ఈయన విష‌యంలో బాబు మెడ‌పై క‌త్తి పెట్టారే?

మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ విష‌యం మ‌రోసారి టీడీపీలో చ‌ర్చకు, ర‌చ్చకు కూడా దారితీసింది. ప్రస్తుతం ఆయన పార్టీలో పార్లమెంట‌రీ జిల్లా చీఫ్‌గా రాజ‌మండ్రి నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను చూస్తున్నారు. [more]

Update: 2020-11-19 00:30 GMT

మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ విష‌యం మ‌రోసారి టీడీపీలో చ‌ర్చకు, ర‌చ్చకు కూడా దారితీసింది. ప్రస్తుతం ఆయన పార్టీలో పార్లమెంట‌రీ జిల్లా చీఫ్‌గా రాజ‌మండ్రి నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను చూస్తున్నారు. అయితే, ఆ యనకు త్వర‌లోనే కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు కూడా అప్పగిస్తార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మ‌రోసారి జ‌వ‌హ‌ర్ విష‌యం పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌ల‌క‌లానికి దారితీసింది. అయితే, ఈ విష‌యంలో చంద్రబాబు జోక్యం చేసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో జ‌వ‌హ‌ర్ విష‌యంలో చంద్రబాబు నిర్ణ‌య‌మే ఫైన‌లా ? కొవ్వురూ త‌మ్ముళ్లు అంతిమంగా జ‌వ‌హ‌ర్‌ను అంగీక‌రించాల్సిందేనా ? అనేది చూడాలి.

ఆయనకు వ్యతిరేకంగా…

విష‌యంలోకి వెళ్తే.. 2014లో ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌వ‌హ‌ర్‌.. అనూహ్యంగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ మైన కొవ్వూరు నుంచి పోటీ చేశారు. నిజానికి కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వా జోరుగా సాగిన స‌మ‌యంలో కూడా ఇక్కడ ప్రజ‌లు టీడీపీనే గెలిపించారు. అలాంటి చోట‌.. జ‌వ‌హ‌ర్ 2014లో విజ‌యం సాధించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. అప్పటి వ‌ర‌కు అంతా బాగానే ఉంద‌న్న క్రమంలో జ‌వ‌హ‌ర్ ఓ వ‌ర్గాన్ని స్ట్రాంగ్ చేసుకోవ‌డంతో పార్టీలోనే ఆయ‌న్ను బ‌లంగా వ్యతిరేకించే మ‌రో వ‌ర్గం ఆయ‌న‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పావులు క‌దిపింది.

స్థానిక నేతల ఒత్తిడితో…..

దీంతో ఇక్కడ జ‌వ‌హ‌ర్‌పై తిరుగు బావుటా ఎగ‌రేసే ప‌రిస్థితి వ‌చ్చింది. సొంత పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలే.. జ‌వ‌హ‌ర్‌పై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డం, ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తించ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా జ‌వ‌హ‌ర్ విష‌యం చ‌ర్చకు వ‌చ్చింది. పైగా ఆయ‌న స్థానికుడు కాద‌ని, కృష్ణా జిల్లాకు చెందిన నాయ‌కుడిని తెచ్చిన త‌మ నెత్తిన రుద్దారంటూ.. టీడీపీలోని ఓ వ‌ర్గం మ‌రింత దూకుడు ప్రద‌ర్శించింది. దీంతో విధిలేని పరిస్థితిలో జ‌వ‌హ‌ర్‌ను కృష్ణాజిల్లా తిరువూరుకు మార్చారు చంద్రబాబు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్కడ ఓడిపోయారు జ‌వ‌హ‌ర్‌. ప్రస్తుతానికి జ‌వ‌హ‌ర్ తిరువూరు ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయ‌న మ‌న‌సంతా కొవ్వూరు మీదే ఉంది.

మళ్లీ కొవ్వూరుపై…..

దీంతో జవహర్ మ‌ళ్లీ కొవ్వూరుపై దృష్టిపెట్టారు. ఆ మ‌ధ్య కాలంలో ఒక‌టి రెండు సార్లు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్యటించారు. ఇక‌, ఇప్పుడు రాజ‌మండ్రి పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా జ‌వ‌హ‌ర్‌ను నియ‌మించిన చంద్రబాబు.. త్వర‌లోనే కొవ్వూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌లు కూడా అప్పగిస్తార‌ని అంటున్నారు. జ‌వ‌హ‌ర్ కొవ్వూరులోనే ఉంటూ రాజ‌మండ్రి పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యక్ర‌మాలు ప‌ర్యవేక్షిస్తున్నారు. జ‌వ‌హ‌ర్ మ‌ళ్లీ కొవ్వూరు ఇన్‌చార్జ్‌గా వ‌స్తార‌న్న వార్తల‌తో స్థానిక టీడీపీ నాయ‌కులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌పై మ‌రోసారి జ‌వ‌హ‌ర్‌ను రుద్దవ‌ద్దని ఇక్కడి నాయ‌కులు తాజాగా తీర్మానం చేయ‌డం గ‌మ‌నార్హం.

బాబు వ్యూహం మాత్రం…..

అయితే, చంద్రబాబు వ్యూహం మాత్రం మ‌రోలా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎట్టిప‌రిస్థితిలోనూ కొవ్వూరును జ‌వ‌హ‌ర్ కోరిక‌ మేర‌కు ఆయ‌న‌కే క‌ట్టబెట్టేందుకు ఆయ‌న మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఒక‌రిద్దరు సీనియ‌ర్ నాయ‌కుల మాట మీదే ఇప్పటి వ‌ర‌కు చంద్రబాబు కొవ్వూరు క్యాండెట్ డిసైడ్ చేస్తున్నారు. ఈ సారి స‌ద‌రు సీనియ‌ర్లు ఎంత వ్యతిరేకిస్తున్నా వారిని ఒప్పించి అయినా బాబు జ‌వ‌హ‌ర్‌కే ఇక్కడ ప‌గ్గాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని టాక్‌. అయితే ఈ ప‌రిణామం.. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో మ‌రోసారి పెద్ద ర‌గ‌డ‌కు దారి తీసేలా ఉంది. ఇటీవ‌ల జ‌వ‌హ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించిన‌ప్పుడు కూడా వ‌ర్గ పోరు స్పష్టంగా క‌నిపించింది. ఏదేమైనా.. జ‌వ‌హ‌ర్ విష‌యంలో చంద్రబాబు మెడ‌పై క‌త్తిపెడుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News