డైలాగులు మాత్రం భారీగానే.. డైరెక్ట్ ఫైట్ మాత్రం?

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ డైలాగులే తప్ప డైరెక్ట్ గా ఆచరణలోకి దిగరు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ గెలిచిన తర్వాత [more]

Update: 2021-02-28 03:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ డైలాగులే తప్ప డైరెక్ట్ గా ఆచరణలోకి దిగరు. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది. 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై ఆయన పోరాటం మొదలుపెట్టారు. పాచిపోయిన లడ్డూలంటూ ప్యాకేజీ పై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా కోసం తాను ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు. ప్రత్యేక హోదా ఊసు పక్కకు పోగా, ఇప్పుడు పవన్ కల్యా‌ణ్ బీజేపీ చెంతకు చేరిపోయారు.

ఏ విషయంలోనైనా ముందు హడావిడి….

తర్వాత రాజధాని అమరావతిని తరలిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేయగానే రాజధాని రైతులకు అండగా నిలబడతానని పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు. అవసరమైతే ఆమరణ దీక్షకు దిగి ప్రభుత్వం దిగివచ్చేలా చేస్తానని హెచ్చరికలు చేశారు. బెజవాడ నుంచి అమరావతి వరకూ మార్చ్ నిర్వహిస్తానని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇవేమీ లేకుండానే అమరావతి కథను పవన్ కల్యాణ్ అలా ముగించేశారు. అమరావతి రైతుల దీక్షలు నాలుగు వందల రోజులకు చేరుతున్నా మళ్లీ పవన్ కల్యాణ్ అటువైపు చూడలేదు.

అంతంత మాత్రంగానే…?

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై పవన్ కల్యాణ్ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. దీనిపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, బీజేపీ పెద్దలను కలసి వచ్చారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కు నిరసనగా ఆందోళన కార్యక్రమమూ నిర్వహించలేదు. నిజానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పవన్ కల్యాణ్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన మొన్న గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అదే నియోజకవర్గంలో…..

ఇదే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్షకు దిగారు. వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టింది. కానీ పవన్ కల్యాణ్ ఈ సమయంలోనైనా సెంటిమెంట్ అధికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష్య ఆందోళనకు దిగుతారని అందరూ భావించారు. బీజేపీతో కలసి ఉండటంతో ఆయన చెబితే పని సులువుగా అయిపోతుందని భావించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఢిల్లీకి వెళ్లి వచ్చి మమ అనిపించారు. ఇలా పవన్ కల్యాణ్ కేవలం డైలాగ్ లతోనే పనికానిచ్చేస్తున్నారన్న విమర్శలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. చిన్న విషయాలకు కూడా దీక్షలు చేస్తానని హెచ్చరించే పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి పై నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.

Tags:    

Similar News