బెంబేలెత్తిపోతున్నారా?

అన్ని రాష్ట్రాల్లోలాగే కర్ణాటకలో కూడా బీజేపీ దెబ్బకు భయపడాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యూహాలు దెబ్బకు దేశమంతా అల్లాడి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు [more]

Update: 2019-10-22 17:30 GMT

అన్ని రాష్ట్రాల్లోలాగే కర్ణాటకలో కూడా బీజేపీ దెబ్బకు భయపడాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యూహాలు దెబ్బకు దేశమంతా అల్లాడి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు బీజేపీ దెబ్బకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాను తిరిగి బీజేపీతో కలసి నడవటానికి ఓకే అంటూ ఆయన చెప్పడం ఇందుకు నిదర్శనం. అలాగే కర్ణాటకలో సయితం ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ ఎస్ కూడా బీజేపీ దెబ్బకు బెంబేలెత్తిపోతుంది. ఇటీవలే జేడీఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

పన్నెండు మంది ఎమ్మెల్యేలు….

అయితే మరో పన్నెండు మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కొందరు ఇప్పటికే సీక్రెట్ గా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో జేడీఎస్ నాయకత్వం అప్రమత్తమయింది. కర్ణాటకలో పదిహేను స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో జేడీఎస్, కాంగ్రెస్ లు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమైన సిద్ధరామయ్యకు తిరిగి ఆ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడాన్ని జేడీఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

బీజేపీ తిరిగి….

ఉప ఎన్నికల్లో ప్రస్తుతమున్న పరిస్థితులను చూస్తే బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం లేదు. మొత్తం పదిహేను స్థానాల్లో ఐదుకు మించి గెలుచుకునే అవకాశాలు బీజేపీకిలేవు. ఇదే జరిగితే యడ్యూరప్ప ప్రభుత్వం కుప్ప కూలిపోతుంది. అందుకే బీజేపీ ముందస్తు చర్యల్లో భాగంగా జేడీఎస్, కాంగ్రెస్ నేతలకు భారీ ఎత్తున ఆఫర్లుఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా జేడీఎస్,కాంగ్రెస్ కు కష్టంగానే కన్పిస్తుంది. తన మాట జవదాటరని భావించిన ఎమ్మెల్యేలు సయితం వెళ్లిపోవడంతో జేడీఎస్ అధిష్టానం అప్రమత్తమయిందంటున్నారు.

మద్దతిస్తామంటూ….

అందుకే బీజేపీతో చెలిమి చేయాలని జేడీఎస్ అధిష్టానం నిర్ణయించిందంటున్నారు. ఒక వేళ ఉప ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోకపోయినప్పటికీ బీజేపీ ప్రభుత్వానికి తాము మద్దతిస్తామన్న సంకేతాలను జేడీఎస్ నేతలు పంపుతున్నారు. దేవెగౌడ నుంచి ఈ ప్రతిపాదనకు సానుకూలత వచ్చినట్లు సమాచారం. బీజేపీతో వైరంతో ఉంటే ఉన్న ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోతారన్న ఆందోళన జేడీఎస్ అగ్రనేతల్లో ఉంది. అయితే బీజేపీతో చెలిమిపై సాధ్యాసాధ్యాలను జేడీఎస్ అధిష్టానం పరిశీలిస్తుంది. అంతకు మించి మార్గం లేదన్నది మాత్రం జేడీఎస్ లోని ఎక్కువ మంది నేతల్లో స్పష్టమవుతోంది.

Tags:    

Similar News