పవన్ పెదవి విప్పనది అందుకేనటగా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో పెదవి విప్పడం లేదు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు తరహా వ్యూహాన్నే పోతిరెడ్డిపాడు విషయంలో ప్రదర్శిస్తుండటం ఇప్పుడు [more]

Update: 2020-05-16 13:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో పెదవి విప్పడం లేదు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు తరహా వ్యూహాన్నే పోతిరెడ్డిపాడు విషయంలో ప్రదర్శిస్తుండటం ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజులుగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడంపై తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఏకమయ్యాయి. కేంద్ర జలవనరుల మంత్రికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది.

బీజేపీతో పొత్తు పెట్టుకుని…..

అయితే జనసేన మాత్రం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయాన్ని చూసీ చూడనట్లు వదిలేసింది. బీజేపీతో ఏపీలో అలయన్స్ పెట్టుకున్న జనసేన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో మాత్రం కలవడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడాన్ని ఇప్పటికే స్వాగతించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది బీజేపీ నినాదమని కూడా ఆయన చెప్పారు. కానీ పార్ట్ నర్ గా ఉన్న పవన్ కల్యాణ్ మాత్రం పోతిరెడ్డిపాడు విషయంలో మౌనంగా ఉన్నారు.

రెండు రాష్ట్రాల్లో ఉండాలనేనా?

జనసేన రెండు రాష్ట్రాల్లో ఉండాలనుకుంటోంది. బీజేపీ కూడా తెలంగాణలో పవన్ కల్యాణ‌్ ఇమేజ్ ఉపయోగపడుతుందని భావించి పొత్తుకు అంగీకరించింది. పవన్ కల్యాణ్ వెనుకబడిన ప్రాంతాల విషయంలో ఎప్పుడూ ముందుగా స్పందిస్తారు. పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని పెంచితే రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సయితం తాగునీటి ఎద్దడి తొలుగుతుంది. ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు.

చంద్రబాబు తరహాలోనే….

రాయలసీమ అంటేనే అలివిమాలిన ప్రేమ ఒలకబోసే పవన్ కల్యాణ్ పోతిరెడ్డిపాడు విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. జగన్, కేసీఆర్ ల రాజకీయ ఉచ్చులో జనసేన పడకూడదన్న కారణంగానే ఆయన ఈ అంశంపై మాట్లాడటం లేదని చెబుతున్నారు. చంద్రబాబు సయితం ఇదే వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ పోతిరెడ్డి పాడులో ఇద్దరూ ఒక్కటయ్యారన్న కామెంట్స్ పడుతున్నాయి. మొత్తం మీద జగన్ ప్రభుత్వంపై తరచూ ట్వట్టర్ లో విరుచుకుపడే పవన్ కల్యాణ్ పోతిరెడ్డిపాడు విషయంలో మద్దతు ఇస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News