుకుసాగుతున్నారు. చంద్రబాబు తాజాగా నియ‌మించిన పార్లమెంట‌రీ జిల్లాల అధ్యక్షుల జాబితాలో జ‌వ‌హ‌ర్‌ను రాజ‌మ‌హేంద్రవ‌రం పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు నియ‌మించారు.

తిరువూరు ఇన్ ఛార్జిగా….

జ‌వ‌హ‌ర్ ప్రస్తుతం కృష్ణాజిల్లాలోని తిరువూరు పార్టీ ఇంచార్జ్‌గా ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2014 ఎన్నిక‌ల‌కు ముందు అనూహ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వీడి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇచ్చిన చంద్రబాబు ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కడంతో కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంత్రిప‌ద‌వి కూడా ఇచ్చారు. జ‌వ‌హ‌ర్‌కు ఎస్సీ వ‌ర్గంలో పార్టీకి ఫ్యూచ‌ర్లో కీల‌క నేత అన్న పేరు వ‌చ్చినా… స్థానికంగా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌లెత్తిన అసంతృప్తితో ఆయ‌న‌ను సొంత నియోజ‌క‌వ‌ర్గం తిరువూరుకు బ‌దిలీ చేశారు. ఆయ‌న అక్కడ గెలుపు గుర్రం ఎక్కలేక‌పోయినా.. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు.

త్వరలోనే ఆ పదవి కూడా….

ప్రస్తుతం పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నా జ‌వ‌హ‌ర్ మీడియాలో బ‌లంగా పార్టీ వాయిస్ వినిపిస్తుండ‌డంతో పాటు ప్రభుత్వంలో లొసుగులు ఎత్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే బాబు ఆయ‌న్ను రాజ‌మ‌హేంద్రవ‌రం పార్లమెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌గా నియ‌మించారు. అయితే, ఆయ‌న త‌న‌కు తిరిగి కొవ్వూరు బాధ్యత‌లు అప్పగించాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోతాను కొవ్వూరు నుంచి పోటీ చేస్తాన‌ని చెబుతున్నారు. ఈ క్రమంలో దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోక‌పోయినా.. అంత‌కు మించిన ప‌ద‌వి ఇప్పుడు ఇచ్చిన నేప‌థ్యంలో ఇక‌, త్వర‌లోనే కొవ్వూరు ఇన్‌చార్జ్ ప‌ద‌వి కూడా ఆయ‌న‌కే క‌ట్టబెడ‌తార‌నే ప్రచారం జ‌రుగుతోంది.

తిరుగులేని ప్రయారిటీ…..

వాస్తవంగా రాజ‌మ‌హేంద్రవ‌రం పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్ష ప‌ద‌వి బీసీల‌కు ఇస్తార‌నుకున్నా బాబు అనూహ్యంగా జ‌వ‌హ‌ర్‌కు క‌ట్టబెట్టారు. గ‌త ఎన్నికల్లో కొవ్వూరులో పోటీ చేసి ఓడిపోయిన అనిత‌కు బాబు తిరిగి విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే కొవ్వూరు పార్టీ ప‌గ్గాలు జ‌వ‌హ‌ర్‌కు కట్టబెట్టేందుకే చంద్రబాబు సిద్ధంగా ఉన్నా బాబు సామాజిక వ‌ర్గ నేత‌లు అడ్డు త‌గ‌ల‌డంతోనే ఈ ఇన్‌చార్జ్ ప్రక‌ట‌న ఆల‌స్యం అయ్యింది. ఇక ఇప్పుడు జ‌వ‌హ‌ర్‌కు ఏకంగా రాజ‌మ‌హేంద్రవ‌రం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతోనే జ‌వ‌హ‌ర్‌కు తిరుగులేని ప్రయార్టీ ఇచ్చారు. ఇక రేపో మాపో కొవ్వూరు ఇన్‌చార్జ్‌గా ఆయ‌న్ను ప్రక‌టించ‌డం కూడా లాంఛ‌న‌మే అంటున్నారు. జ‌వ‌హ‌ర్‌కు తిరిగి కొవ్వూరు ఇన్‌చార్జ్ ప‌ద‌వి రాకుండా ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కీల‌క నేత‌లు ప్రయ‌త్నాలు ప్రారంభించినా ఈ సారి వీరి మాట‌ను బాబు లైట్ తీస్కోవడం షురూయే అని టాక్‌..?

Tags:    

Similar News