మరో హామీ నిలబెట్టుకున్న జగన్

వైసీపీ అధినేత హోదాలో ఇచ్చిన అనేక హామీలను ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి చకచకా అమలుచేస్తున్నారు. దాంతో ఆయన పాలనపై నమ్మకం పెరుగుతోంది. విశాఖ [more]

Update: 2019-06-27 12:30 GMT

వైసీపీ అధినేత హోదాలో ఇచ్చిన అనేక హామీలను ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి చకచకా అమలుచేస్తున్నారు. దాంతో ఆయన పాలనపై నమ్మకం పెరుగుతోంది. విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ ఇకపై జరపబోమని జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. బాక్సైట్ తవ్వకాలు ఏపీకి అసలు అవసరం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా రద్దు చేశారు. నిజానికి ఇది ఇవాళా నిన్నా సమస్య కాదు పాతికేళ్ళుగా నలుగుతున్న వ్యవహారం. బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీకి తొలిసారి సీఎం అయిన నాటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ పరిణామాల నేపధ్యంలో అనేకమంది టీడీపీ నాయకులు కూడా మావోయిస్టుల చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక టీడీపీ సైతం మన్యం ప్రజల అభిమానాన్ని సంపాదించడంలో విఫలమైంది. ఆ పార్టీకి ఒక అప్పుడు ఇక్కడ చెక్కుచెదరని జనాదరణ ఉండేది. ఎప్పుడైతే బాక్సైట్ విషయంలో కొంత దూకుడుగా వ్యవహ‌రించిందో నాటి నుంచి గిరిజనం ఆ పార్టీని దూరం పెట్టారు.

జగన్ కి బ్రహ్మరధం :

ఇక విశాఖ సహా మొత్తం ఏపీలోని ఏజెన్సీ జిల్లాల్లో గిరిజనులు తాజా ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరధం పట్టారు. ఆ పార్టీ అభ్యర్ధులు మొత్తానికి మొత్తంగా ఎస్టీ రిజర్వుడ్ సీట్లలో గెలిచారు. ఇక అరకులో అయితే ఎంపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధవిని పోటీకి పెడితే 2 లక్షల 80 వేల మెజారిటీతో గెలిచారు. అదే విధంగా అరకు, పాడేరు అసెంబ్లీతో పాటు సాలూరు, కురుపాం, పాలకొండ, రంపచోడవరం కోవూరు వంటి సీట్లలో వైసీపీ గెలుపు సాధించడానికి గిరిజనుల అభిమానమే కారణం. దాంతో జగన్ మోహన్ రెడ్డి కూడా తన హామీని నిలబెట్టుకోవడమే కాదు. ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ పదవులను ఎస్టీ అభ్యర్ధులకు కేటాయించారు.

పెరిగిన గిరిజన బలం :

జగన్ మోహన్ రెడ్డి తాజా ప్రకటనతో గిరిజనుల్లో వైసీపీకి మరింతగా బలం పెరిగినట్లైంది. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు నవ్యాంధ్రలో కూడా ప్రయత్నాలు చేసింది. జీవో 97 ను మొదట తీసుకువచ్చి, పెద్ద ఎత్తున గిరిజనుల్లో వ్యతిరేకత రావడంతో ఆపేస్తామని చెప్పినా జీవోను రద్దు చేయకుండా అలాగే ఉంచేసింది. ఓ వైపు బాక్సైట్ జోలికి పోమని చెబుతూనే జీవోను రద్దు చేయకపోవడంతో టీడీపీపై వ్యతిరేకత ఏర్పడింది. జగన్ మాత్రం పాత జీవోనూ రద్దు చేయడంతో పూర్తిగా బాక్సైట్ తవ్వకాలపైన గిరిజనుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగిపోయాయని చెప్పవచ్చు. మొత్తానికి గిరిజనులపైన తనకున్న అంకితభావం, నిబద్ధతను ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చాటుకున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News