కీలక సమయంలో కాడి వదిలేశారా?

ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తే.. రాజ‌కీయాల్లో వ‌ర్కవుట్ అవుతుందో తెలిసిన‌వారే నిజ‌మైన నాయ‌కుడు, నిజ‌మైన పార్టీ అంటారు సీనియ‌ర్లు. ఎన్ని వ్యూహాలు ఉన్నప్పటికీ.. కీల‌క‌మైన స‌మ‌యంలో స్పందించ‌క‌పోతే.. [more]

Update: 2019-12-30 03:30 GMT

ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తే.. రాజ‌కీయాల్లో వ‌ర్కవుట్ అవుతుందో తెలిసిన‌వారే నిజ‌మైన నాయ‌కుడు, నిజ‌మైన పార్టీ అంటారు సీనియ‌ర్లు. ఎన్ని వ్యూహాలు ఉన్నప్పటికీ.. కీల‌క‌మైన స‌మ‌యంలో స్పందించ‌క‌పోతే.. స‌ద‌రు పార్టీ కానీ, నాయ‌కుడు కానీ ప్రేక్షక పాత్రకే ప‌రిమిత‌మైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఇలాంటి ప‌రిస్థితే.. జ‌న‌సేన కూడా ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ఎద‌గాలి.. అధికారంలోకి రావాలి.. అంటూ సుధీర్ఘమైన ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న జ‌న‌సేన అనేక పోరాటాల‌ను భుజాన వేసుకుంది. ఎవ‌రూ అడ‌గ‌కుండానే ఇసుక ర్యాలీని నిర్వ‌హించింది. ఏ రైతూ డిమాండ్ చేయ‌కుండానే రైతు సౌభాగ్య దీక్షకు జ‌న‌సేనాని న‌డుం బిగించారు. ఇక‌, ప్రత్యేక హోదా విష‌యాన్ని కూడా ఆయ‌న భుజానికి ఎత్తుకున్నా.. త‌ర్వాత కాలంలో దీనిని వ‌దిలేశారు.

అనుకూలంగా మార్చుకోవడంలో…..

కానీ, ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్ ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డంతోపాటు.. వివిధ సంద‌ర్భాల్లో ప్రజ‌ల‌కు నేనున్నానంటూ.. ఆయ‌న క‌నిపించారు. త‌న వాయిస్ వినిపించారు. అంతా బాగానే ఉంది. అయితే, ఇప్పుడు రాజ‌ధాని విష‌యంపై రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. అదే స‌మ‌యంలో పార్టీ ప‌రంగా కూడా ఇది క‌లిసివ‌చ్చే అంశం. వాస్తవానికి రాజ‌ధానికి నిధులు ఇస్తామ‌ని పూర్తిగా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బీజేపీ వంటి పార్టీలు కూడా ప్రస్తుతం అమ‌రావ‌తి ప్రాంతంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోనూ, త‌మ‌కు అనుకూలంగా ప్రజ‌ల్లోకి వెళ్లేందుకు కూడా వ్యూహాత్మకంగా వీటిని మ‌లుచుకుంటున్నాయి.

అందరూ యాక్టివ్ అయినా…

ఈ క్రమంలో క‌నీసం త‌న‌కు డిపాజిట్ కూడా ద‌క్కకుండా పోయినా.. బీజేపీ చీఫ్ క‌న్నా లక్ష్మీ నారాయ‌ణ అనూహ్యంగా మౌన దీక్షకు కూర్చుని రాజ‌ధాని ప్రజ‌ల‌కు అండ‌గా ఉన్నార‌నే ప్రశంస‌ల‌ను సొంతం చేసుకున్నారు. ఇక‌, ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అయితే, రోజూ వివిధ రూపాల్లో ఏదొ ఒకవిధంగా అమ‌రావ‌తిపై ఆందోళ‌న‌ల‌కు మ‌ద్దతిస్తోంది. ఇక‌, కామ్రేడ్ల ప‌రిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎక్కడ న‌లుగురు మూగితే.. అక్కడ ఎర్రజెండాలేసుకుని వ‌చ్చేసే వీరు.. రాజ‌ధాని విష‌యాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని నిర‌స‌న‌ల‌కు కూర్చుంటున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో సుదీర్ఘ ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసుకున్న జ‌న‌సేన ఏం చేస్తున్నట్టు? ముఖ్యంగా ఒక‌ప్పుడు రాజ‌ధాని రైతుల ప‌క్షాన నిలిచిన ప‌వ‌న్ ఏం చేస్తున్నారు? ఆయ‌న నాయ‌కులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

సంఘీభావాన్ని ప్రకటించి….

ఆదిలో ఒక‌రోజు.. నాగ‌బాబు.. నాదెండ్ల మ‌నోహ‌ర్ వంటి వారు వ‌చ్చి కొన్ని గ్రామాల్లో ప‌ర్యటించి రైతుల ప‌క్షాన వాయిస్ వినిపించారు. మొన్నటి వ‌ర‌కు చిన్న చిన్న విష‌యాల‌కే ప‌వ‌న్ ప్రతిప‌క్ష నేత చంద్రబాబు కంటే ముందుగానే దూసుకుపోయేవారు. ప‌వ‌న్‌ను బాబు ఫాలో అవుతున్నార‌న్న టాక్ కూడా వినిపించింది. కానీ ఇప్పుడు రాజ‌ధానిపై ఇంత రాద్దాంతం జ‌రుగుతున్నా ప‌వ‌న్ స్పందించ‌క‌పోవ‌డం ఆ పార్టీ శ్రేణుల్లోనే నైరాశ్యం నింపుతోంది.

అందుకే రావడం లేదా?

ప‌వ‌న్ హ‌డావిడి చేసిన‌ప్పుడు మిన‌హా ఆ త‌ర్వాత జ‌న‌సేన నాయ‌కులు, కార్యక‌ర్తల ఊసు ఎక్కడా క‌నిపించ‌లేదు. దీంతో అస‌లు జ‌న‌సేన ఏం చేస్తున్నట్టు? రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలో యూట‌ర్న్ ఏమైనా తీసుకుం దా? అనే సందేహాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న‌ను స్వాగ‌తించారు. దీంతో జ‌న‌సేన నాయ‌కులు ఇర‌కాటంలో ప‌డ్డారా? అనే సందేహాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. మొత్తంగా చూస్తే.. జ‌న‌సేన స‌మ‌యానికి త‌గిన విధంగా స్పందించ‌క‌పోవ‌డంపై మేధావులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఎద‌గ‌డం క‌ష్టమేన‌ని అంటున్నారు.

Tags:    

Similar News