Badvel : బద్వేలు ఎన్నిక తో ఫుల్లు క్లారిటీ వచ్చేసిందిగా?

బద్వేలు ఉప ఎన్నిక గెలుపు వైసీపీదే అని తేల్చినా రానున్న రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ తెచ్చింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన, టీడీపీ సానుభూతి పరులు [more]

Update: 2021-10-30 05:00 GMT

బద్వేలు ఉప ఎన్నిక గెలుపు వైసీపీదే అని తేల్చినా రానున్న రాష్ట్ర రాజకీయాలపై ఒక క్లారిటీ తెచ్చింది. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన, టీడీపీ సానుభూతి పరులు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న పొత్తులకు ఇది సంకేతమని భావిస్తున్నారు. బద్వేలులో పోలింగ్ ప్రారంభమయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించడం దీనికి అద్దంపడుతుంది.

ఎన్నికకు దూరంగా ఉన్నా…

బద్వేలు ఉప ఎన్నిక వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో అనివార్యమయింది. అయితే వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధకు వైసీపీ టిక్కెట్ ఇవ్వడంతో బరి నుంచి టీడీపీ, జనసేన తప్పుకున్నాయి. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు పోటీకి దిగాయి. అయితే టీడీపీ, జనసేనలకు చెందిన నేతలు ఎవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో ఈ ఎన్నికకు దూరంగా ఉంటాయని భావించారు.

జనసేన నేరుగానే…

కానీ పోలింగ్ రోజు పరిస్థితి అర్థమయింది. జనసేనకు ఎటూ పొత్తు ఉంది కాబట్టి ఆ పార్టీ క్యాడర్ సహజంగానే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సయితం బీజేపీకి తమ మద్దతని ప్రకటించారు. కానీ టీడీపీ బహిరంగంగా ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వలేదు. టీడీపీ నేతలు సయితం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వారి ఓటు బ్యాంకు ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

పోలింగ్ రోజున…

పోలింగ్ రోజు మాత్రం ఈ సందిగ్దతకు టీడీపీ తెరతీసిందనే చెప్పాలి. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా టీడీపీ నేతలు కూర్చోవడంతో క్లారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే టీడీపీ పరోక్షంగా మద్దతు తెలిపిందని అర్థమవుతుంది. రానున్న కాలంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బద్వేలు ఉప ఎన్నికను టీడీపీ ఈ విధంగా ఉపయోగించుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కాంగ్రెస్ ఇక్కడ నామమత్రంగానే ఉండిపోయింది.

Tags:    

Similar News