జానీ తప్పు చేస్తున్నారా?

ఏక వ్యక్తి పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవన్నది చరిత్ర చెప్పిన విషయం. పార్టీ అనగానే సమిష్టి ఆలోచలనతో ముందుకు సాగాలి. అలాగే పార్టీని క్షేత్ర స్థాయి [more]

Update: 2019-12-17 00:30 GMT

ఏక వ్యక్తి పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవన్నది చరిత్ర చెప్పిన విషయం. పార్టీ అనగానే సమిష్టి ఆలోచలనతో ముందుకు సాగాలి. అలాగే పార్టీని క్షేత్ర స్థాయి నుంచి విస్తరించాలి. అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఈ పార్టీ నాది అన్న భావన ప్రతీవారిలో కలిగించాలి. మరి జనసేనలో ఈ లక్షణాలు ఏవీ కనిపించవు. పార్టీ పెట్టి ఆరేళ్ళు అయినా కూడా పవన్ కల్యాణ‌్ ఒక్కరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఆయనే ఇప్పటివరకూ ఆందోళన‌లైనా, మీడియా సమావేశాలైనా కనిపిస్తున్నారు. పార్టీలో పవన్ కల్యాణ‌్ తరువాత ఎవరు అన్న ప్రశ్న ముందుకు వచ్చినపుడు రెండవ మనిషి కనిపించడంలేదు. ఎన్నికల్లో జనసేన ఓటమికి అది ప్రధాన కారణం. మరి ఆరు నెలల తరువాత అయినా ఆ తప్పుని దిద్దుకుంటున్నారా అంటే లేదనే పార్టీ నేతలు అంటున్నారు.

అవే విమర్శలు…..

పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా అవే విమర్శలు చేస్తున్నారు. పార్టీలో పవన్ కల్యాణ‌్ తప్ప ఎవరూ లేరని అంటున్నారు. తన తరువాత వారు ఎదగడానికి పవన్ కల్యాణ‌్ అసలు ఒప్పుకోరని నిన్నటి వరకూ ఆయన పక్కన ఉన్న పొలిటి బ్యూరో సభ్యుడు రవితేజ అంటున్నారంటేనే అర్ధం చేసుకోవాలి. అది ఆయన చెప్పకుండానే అర్ధమవుతోంది కూడా. పార్టీకి గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం లేదు. కొందరిని అధికార ప్రతినిధులుగా, పొలిటి బ్యూరో సభ్యులుగా పెట్టినా కూడా వారెవరూ ఇంతవరకూ పెద్దగా గొంతు విప్పింది లేదు. ఆఖరుకు రవితేజ పార్టీ నుంచి వెళ్ళిపోతూంటే స్పందించడానికి కూడా పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటన చేయాల్సివచ్చింది.

రాపాక ఘాటు కామెంట్స్…

అసలు జనసేన పార్టీ లేదని ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అంటున్నారు. జనసేనలో నిర్మాణం లేదని, అన్నీ పవన్ ఒక్కరే చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో జనసేనకు భవిష్యత్తు లేదని కూడా తేల్చేశారు. పార్టీ కోసం అందరూ అన్నట్లుగా ఉండాలని, ప్రతీ ఒక్కరూ కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎపుడు చూసినా పవన్ తానే వన్ మ్యాన్ షో చేస్తూ కనిపిస్తే పార్టీ ఎలా బతికి బట్టకడుతుందని రాపాక అంటున్న మాటలు సహేతుకమైనవేనని చెప్పాలి.

అసంత్రుప్తి ఉందా ?

ఇక్కడొక విషయం చెపాలి. జనసేనలో ఉన్న నాయకుల్లో అసంతృప్తి బాగా ఉందని బయటకు వచ్చిన నేతల మాటలు బట్టి తెలుస్తోంది. పవన్ పక్కన ఉన్న వారు కూడా రేపు బయటకు వచ్చి ఇదే రకమైన మాట అన్నా ఆశ్ఛర్యపోనవసరం లేదు. పవన్ రాజకీయాలను సైతం సినిమాటిక్ గా చేయడం వల్లనే ఈ పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. ఇక పవన్ ఎవరు మాటా వినరని, సలహాలు తీసుకోరని కూడా ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. మరో వైపు చూస్తే పవన్ పక్కన ఎపుడూ కనిపించే ఓ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కూడా రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఏమవుతుందో చూడాలి.

గాడిలో పెడతారా…?

పవన్ ఇప్పటికైనా పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటే దానికి ఇంతకు మించిన అవకాశం లేదని అంటున్న వారు కూడా అదే పార్టీలో ఉన్నారు. నాలుగేళ్ళకు పైగా ఎన్నికలు సమయం ఉంది. అందువల్ల పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మించుకోవాలని, ఇప్పటికిపుడే జగన్ మీద విమర్శలు చేసే బదులు తగిన సమయం చూసి జాగ్రత్తగా స్పందించాలని కూడా సూచిస్తున్నారు. మరో వైపు సొంత రాజకీయం, సొంత విధానాలు అమలు చేశామని క్యాడర్ నమ్మేలా పవన్ నడవడిక ఉండాలని కూడా అంటున్నారు. మరి పవన్ ఈ విమర్శలను సానుకూలంగా తీసుకుని పార్టీని గాడిలో పెడతారా..? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News