సేన కు అచ్చిరాలేదట

పశ్చిమ గోదావరి జిల్లా జనసేనాని పవన్ కల్యాణ్ సొంత జిల్లా. ఇప్పుడు ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పవన్ కల్యాణ్ హవా ఉంటుందని [more]

Update: 2020-02-05 05:00 GMT

పశ్చిమ గోదావరి జిల్లా జనసేనాని పవన్ కల్యాణ్ సొంత జిల్లా. ఇప్పుడు ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పవన్ కల్యాణ్ హవా ఉంటుందని వైసీపీ, టీడీపీ నుంచి జనసేన లో వచ్చి చేరిన నేతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీతో పొత్తుతో తమకు ఇక ఇక్కడ అవకాశం ఉండదని భావించి తిరిగి సొంత గూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీతో పొత్తుతో పవన్ కల్యాణ్ తో తెగదెంపులు చేసుకునేందుకు జనసైనికులు సిద్ధమవుతున్నారు.

క్రేజ్, ఇమేజ్ చూసి….

పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఇమేజ్ చూసిన కొందరు వైైసీపీ, టీడీపీ నేతలు 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఖచ్చితంగా తాము గెలిచి తీరుతామని నమ్మారు. అయితే పరిస్థితి కలసి రాలేదు. జగన్ హవా ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసన అభ్యర్థులందరూ మట్టి కరిచారు. పోనీ వచ్చే ఎన్నికల నాటికి తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుందామని డిసైడ్ అయి పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఒక్క సారిగా నీరుగారిపోయారు.

ఫ్యామిలీకే అచ్చిరాక…

నిజానికి పవన్ కల్యాణ్ కుటుంబానికే పశ్చిమ గోదావరి జిల్లా అచ్చిరాలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి గెలవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరో సోదరుడు నాగబాబు నర్సాపురం పార్లమెంటు నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. ఇలా మెగా ఫ్యామిలీకి పశ్చిమ గోదావరి జిల్లా అచ్చిరాలేదనే చెప్పాల్సి ఉంటుంది.

తిరిగి వెళ్లిపోయేందుకు…..

బీజేపీతో పొత్తును జనసేన పార్టీ నేతలతో సంప్రదించకుండా పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని కొందరు జనసన నేతలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ నుంచి వచ్చిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొలశెట్టి శ్రీనివాస్, పాలకొల్లు వైసీపీ నేత గుణ్ణం నాగబాబు, కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు, తణుకు నేత పసుపులేటి వెంకటరామారావులు జనసేనలో చేరారు. బీజేపీతో పొత్తు కారణంగా తమ సీట్లకు ఎసరు వచ్చే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం టిక్కెట్ దక్కే అవకాశం లేదని భావించి తిరిగి తమ సొంత పార్టీలవైపు చూస్తున్నారు. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భవిష్యత్తు లోనూ రాజకీయంగా ఈ జిల్లా కలసి వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.

Tags:    

Similar News