జనసేనకు వాయిస్ వచ్చింది

ఎన్నికలు జరిగిపోయిన నాలుగు నెలల తరువాత జనసేన సంస్థాగతంగా లోపాలను సవరించుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పదవులను ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ భర్తీ చేస్తూ వస్తున్నారు. [more]

Update: 2019-09-17 06:30 GMT

ఎన్నికలు జరిగిపోయిన నాలుగు నెలల తరువాత జనసేన సంస్థాగతంగా లోపాలను సవరించుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పదవులను ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ భర్తీ చేస్తూ వస్తున్నారు. ఇక విశాఖకు చెందిన ఇద్దరి నాయకులకు రాష్ట్రా స్థాయి అధికార ప్రతినిధి పదవులు దక్కాయి. పర్యావరణ సమస్యలపై చాలా ఏళ్ళుగా పోరాడుతూ వస్తున్న మాజీ కాంగ్రెస్ నేత బొలిశెట్టి సత్యనారాయణ, పదవీ విరమణ చేసిన గ్రూప్ వన్ అధికారి శివశంకర్ లను విశాఖలో పార్టీ గొంతుకలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందే గాజువాకకు చెందిన కోన తాతారావును పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పవన్ కల్యాణ్ మెంబర్ గా తీసుకున్నారు. ఈ విధంగా ముగ్గురు నేతలకు పార్టీ పదవులు పవన్ కల్యాణ్ ఇచ్చి పనిచేయమన్నారు.

వైసీపీ మీద పెద్ద గొంతు……

ఇలా పదవులు వచ్చాయో లేవో వైసీపీ సర్కార్ మీద ఈ నాయకులు పెద్ద గొంతు వేసుకున్నారు. వైసీపీది ఆరంభ శూరత్వ పాలన అంటూ విరుచుకుపడ్డారు. బాగానే ఉంది కానీ ఈ ముగ్గురితో పాటు మిగిలిన వారికి పవన్ కల్యాణ్ కీలకమైన పదవులు ఇస్తే వారు కూడా పనిచేస్తారు కదా అన్న మాట వినిపిస్తోంది. ఇంతవరకూ జిల్లా కమిటీలు లేవని జనసేనలో సణుగుడు వినిపిస్తోంది. రాష్ట్ర స్థాయి నియామకాలే ఇంకా కొనసాగుతున్నాయి. మరి వీర మహిళా విభాగంలో కూడా విశాఖకు పదవులు దక్కలేదు. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. జిల్లా కమిటీలు, మండల కమిటీలు వేసుకుంటే తప్ప గ్రామ స్థాయి నుంచి పార్టీ పెరిగే అవకాశాలు లేవు. జనసేన పటిష్టంగా మారాలంటే సమర్ధులైన నాయకులకు పదవులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అదే విధంగా పవన్ కల్యాణ్ సామాజికవర్గ సమీకరణలు చూసుకుని అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న మాట కూడా ఉంది.

పవనే రాలేదుగా…?

ఇక విశాఖ విషయంలో పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీలో ఆవేదన వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ విశాఖ రాకపోవడం పట్ల కూడా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాజువాకలో నిలబడిన పవన్ కల్యాణ్ తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. మరి పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలు ఏవైనా స్థానిక నాయకులు సరిగ్గా పనిచేయలేదన్న అసంతృప్తి అటు అధినేత పవన్ కల్యాణ్ లో ఉందని అంటున్నారు. అందుకే ఆయన సమీక్షలు ఎంతసేపూ గోదావరి జిల్లాల్లోనే నిర్వహిస్తున్నారు తప్ప ఉత్తరాంధ్ర ఊసు తలవడంలేదని అంటున్నారు. నిజానికి జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికలకు ఏడాది ముందు అంతా విశాఖ, ఉత్తరాంధ్ర అంటూ కలవరించారు. ఆయన కనీసం నెలకు ఒకసారి అయినా ఈ వైపుగా వచ్చేవారు. ఇపుడు పూర్తిగా డుమ్మా కొట్టడం పట్ల సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు అయితే పవన్ కల్యాణ్ కి తనకు ఓటేసిన జనం మీద కనీసం అభిమానం లేదని, అందువల్లనే పోటీ చేసిన గాజువాకకు ఇంతవరకూ రాలేదని సెటైర్లు వేయడం ఈ సందర్భంగా గమనార్హం. మరి పవన్ కల్యాణ్ కమిటీలు పూర్తిస్థాయిలో నియమించి ఈ ప్రాంతంలో పర్యటిస్తే స్థానిక‌ ఎన్నికల నాటికి జనసేన కొంత మేర ఉనికి చాటుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News