జర్నీ ఎంతకాలమో సాగదటగా?

రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. ప్రజల్లో పార్టీ అధినేతపై నమ్మకం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఈ చిన్న లాజిక్ ను మిస్ [more]

Update: 2020-08-17 03:30 GMT

రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. ప్రజల్లో పార్టీ అధినేతపై నమ్మకం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఈ చిన్న లాజిక్ ను మిస్ అయ్యారు. పార్టీ పెట్టి దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. ప్రజల్లోకి సక్రమంగా రాలేకపోయారు. కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరిన పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో తాను కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ బలహీనతలను చెప్పకనే చెబుతోంది.

నిలకడలేని తనంతో…..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది నిలకడలేని మనస్తత్వం. మూడు ఎన్నికల్లో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ఆయన నైజాన్ని చాటుతోంది. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయకపోయినా ఆయన బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. దాదాపు మూడేళ్ల పాటు టీడీపీతో కలసి నడిచారు. ఉద్దానం వంటి సమస్యలను లేవనెత్తి గ్రాఫ్ పెరుగుతుందనుకుంటున్న తరుణంలో 2019 ఎన్నికలకు ముందు తన స్ట్రాటజీని పవన్ కల్యాణ్ మార్చుకున్నారు.

కామ్రేడ్లకు కటీఫ్ చెప్పేసి…..

2019 ఎన్నికల్లో కమ్యునిస్టులతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. కమ్యునిజం అంటే తనకెంతో ఇష్టమని, చిన్నప్పుడు నుంచి ఎర్రజెండా అంటేనే తనకు ప్రీతి అని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. సీపీఎం, సీపీఐ కార్యాలయాలను సందర్శించారు. తెలుగుదేశం, వైసీపీలు అవినీతి పార్టీలంలూ ఆయన ధ్వజమెత్తారు. అయినా ఈ ఎన్నికల్లో తాను సక్సెస్ కాకపోగా కామ్రేడ్లు కూడా ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఎన్నికలు పూర్తయి ఏడాది తిరగక ముందే కామ్రేడ్లతో కటీఫ్ చేప్పేశారు.

బీజేపీతో కూడా ఎక్కువ కాలం…..

ఇక ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తనకు మోదీ అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో పవన్ కల్యాణ‌్ ఎక్కువ కాలం మనగలగరలేరన్నది విశ్లేషకుల అంచనా. ప్రధానంగా రాజధాని అమరావతి అంశంపై బీజేపీ స్టాండ్ పవన్ కల్యాణ‌్ కు నచ్చడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిలువరించ లేక పోతుందంటున్న అభిప్రాయానికి పవన్ కల్యాణ‌్ వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఎప్పుడైనా బీజేపీతో పవన్ కల్యాణ‌ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టేస్తారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అయితే ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికలకు ముందే ఉండవచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి పవన్ కల్యాణ్ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే వీలుందన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News