ఒకరికి… ఒకరు..దెబ్బేసుకున్నారా…?

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తవ్వగా అభ్యర్థుల భవితవ్యం వచ్చే నెల 23వ తేదీన తేలనుంది. అయితే ఇక్కడ [more]

Update: 2019-04-28 17:30 GMT

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తవ్వగా అభ్యర్థుల భవితవ్యం వచ్చే నెల 23వ తేదీన తేలనుంది. అయితే ఇక్కడ రెండు నియోజకవర్గాల ఫలితాలపై మాత్రం అన్ని పార్టీల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఫలితాలు తేడా వస్తే సంకీర్ణ ప్రభుత్వంపై కూడా దాని ప్రభావం పడే అవకాశముంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ ఎస్ లు కలసి పోటీ చేశాయి. జేడీఎస్ ఏడు స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాల్లో బరిలోకి తమ అభ్యర్థులను దించాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల లీడర్లు, క్యాడర్ ఒకరినొకరు సహకరించుకోలేదన్న వార్తలు కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు నిద్రపట్టడం లేదు. అనేకచోట్ల నుంచి ఇదే రకమైన ఫిర్యాదులు రెండు పార్టీలకూ అందుతుండటం విశేషం.

సహకరించుకోని రెండు పార్టీల….

జనతాదళ్ ఎస్ అధిపతి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు బద్ధ శత్రువులైనప్పటికీ ఈ ఎన్నికల్లో కలసి ప్రచారం చేశారు. అయినా ఫలితం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నేతల పనితీరుపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాలనికూడా దేవెగౌడ భావిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో తమ కార్యకర్తలు సహకరించినా కాంగ్రెస్ క్యాడర్ మాత్రం తమ అభ్యర్థులను ఓడించడానికే ప్రయత్నించిందన్నది పెద్దాయన ఆవేదన. ఇటు సిద్ధరామయ్య సయితం కొన్ని చోట్ల జేడీఎస్ క్యాడర్ సహకరించడం లేదని చెబుతున్నారు.

మాండ్యలో పరిస్థితిపై…

దేవెగౌడ కుటుంబం నుంచి ఈసారి ముగ్గురు లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచారు. మాండ్య నుంచి దేవెగౌడ మనవడు నిఖిల్ గౌడ, తముకూరు నుంచి దేవెగౌడ, హాసన్ నుంచి మరో మనవడు ప్రజ్వల్ పోటీ చేశారు. హాసన్ కొంత అనుకూలంగానే ఉన్నప్పటికీ మాండ్య, తుముకూరు నియోజకవర్గాల్లో మాత్రం దేవెగౌడ కుటుంబానికి కాంగ్రెస్ క్యాడర్ చుక్కలు చూపించిందంటున్నారు. మాండ్య నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ జెండాలు పట్టుకుని మరీ స్వతంత్ర అభ్యర్థి సుమలత వెంట తిరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల ఫొటోలను, వీడియోలను కూడా ఏఐసీసీకి దేవెగౌడ సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

ఫలితాల తర్వాత….?

మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ జెండాలు కలసి పనిచేశాయన్నది ఆయన ఆరోపణ. అలాగే మైసూరుప్రాంతంలో తమకు జేడీఎస్ క్యాడర్ సహకరించలేదని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరికి అనుమానం ఉంది. జనతాదళ్ ఎస్ పార్టీలో మాత్రం తుముకూరు, మాండ్య నియోజకవర్గంలో విజయావకాశాలపై టెన్షన్ పట్టుకుంది. మాండ్య నియోజకవర్గంలో ఓటమి పాలయితే ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధపడే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కర్ణాటకలో మే 23వ తర్వాత అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారే అవకాశముంది.

Tags:    

Similar News