పీకల్లోతు ప్రేమలో పవన్

పవన్ కల్యాణ‌్ ముందు సినిమా యాక్టర్. ఆ తరువాత పొలిటీషియన్. పవన్ హీరోగా సినిమాల్లో హీరోయిన్ని ప్రేమించడం కామన్. రాజకీయాల్లోకి వచ్చినపుడు ప్రజలకు ప్రేమిస్తాను అని పవన్ [more]

Update: 2020-05-14 14:30 GMT

పవన్ కల్యాణ‌్ ముందు సినిమా యాక్టర్. ఆ తరువాత పొలిటీషియన్. పవన్ హీరోగా సినిమాల్లో హీరోయిన్ని ప్రేమించడం కామన్. రాజకీయాల్లోకి వచ్చినపుడు ప్రజలకు ప్రేమిస్తాను అని పవన్ చెప్పారు. కానీ వాటికంటే ముందు రాజకీయ పార్టీలను ప్రేమించడం మొదలుపెట్టారు. ఆయన 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టాక తన సొంత పార్టీ కంటే కూడా ఎక్కువగా బీజేపీ, తెలుగుదేశం పార్టీలను ప్రేమించారు. అందుకే తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ రెండు పార్టీలకే ప్రచారం చేసిపెట్టారు, ప్రజల ఆదరణ బాగుంది కాబట్టి ఆ రెండు పార్టీలు గెలిచాయి. ఇక 2019 నాటికి పవన్ కల్యాణ‌్ కి ఎర్రన్నల మీద మోజు పుట్టింది. సీపీఐ, సీపీఎం పార్టీలను విపరీతంగా ప్రేమించారు. దానికి కారణం చెబుతూ మా నాన్న కమ్యూనిస్ట్, నాకు అవే లక్షణాలు వచ్చాయని చెప్పుకున్నారు. ఇక ఆ ప్రేమ అక్కడితో ఆగలేదు. ఎక్కడో ఉత్తర భారతాన ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న బహుజన సమాజ్ వాది పార్టీని కూడా ప్రేమించేశారు. లక్నో వెళ్ళి మరీ మాయావతిని కలిశారు. ఆమె ఏపీకి వస్తే కారు దిగగానే పాదాభివందనం చేశారు.

చెగువెరా నుంచి…

అర్జంటీనాకు చెందిన విప్లవ నేత చెగువరా నుంచి స్పూర్తి పొందానని పవన్ కల్యాణ‌్ చాలా సార్లు చెప్పుకున్నారు. తనకు ఆయనంటే ఇష్టమని పలుమార్లు పలికారు. ఆ చెగువెరా భావజాలంతోనే కమ్యూనిస్టులతో చెలిమి అంటూ కూడా కబుర్లు చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ తన పార్టీ ఓడి, తాను కూడా రెండు చోట్లా ఓడగానే కమ్యూనిస్టుల మీద కూడా విరక్తి పుట్టినట్లుంది. వారికి నై అనేశారు. మళ్ళీ కమలదాళానికి జై కొట్టేశారు. మోడీ, అమిత్ షాను మించిన నేతలు దేశంలోనే లేరని పవన్ కల్యాణ్ గట్టిగా ప్రకటించారు. వారిద్దరు తలచుకుంటే ఏమైనా చేయగలరని కూడా చెప్పుకొచ్చారు.

లవ్వు తగ్గట్లా …?

ఇక వెంకయ్యనాయుడు మీద పవన్ ఇపుడు అకారమైన, అకాల ప్రేమను ప్రదర్శించడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తావు ఇస్తోంది. ఇదే పవన్ 2017న వెంకయ్యనాయుడును బాగా ఆడిపోసుకున్నారు. దాన్ని ఇప్పటికి జనాలు బాగానే గుర్తు పెట్టుకున్నారు. పాచి పోయిన లడ్లు ఏపీకి ఇస్తారా అని నాయుడు గారి మీద గుస్సా అయ్యారు. జై ఆంధ్రా ఉద్యమాల్లో చనిపోయిన వారిని వెంకయ్యనాయుడు లాంటి వారు ఆదుకున్నారా అంటూ నాడు గట్టిగానే కాకినాడ సభలో పవన్ కల్యాణ‌్ నిలదీసిన సంగతి తెలిసిందే. అంతే కాదు, అప్పట్లో అనేక సందర్భాలో వెంకయ్యనే పవన్ టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇపుడు అర్జంట్ గా వెంకయ్యనాయుడు పవన్ కల్యాణ్ కి దేవుడు అయిపోయారు. వెంకయ్యనాయుడు నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఆయన గొప్ప నాయకుడు అంటూ కీర్తిస్తున్నారు పవన్. నిజానికి ఇపుడు వెంకయ్యనాయుడు పుట్టిన‌ రోజు కాదు, మరే సందర్భమూ లేదు, కానీ ట్విట్టర్ ఉంది కదా అని పవన్ కల్యాణ్ పొగుడుతున్నారు. దాని వెనక అర్ధాలు పరమార్ధాలే ఇపుడు చర్చకు వస్తున్నాయి.

విలీనమేనా…?

పవన్ కల్యాణ‌్ కి కొత్త భయం పట్టుకుందిట. ఏపీలో వైసీపీ, బీజేపీ కేంద్ర నాయకత్వం మధ్య తెలియని అవగాహన ఉందని కూడా ఆయన అనుమానిస్తున్నారుట. ఇక ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య పొత్తులు ఉన్నా కూడా పెద్దగా వర్కౌట్ కావడంలేదు. దాంతో తానే కాషాయం కట్టేస్తే పోలా అన్న ఆలోచనలు పవన్ కల్యాణ్ ఏమైనా చేస్తున్నారా అన్న డౌట్లు సొంత పార్టీలో కూడా వస్తున్నాయి. పార్టీని నడపడం కష్టం. ఇపుడు కరోనా వచ్చింది. లాక్ డౌన్ తో సినిమా పరిశ్రమ కుదేల్ అవుతోంది. ఈ సమయంలో సినిమాలు చేసి పార్టీ బండిని లాగడం అంటే అసాధ్యమే. దాంతో పాటు బీజేపీ మనిషి అని ముద్ర వేయించుకుంటే తనకు కూడా కొత్త హోదా వస్తుంది. వీలైతే కేంద్ర అధికారం సాయంతో ఏదైన పదవి దక్కుతుందన్న ఆలోచన కూడా పవన్ కల్యాణ్ కి ఉండి ఉండాలి అంటున్నారు.

పదవీయోగమా…?

మొత్తానికి విలీనం దిశగానే పవన్ కల్యాణ్ ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో మోడీ ఏది చెప్పినా వెంటనే ట్విట్టర్ ద్వారా శభాష్ అంటున్నారు. మరి పవన్ ఇలా సాగిలపడినా కూడా బీజేపీ గుర్తిస్తుందా. ఏపీలో వారికి వైసీపీకి ఉన్న బంధాలు సడలిపోతాయా. ఒక్క సీటూ లేని పవన్ కల్యాణ్ పార్టీని విలీనం చేసుకుంటారేమో కానీ పవన్ కి మెగాస్టార్ మాదిరిగా రాజ్యసభ, కేంద్ర మంత్రి పదవి వంటివి దక్కుతాయా. చూడాలి మరి. పవన్ ప్రేమకు బీజేపీ ఇచ్చే బహుమానం ఏమిటో.

Tags:    

Similar News