వద్దు వద్దంటే ఇస్తారే? కావాలంటే కాదంటారే?

రాష్ట్ర టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ‌ద్దు వ‌ద్దన్న వారికి ప‌ద‌వులు, పోస్టులు ద‌క్కుతుంటే.. కావాల‌ని కోరుతున్న వారు మాత్రం వెయిటింగ్‌లోనే ఉంటున్నారు. దీంతో రాష్ట్రంలో ప‌రిస్థితి [more]

Update: 2020-03-14 12:30 GMT

రాష్ట్ర టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వ‌ద్దు వ‌ద్దన్న వారికి ప‌ద‌వులు, పోస్టులు ద‌క్కుతుంటే.. కావాల‌ని కోరుతున్న వారు మాత్రం వెయిటింగ్‌లోనే ఉంటున్నారు. దీంతో రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. సీనియ‌ర్‌లు, జూనియ‌ర్ల మ‌ధ్య అంత‌రాలు కూడా పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా స్థానిక స‌మ‌రానికి అన్ని వైపుల నుంచి అన్నీ సిద్ధమైన స‌మ‌యంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించే నాథుడు కూడా లేకపోవ‌డంతో టీడీపీ ఫ్యూచ‌రేంట‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, తాజా విష‌యంలోకి వెళ్తే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నుంచి 2014లో విజ‌యం సాధించి, త‌ర్వాత మంత్రిగా కూడా చ‌క్రం తిప్పిన జ‌వ‌హ‌ర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఆయ‌న‌ను గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు తిరువూరుకు మార్చారు.

తిరువూరులో కూడా?

అయితే, ఆయ‌న గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక‌, ఇక్కడ పార్టీని నిల‌బెట్టిన స్వామిదాసుకు జ‌వ‌హ‌ర్‌కు ఎక్కడా పొసగ‌డం లేదు. సొంత ప్రాంత‌మే అయినా జ‌వ‌హ‌ర్‌ను ఓన్ చేసుకునేందుకు నాయ‌కులు, కార్యక‌ర్తలు సిద్ధంగా లేకపోవ‌డం గ‌మనార్హం. ఇదే త‌న ఓట‌మికి కార‌ణ‌మైంద‌ని చెప్పుకొనే జ‌వ‌హ‌ర్‌.. త‌న‌కు వెంట‌నే అవ‌కాశం ఇస్తే.. ఇక్కడ నుంచి కొవ్వూరు వెళ్లి అక్కడ పార్టీ కోసం ప‌నిచేస్తాన‌ని ఆయ‌న కొన్నాళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, తిరువూరులోనూ స్వామిదాసు కూడా జ‌వ‌హ‌ర్ ఉంటే..తాను స్వతంత్రంగా వ్యవ‌హ‌రించ‌లేన‌ని త‌న అనుచ‌రుల వ‌ద్ద చెప్పుకొస్తున్నారు. గ‌తంలో ఇక్కడ పార్టీ కోసం తాను అనేక కేసులు కూడా ఎదుర్కొన్నాన‌ని, ఇప్పుడు కూడా పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నాన‌ని చెప్పుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు నిర్ణయం కీల‌కంగా మారింది.

ఇప్పటికీ నిర్ణయం..?

అయితే, చంద్రబాబు మాత్రం అన్ని జిల్లాల‌పైనా నిర్ణయం తీసుకుంటున్నా ఎంతో మంది నాయ‌కుల గురించి నిర్ణయం తీసుకుంటున్నా.. జ‌వ‌హ‌ర్ విష‌యంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. ఆయ‌న కోరుకున్నట్టు కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ని యమించడం ద్వారా అటు అక్కడ పార్టీని ప‌రుగులు పెట్టించ‌డంతోపాటు ఇటు తిరువూరులోనూ స్వామిదాసుకు స్వతంత్రం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. పైగా ఇప్పుడు స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో జ‌వ‌హ‌ర్‌ను కొవ్వూరుకు పంపించ‌డ‌మే మంచిద‌ని సూచిస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో చంద్రబాబు ఇప్పటికీ నిర్ణయం తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మౌనంగా అందుకే..?

ఇదే విష‌యంపై జ‌వ‌హ‌ర్ గుంభ‌నంగా ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించిన ఆయ‌న కొన్నాళ్లుగా మౌనం వ‌హించారు. త‌న‌కు ఇష్టం లేని తిరువూరును త‌ప్పించి ఆయ‌న‌కు ఇష్టమైన కొవ్వూరు ప‌గ్గాలు ఆయ‌న‌కు ఇస్తే జ‌వ‌హ‌ర్ మ‌ళ్లీ విజృంభించ‌డం ఖాయం. ఇదే టైంలో జ‌వ‌హ‌ర్‌ను కొవ్వూరు రాకుండా ఆ నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నేత అచ్చిబాబు వ‌ర్గంతో పాటు క‌మ్మ సామాజిక వ‌ర్గం చంద్రబాబు వ‌ద్ద బ‌ల‌మైన లాబీయింగ్ చేస్తోంది. చంద్రబాబుకు అచ్చిబాబు కుటుంబంతో ఉన్న రిలేష‌న్ నేప‌థ్యంలో ఈ విష‌యంతో ఎటూ తేల్చలేని ప‌రిస్థితి. మ‌రి పార్టీకి కీల‌క‌మైన నేత అయిన జ‌వ‌హ‌ర్ విష‌యంలో బాబు న్యాయం చేస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News